Karthika Masam: శ్రీగిరిపై కార్తీక కాంతులు
ABN, Publish Date - Nov 11 , 2024 | 04:10 AM
నంద్యాల జిల్లాలోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులు కలిసి కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనార్థం క్షేత్రానికి తరలివచ్చారు.
భక్తులతో కిక్కిరిసిన క్షేత్ర వీధులు
శ్రీశైలం, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులు కలిసి కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనార్థం క్షేత్రానికి తరలివచ్చారు. దీంతో ఆలయ క్యూలైన్లు, ప్రధాన వీధులలో రద్దీ నెలకొంది. వేకువజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, గంగమ్మకు దీప హారతులు, నైవేద్యాలు నివేదించి మొక్కులు తీర్చుకున్నారు.
స్వామి, అమ్మవార్ల దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. కార్తీకమాసం శని, ఆది, సోమవారం రోజులలో భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులందరికీ స్వామివారి అలంకరణ దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. ఉదయం నుంచే భక్తులు ఆలయ ఉత్తర మాఢవీధి ప్రాంగణం వద్ద, దేవాలయం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద విశేష పూజలు నిర్వహించుకుని దీపారాధనలు చేశారు. సాయంత్రం ఆలయ ప్రధాన ధ్వజస్తభం వద్ద శాస్త్రోక్తంగా ఆకాశ దీపం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్తీకమాసోత్సవాల సందర్భంగా దేవస్థానంలో అఖండ శివ భజనల కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది.
Updated Date - Nov 11 , 2024 | 04:10 AM