ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kaleshwaram Project: నిర్ణయాలన్నీ కేసీఆర్‌వే..

ABN, Publish Date - Oct 29 , 2024 | 03:05 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించడానికి స్థలాలను ఎంపిక చేయడం; బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడం; ఆ నిల్వలను పెంచడం వంటి కీలక నిర్ణయాలన్నిటినీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆరే తీసుకున్నారని రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు వెల్లడించారు.

  • కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల స్థలాల ఎంపిక ఆయనదే

  • నీటిని నిల్వ చేయాలన్నదీ మాజీ ముఖ్యమంత్రే.. హై పవర్‌ కమిటీ సమావేశాల్లోనే నిర్ణయాలు

  • జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌తో మాజీ ఈఎన్సీ.. సంబంధిత పత్రాలు అందజేసిన నల్లా వెంకటేశ్వర్లు

  • అంచనాలు, సవరణలకూ కేసీఆరే ఆమోదం తెలిపారని వెల్లడి

హైదరాబాద్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించడానికి స్థలాలను ఎంపిక చేయడం; బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడం; ఆ నిల్వలను పెంచడం వంటి కీలక నిర్ణయాలన్నిటినీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆరే తీసుకున్నారని రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈ మేరకు తగిన ఆధారాలను; సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో జరిగిన సమావేశ పత్రాలను జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ కమిషన్‌కు సమర్పించారు. కాళేశ్వరం బ్యారేజీలపై విచారణలో భాగంగా సోమవారం ఆయన మరోసారి కమిషన్‌ ఎదుట క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు హాజరయ్యారు. ఇంతకుముందు కమిషన్‌ అడిగిన 16 ప్రశ్నలకు సంబంధించి తాను ఇచ్చిన జవాబులకు అనుగుణంగా సంబంధిత పత్రాలను అందజేశారు.


డీపీఆర్‌ తయారీ బాధ్యతను వ్యాప్కో్‌సకు అప్పగించాలని ఆదేశించింది ఎవరు? ఆ డీపీఆర్‌లకు ఎవరు ఆమోదం తెలిపారు!? బ్యారేజీలను ఫలానా ప్రాంతాల్లోనే కట్టాలని ఆదేశాలు ఇచ్చింది ఎవరు? అని కమిషన్‌ గత విచారణలో ప్రశ్నించగా.. మాజీ సీఎం కేసీఆరేనని చెప్పిన ఆయన.. ఇప్పుడు అందుకు సంబంధించిన పత్రాలను అందించారు. అప్పటి సీఎం కేసీఆర్‌ ఆదేశాలతోనే హై పవర్‌ కమిటీ (హెచ్‌పీసీ) ఏర్పాటైందని, ఆ కమిటీ సమావేశంలోనే ఫలానా ప్రాంతాల్లో బ్యారేజీలు కట్టాలంటూ నిర్ణయం తీసుకున్నారని చెబుతూ.. హెచ్‌పీసీ సమావేశం తాలూకు మినిట్స్‌ను అందించారు. అలాగే, బ్యారేజీల వ్యయ అంచనాలకు, సవరణ అంచనాలకు ఎవరు ఆమోదం తెలిపారని కమిషన్‌ అడగ్గా.. కేసీఆరేనంటూ పత్రాలు సమర్పించారు. బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయాలని, ఆ నీటి నిల్వలను కొనసాగించాలని ఎవరు ఆదేశించారని ప్రశ్నించగా.. ప్రభుత్వాధినేత అంటూ కేసీఆర్‌ పేరు ఎత్తకుండా జవాబు ఇచ్చారు.


బ్యారేజీల్లో సీకెంట్‌ పైల్స్‌ వినియోగించాలని చెప్పిందెవరని కమిషన్‌ ప్రశ్నించగా.. సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో) సిఫారసు చేసిందంటూ ఆధారాలను అందించారు. మూడు బ్యారేజీల జయో టెక్నికల్‌ పరీక్షలకు సంబంధించి 14 వాల్యూమ్‌ల నివేదికలను సమర్పించారు. బ్యారేజీల వద్ద టెయిల్‌ వాటర్‌ లేకపోవడం కూడా మేడిగడ్డలో బ్లాక్‌-7 కుంగుబాటుకు కారణమని, పిల్లర్లు 18, 19, 20 దెబ్బతినడానికి ప్రధాన కారణమని గుర్తు చేశారు. బ్యారేజీల్లో 2డీ, 3డీ అధ్యయనాలు మళ్లీమళ్లీ చేయాల్సి వచ్చిందా? అని కమిషన్‌ ప్రశ్నించగా.. అవునని బదులిస్తూ సంబంధిత పత్రాలనూ అందించారు. 3 బ్యారేజీల్లో ఐఎస్‌ కోడ్‌ 7349:2012లోని క్లాజులన్నీ పాటించారా అని కమిషన్‌ ప్రశ్నించగా.. అమలు చేశామని చెప్పారు. బ్యారేజీలు దెబ్బతిన్న తర్వాత వాటిని పరిశీలించి, మరమ్మతులు చేయాలని ఆదేశాలు ఇచ్చారా అని ఆరా తీయగా.. ఇచ్చానని వెంకటేశ్వర్లు తెలిపారు.


  • డిజైన్ల లోపం, ఓ అండ్‌ ఎం వైఫల్యమే కారణం

మేడిగడ్డలోని బ్లాక్‌-7 కుంగుబాటు, పలు పిల్లర్లు దెబ్బతినడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీలకు డి జైన్ల ప్రకారం నిర్మాణం చేయకపోవడం, 2019 వరదల తర్వాత బ్యారేజీల దిగువ, ఎగువ భాగాల్లో ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ పనులు చేయకపోవడమే కారణమని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం కమిషన్‌కు నివేదిక అందించింది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌కు సహాయంగా నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విష యం తెలిసిందే. రికార్డులను, బ్యారేజీలను పరిశీలించి ఆ కమిటీ సోమవారం తన నివేదికను కమిషన్‌కు సమర్పించింది.


వరద ప్రవాహానికి అనుగుణంగా డి జైన్‌ జరగలేదని, డిజైన్‌ ఒక విధంగా ఇస్తే.. నిర్మాణం మరో విధంగా జరిగిందని, నీటిని మళ్లించడానికే బ్యారేజీలను నిర్మించారని, కానీ, నీటిని మళ్లించకుండా దీర్ఘకాలం నిల్వ చేయడంతో ఇసుక మైనింగ్‌ జరిగి బ్లాకు కుంగిందని వివరించింది. సీకెంట్‌ పైల్స్‌ సక్రమంగా వేయకపోవడం కూడా బ్యారేజీల వైఫల్యానికి కారణమని నివేదించినట్లు సమాచారం. ఇక ఈ దఫా క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. మంగళవారం కమిషన్‌ కార్యాలయానికి వచ్చిన అనంతరం సాయంత్రం జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ కోల్‌కతాకు తిరిగి వెళ్లనున్నారు. తదుపరి విచారణ నవంబరులో ప్రారంభం కానుంది.

Updated Date - Oct 29 , 2024 | 03:05 AM