TG: కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే..
ABN, Publish Date - Apr 30 , 2024 | 06:09 AM
కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని.. ప్రధాని మోదీ చెబుతున్నట్టు ఈసారి ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు కాదు కదా 200 సీట్లకు మించి రావని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు.
బీజేపీకి 200 సీట్లకు మించి రావు.. సంకీర్ణ సర్కారులో మంత్రిగా నామా
గోదావరి జలాల తరలింపునకు మోదీ ప్రయత్నిస్తుంటే కిషన్‌రెడ్డి, రేవంత్ మాట్లాడరే?
ఖమ్మం రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్న
ఖమ్మం, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని.. ప్రధాని మోదీ చెబుతున్నట్టు ఈసారి ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు కాదు కదా 200 సీట్లకు మించి రావని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. గోదావరి జలాలను ఇచ్చంపల్లి నుంచి కర్ణాటక, తమిళనాడుకు తరలించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తుంటే.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు నోరు మెదపడంలేదని నిలదీశారు.
వారిద్దరూ చేతకాని దద్దమ్మలని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో రోడ్ షో నిర్వహించి, ప్రజలనుద్దేశించి మాట్లాడిన ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. మహబూబాబాద్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మీదుగా సోమవారం రాత్రి ఖమ్మం నగరానికి చేరుకున్న కేసీఆర్.. స్థానిక మయూరిసెంటర్ నుంచి జడ్పీసెంటర్ వరకు రోడ్‌షో నిర్వహించారు. అక్కడ జరిగిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. గిట్టుబాటు ధర లేక రైతులకు నష్టం జరుగుతుంటే రాష్ట్ర క్యాబినెట్‌తో వెళ్లి ఢిల్లీలో ధర్నా చేస్తే కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు రైతుల సమస్యను పట్టించుకోలేదన్నారు.
వీరికి ఓట్లు, సీట్లు కావాలే తప్ప తెలంగాణ సమస్యలు పట్టవన్నారు. ఖమ్మం జిల్లాను 75 ఏళ్లుగా ఎవరు పట్టించుకోలేదని.. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో 37 టీఎంసీల నీటిని జిల్లాకు తరలించి సస్యశ్యామలం చేసేందుకు సీతారామ ప్రాజెక్టు ఏర్పాటు చేసుకున్నామని.. సాగర్‌లో నీరు లేకపోయినా గోదావరి జలాలతో పంటలు పండించేందుకు ప్రాజెక్టు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ఇప్పుడు గోదావరి జలాలు ఇచ్చంపల్లి దగ్గర ఎత్తుకెళితే జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని మోదీ గోదావరి జలాలు తరలించే ప్రతిపాదన తెస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రానికి వచ్చే నీళ్ల లెక్క తేల్చేదాకా తన తల తెగిపడినా సరే నీరు తీసుకెళ్లేందుకు ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పానన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ 12 ఎంపీ సీట్లు గెలవబోతోందని.. ఖమ్మంలో నామాను గెలిపిస్తే కేంద్రంలో వచ్చే సంకీర్ణ్ణ ప్రభుత్వంలో ఆయన కేంద్రమంత్రి అవుతారని పేర్కొన్నారు.
గెలిపించండి ప్లీజ్..
బీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్టీఆర్, చంద్రబాబు స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలో రూ.50వేల కోట్ల అభివృద్ధి జరిగిందని వెల్లడించారు. తెలంగాణవాణి పార్లమెంట్‌లో వినిపించాలంటే బీఆర్‌ఎస్ ఎంపీలను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం జడ్పీసెంటర్ నుంచి శ్రీశ్రీ సర్కిల్ వరకు బస్సుయాత్ర నిర్వహించారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు బస్సుయాత్ర వెంట పరుగులు తీశారు. కేసీఆర్ రాత్రి మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నివాసంలో బస చేశారు.
Updated Date - Apr 30 , 2024 | 06:09 AM