KCR: నేడు కరీంనగర్ జిల్లా పర్యటనకు కేసీఆర్
ABN, Publish Date - Apr 05 , 2024 | 07:40 AM
కరీంనగర్: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కరీంనగర్ రూరల్ మండలం ముగ్ధుమ్‌పూర్ గ్రామ సమీపంలోని పంటలను ఆయన పరిశీలిస్తారు.
కరీంనగర్: బీఆర్‌ఎస్ అధినేత (BRS Chief), మాజీ సీఎం కేసీఆర్ (Ex CM KCR) కరీంనగర్ జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కరీంనగర్ రూరల్ మండలం ముగ్ధుమ్‌పూర్ గ్రామ సమీపంలోని పంటలను ఆయన పరిశీలిస్తారు. అనంతరం రైతులను (Farmers) పరామర్శిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) నివాసానికి చేరుకుని భోజన కార్యక్రమం ముగించుకున్న తర్వాత 2 గంటలకు బోయినపల్లి మండల కేంద్రం పరిసరాల్లో పర్యటిస్తారు. ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించి రైతులను పరామర్శిస్తారు. సాయంత్రం 3 గంటలకు శాభాష్‌పల్లి వద్ద మధ్యమానేరు ప్రాజెక్టును పరిశీలించి, సాయంత్రం నాలుగు గంటలకు సిరిసిల్లలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడతారు.
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పొలంబాట పడుతున్నారు. సాగునీరందక పొలాలు ఎండుతుంటే రైతన్నలను కలిసి పరామర్శించి వారి కష్టసుఖాలు తెలుసుకునేందుకు ఆయన శుక్రవారం ఉదయం కరీంనగర్ జిల్లాకు రానున్నారు. కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్ గ్రామంలో సాగునీరందక ఎండిన పంట పొలాలను ఆయన పరిశీలిస్తారు. రైతులతో మాట్లాడి సాగునీటి కొరత, అందుకు కారణాలను, ఇతరసమస్యలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం ఆయన బోయినపల్లి, వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల్లో పర్యటించి సాగునీటి సమస్యలను తెలుసుకుంటారు.
కాగా కేసీఆర్ పొలంబాట కార్యక్రమాన్ని ప్రకటించగానే కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో బీఆర్‌ఎస్ నాయకులు, శ్రేణులు జిల్లాల్లో రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి కరువుకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ నేతలు కలెక్టర్‌ను కలిసి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం సమర్పించారు. చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని రామడుగు, గంగాధర మండలాల్లో పంట పొలాలు ఎండి పోతున్నాయని, సాగునీటి సమస్యను పరిష్కరించాలని, ఎండిన పొలాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కరీంనగర్-నిజమాబాద్ రహదారిపై ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ పార్టీ మాజీ మంత్రి, పెద్దపల్లి ఎంపీ అభ్యరి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లిలో 36 గంటల రైతు నిరసన దీక్షను చేపట్టారు.
Updated Date - Apr 05 , 2024 | 07:45 AM