MLC Jeevan Reddy: ఆ గురుకుల పాఠశాలలో వరస మరణాలు బాధాకరం..
ABN, Publish Date - Aug 09 , 2024 | 02:32 PM
మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల వరస మరణాలు బాధాకరమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఇవాళ(శుక్రవారం) తెల్లవారుజామున ఇద్దరు విద్యార్థులు తీవ్ర కడుపునొప్పితో అస్వస్థతకు గురి కాగా.. వారిలో ఒకరు మృతిచెందారు. విషయం తెలుసుకున్న జీవన్ రెడ్డి, లక్ష్మణ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
జగిత్యాల: మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల వరస మరణాలు బాధాకరమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఇవాళ(శుక్రవారం) తెల్లవారుజామున ఇద్దరు విద్యార్థులు తీవ్ర కడుపునొప్పితో అస్వస్థతకు గురి కాగా.. వారిలో ఒకరు మృతిచెందారు. విషయం తెలుసుకున్న జీవన్ రెడ్డి, లక్ష్మణ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
పెద్దాపూర్ గురుకులంలో విద్యార్థులు అనిరుద్, మోక్షిత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, అందులో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అనిరుద్ మృతిచెందినట్లు తమకు సమాచారం అందిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు. సమాచారం అందగానే హుటాహుటిన వచ్చినట్లు ఆయన తెలిపారు. ఘటనపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాస్థాయి అధికారులతో మాట్లాడామని, బాధ్యులెవరైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే గురుకులాలు వెనకపడ్డాయని ఎమ్మెల్యే లక్ష్మణ్ మండిపడ్డారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గురుకులాల్లో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సంజయ్ తండ్రి పదేళ్లపాటు అధికారంలో ఉండి గురుకులాలకు ఏం చేసింది చెప్పాలంటూ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఘటనకు కారణమైన వారిని ఎవ్వరినీ వదిలేది లేదని ఎమ్మెల్యే లక్ష్మణ్ హెచ్చరించారు.
కాగా.. జులై 27న సైతం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో రాత్రి సమయంలో నిద్రపోతున్న హర్షవర్ధన్, ఆడేపు గణేశ్ అనే ఇద్దరు విద్యార్థులను పాము కాటు వేసింది. దీంతో వారిద్దరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిద్దరనీ నిజామాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అదే రోజు వారితోపాటే నిద్రిస్తున్న మెట్‌పల్లి ఆరపేటకు ఘనాదిత్య తెల్లవారే సరికి శవమై తేలాడు. విద్యార్థి నిద్రలోనే కాళ్లు, చేతులు వంకర్లు తిరిగి మృతిచెందాడు. ఇలా వరసగా తమ పిల్లలు మృత్యువాత పడడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. విషయం తెలుసుకున్న అధికార పక్ష నేతలు వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులు, తల్లిదండ్రులకు ధైర్యం చెప్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరిస్తున్నారు.
Updated Date - Aug 09 , 2024 | 02:32 PM