Telangana : కవితే కింగ్‌పిన్!
ABN, Publish Date - May 29 , 2024 | 04:57 AM
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కల్వకుంట్ల కవితే కింగ్‌పిన్ అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి బలమైన వాదనలు వినిపించింది. ఢిల్లీ మద్యం పాలసీలో ఆమెది కీలకపాత్ర అని కోర్టుకు వివరించింది. కవిత పాత్ర లేకపోతే ఆమె సాక్ష్యాలను ఎందుకు ధ్వంసం చేశారని ప్రశ్నించింది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమెది కీలకపాత్ర.. కాదంటే సాక్ష్యాలను ఎందుకు ధ్వంసం చేసినట్లు?
కవిత సాధారణ మహిళ కాదు.. పొలిటికల్ పవరున్న మహిళ
సాక్షులను బెదిరించారు
బెయిల్ ఇవ్వొద్దు.. ఈడీ వాదనలు
పాత ఫోన్లను పనివాళ్లకిచ్చారు
అప్పుడు డేటా తొలగింపు సాధారణమే: కవిత న్యాయవాది
బెయిల్‌పై తీర్పు రిజర్వు
న్యూఢిల్లీ/హైదరాబాద్, మే 28 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కల్వకుంట్ల కవితే కింగ్‌పిన్ అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి బలమైన వాదనలు వినిపించింది. ఢిల్లీ మద్యం పాలసీలో ఆమెది కీలకపాత్ర అని కోర్టుకు వివరించింది. కవిత పాత్ర లేకపోతే ఆమె సాక్ష్యాలను ఎందుకు ధ్వంసం చేశారని ప్రశ్నించింది. దర్యాప్తు సంస్థలు తనను అక్రమంగా అరెస్టు చేశాయని, తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టులో తిరస్కరించడంపై ఆమె ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారించింది.
కవిత తరఫున వాదనలు సోమవారంతో ముగియగా మంగళవారం దర్యాప్తు సంస్థల వాదనలు కొనసాగాయి. ఈడీ తరఫున సీనియర్ న్యాయవాది జోహెబ్ హుేస్సన్ వాదనలు వినిపిస్తూ.. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత కీలకంగా వ్యవహరించారని, ఇందుకు సంబంధించి బలమైన సాక్ష్యాలున్నాయని తెలిపారు. కవితను విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన మరుసటి రోజే ఆమె ఫోన్లను ఫార్మాట్ చేశారని పేర్కొన్నారు. ‘‘2023 మార్చి 7న అరుణ్ పిళ్లైని అరెస్ట్ చేశాం.
నవంబరు 11న కవితకు వ్యతిరేకంగా పిళ్లై వాంగ్మూలం ఇచ్చారు. 118 రోజుల తర్వాత కవిత ఒత్తిడితో పిళ్లై తన ేస్టట్‌మెంట్‌ను వెనక్కి తీసుకున్నారు. కవిత ప్రాక్సీగా సౌత్ గ్రూప్‌కు చెందిన ఇండో స్పిరిట్‌లో పిళ్లైకి 33శాతం వాటాలు ఉన్నాయి. పిళ్లై ద్వారా కవిత దాదాపు రూ.35 కోట్లు లబ్ధి పొందే ప్రయత్నం చేశారని ఆమె మాజీ ఆడిటర్ బుచ్చిబాబు చెప్పారు. ఈ డబ్బును కవిత కోసం పిళ్లై హోల్డ్‌లో పెట్టారు. రూ.32 కోట్లు కవిత కోసం, మరో రూ.4.75 కోట్లు ఇండియా ఎహెడ్ సంస్థకు మళ్లించారు. ఇండియా ఎహెడ్ కవితకు హోనింగ్ కంపెనీగా ఉంది’’ అని ఈడీ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
ఆధారాలు ఎందుకు ధ్వంసం చేశారు?
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవితకు సంబంధం లేకుంటే ఆధారాలను ఎందుకు ధ్వంసం చేశారని ఈడీ న్యాయవాది ప్రశ్నించారు. మద్యం పాలసీ రూపకల్పన సమయంలో, ఆ తర్వాత దాదాపు రెండేండ్లపాటు వినియోగించిన ఫోన్లు సమర్పించాలని గతేడాది మార్చి 11న కవితను కోరామని, కానీ.. ఆమె మార్చి 21న తొమ్మిది ఫోన్లను అప్పగించారని తెలిపారు. పైగా.. వీటిలో కీలక సమాచారం ఉన్న నాలుగు ఫోన్లను కవితకు నోటీసులు ఇచ్చిన తర్వాత ఫార్మాట్ చేశారని కోర్టుకు వివరించారు.
మార్చి, 14, 15 తేదీల్లో ఈ ఫోన్లను ఫార్మాట్ చేసి, ఆధారాలను క్లీన్ చేసినట్లు ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఆధారాల ధ్వంసం, నిందితులపై ఒత్తిడి చేసినందుకుగాను సెక్షన్ 439 ప్రకారం కవితకు బెయిల్ మంజూరు చేయకూడదని అన్నారు. కవిత సాధారణ మహిళ కాదని, పొలిటికల్ పవర్ ఉన్న మహిళ అని చెప్పారు. ఆమె ఈ స్కాంలో కీలకంగా వ్యవహరించారని, పైగా ఒక సాక్షిని బెదిరించినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బెయిల్ విషయంలో కవిత తీరును కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
పైసా కూడా కవిత ఖాతాకు చేరలేదు...
ఢిల్లీ మద్యం పాలసీలో ఒక్క పైసా కూడా కవిత ఖాతాకు చేరలేదని ఆమె తరఫు సీనియర్ న్యాయవాది నితేష్ రాణా అన్నారు. ఆయన వాదనలు వినిపిస్తూ.. ఈడీ కేసులో బుచ్చిబాబును నిందితుడిగా చేర్చకపోవడం, అరెస్టు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. బుచ్చిబాబు ేస్టట్‌మెంట్లను కోర్టు పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. 2023 ఆగస్టు తర్వాత ఎలాంటి కొత్త సాక్ష్యాలనూ ఈడీ చూపలేదని పేర్కొన్నారు. కవిత తన పాత ఫోన్లను ఇంట్లో పనిచేసే వారికి ఇచ్చారని, వేరేవాళ్లకు ఫోన్లు ఇచ్చేటప్పుడు అందులో డేటాను తొలగించి ఇవ్వడం సాధారణంగా జరిగే విషయమేనని చెప్పారు. ఢిల్లీ మద్యం పాలసీలో కోట్ల రూపాయలు చేతులు మారాయని ఈడీ ఆరోపిస్తోందని, కానీ అందులో ఒక్క రూపాయి కూడా కవిత ఖాతాకు చేరినట్టు ఒక్క సాక్ష్యాన్ని కూడా చూపలేకపోయిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కవిత అరెస్టు విషయంలో సీబీఐ కనీస నిబంధనలు పాటించలేదని చెప్పారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు.
ఈడీ వాదన సమయంలో అయోమయం?
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో కవిత పాత్ర గురించి వివరిస్తున్న సందర్భంలో ఈడీ న్యాయవాది జోహెబ్ హుేస్సన్‌కి చేసిన వ్యాఖ్యలు అయోమయానికి దారితీశాయి. లిక్కర్ డీల్.. ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో జరిగిందనే అనుమానం వచ్చేలా ఆయన మాట్లాడారు. సౌత్ గ్రూప్ సభ్యులను కవిత తన తండ్రికి ఢిల్లీలోని నివాసంలో పరిచయం చేశారన్నట్లుగా జోహెబ్ హుస్సేన్ వ్యాఖ్యానించారు. అయితే ఆ తర్వాత ఈడీ దాఖలు చేసిన అఫిడవిట్‌లో మాగుంట రాఘవరెడ్డి తండ్రి మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఆయన నివాసంలో గ్రూపు సభ్యులను పరిచయం చేసినట్టు ఉంది. ఈడీ వాదనల సమయంలో ‘హిజ్ ఫాదర్’కు బదులుగా న్యాయవాది, ‘హర్ ఫాదర్’ అని పలకడంతో ఈ అయోమయం తలెత్తింది. దీనిపై కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు స్పష్టత ఇచ్చారు. వాదనల్లో ఈడీ కేసీఆర్ ప్రస్తావన తీసుకురాలేదని, కొందరు కావాలనే ఆయనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ కేసులో ఎక్కడా ఈడీ కేసీఆర్ పేరును రాయలేదని ఒక ప్రకటనలో తెలిపారు. మాగుంట రాఘవ వాంగ్మూలాన్ని ఈడీ ప్రస్తావించిందని, మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కేసీఆర్ పేరుకు అన్వయించి మీడియాలో ప్రసారం చేయడం తగదని అన్నారు.
Updated Date - May 29 , 2024 | 04:57 AM