KCR: రౌడీ పంచాయితీలు మాకూ తెలుసు
ABN, Publish Date - Nov 10 , 2024 | 01:56 AM
‘‘రౌడీ పంచాయితీలు చేయడం మాకూ వచ్చు. తిట్టడం కూడా వచ్చు. ఈరోజు తిట్టడం మొదలు పెడితే.. రేపటి వరకు తిడతా నేను’’ అని మాజీ సీఎం, బీఆర్‌ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.
తిట్టడం మొదలెడితే రేపటి వరకు తిడతా
ప్రజల్ని కాపాడాలి గానీ భయపెడతారా?
ఏం కోల్పోయామో ప్రజలకు అర్థమైంది
వచ్చేది 100% బీఆర్‌ఎస్ ప్రభుత్వమే సర్కారుపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్
హైదరాబాద్, మర్కుక్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ‘‘రౌడీ పంచాయితీలు చేయడం మాకూ వచ్చు. తిట్టడం కూడా వచ్చు. ఈరోజు తిట్టడం మొదలు పెడితే.. రేపటి వరకు తిడతా నేను’’ అని మాజీ సీఎం, బీఆర్‌ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రజలు తమకు సేవ చేసే అధికారాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారని చెబుతూ.. ‘‘ప్రభుత్వం ప్రజలను కాపాడాలే తప్ప.. భయపెడతారా?’’ అంటూ మండిపడ్డారు. శనివారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్‌హౌ్‌సలో ఆయన పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, నియోజకవర్గ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సినీ నిర్మాత పరపాటి శ్రీనివా్‌సరెడ్డి, సినీ ఆర్టిస్ట్ రవితేజ తదితరులు కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఈ 11 నెలల్లో ఏం కోల్పోయారో పరజలకు అర్థమైందన్నారు. ప్రజలు కాంగ్రె్‌సకు అధికారమిచ్చింది కూల్చడానికి కాదని, నిర్మించడానికని అన్నారు. ప్రభుత్వం అంటే.. అందరినీ కాపాడుకోవాలని, పిచ్చిపిచ్చిగా మాట్లాడడం కాదన్నారు. సమాజాన్ని నిలబెట్టి, నిర్మించాలని హితవుపలికారు.
‘‘రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో 100% మనమే అధికారంలోకి రాబోతున్నాం. అందులో ఎలాంటి అనుమానం లేదు. ప్రజలు ఏం కోల్పోయారో వారికి అర్థమైంది. ప్రజలు మనపై విశ్వాసంతో ఉన్నారు. మనమంతా కష్టపడి పనిచేయాలి’’ అని సూచించారు. అధికారంలోకి రాగానే వాడిని లోపలేయాలి.. వీడిని లోపలేయాలని చూడబోమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఎలా మాట్లాడుతున్నారో అంతా స్వయంగా చూస్తున్నారని అన్నారు. ప్రజలు అధికారమిచ్చింది సేవ చేయడానికా? లేనిపోని మాటలతో కాలయాపన చేయడానికా అని కాంగ్రెస్ సర్కారును ప్రశ్నించారు. ‘‘గత ఎన్నికల్లో మన మ్యానిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు 10 శాతమే. కానీ, ఎవరూ అడగకున్నా 90% పనులు చేసి, చూపించాం. వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే. కార్యకర్తలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని భరోసా ఇచ్చారు. కాగా, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ బీఆర్‌ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ మూసీని వ్యతిరేకిస్తే కేసీఆర్‌ను ఖండఖండాలుగా నరికి మూసీలో వేస్తామంటూ వ్యాఖ్యలు చేశారని.. ఇది శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉందని శనివారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిద్దరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్రను కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో బాల్కసుమన్, దాసోజు శ్రవణ్ తదితరులున్నారు.
కేసీఆర్ పేరు చెరపలేరు: కేటీఆర్
హైదరాబాద్, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): తెలంగాణ కోసం ఉద్యమం చేసి, సాధించిన రాష్ట్రాన్ని సగర్వంగా తలెత్తుకునేలా చేసిన కేసీఆర్.. ఈ రాష్ట్రానికి గర్వకారణమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన మీద పిచ్చి ప్రచారాలు చేస్తూ, దుర్భాషలాడి.. చరిత్ర నుంచి కేసీఆర్ పేరు చెరిపేయవచ్చని అనుకోవటం మూర్ఖత్వమే అవుతుందన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పేరును ఎవరూ చెరిపేయలేరని, తెలంగాణ ఉన్నంత కాలం ఆయన పేరు ఉంటుందని అన్నారు. దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సాయం చేయాలని అడిగితే.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేస్తారా..? అని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డిపై దాడిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Updated Date - Nov 10 , 2024 | 01:57 AM