రాజకీయ శరణార్థిగా గుర్తించండి!
ABN, Publish Date - Nov 30 , 2024 | 04:19 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు దర్యాప్తు అధికారులకు షాక్ ఇచ్చారు.
అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్‌రావు విజ్ఞప్తి
ఫోన్‌ట్యాపింగ్ కేసులో తెలంగాణ సర్కార్ వేధింపులకు గురిచేస్తోంది
భారత్‌లో తనకు రక్షణ లేదని తెలిపిన ఎస్‌ఐబీ మాజీ చీఫ్
విదేశాంగ శాఖను ఆశ్రయించనున్న దర్యాప్తు అధికారులు
షికాగోలో శ్రవణ్‌కుమార్.. ఇంటర్‌పోల్ సాయంతో రప్పించే యత్నం
హైదరాబాద్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు దర్యాప్తు అధికారులకు షాక్ ఇచ్చారు. ఓవైపు అధికారులు ఆయన్ను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నిస్తుండగా.. మరోవైపు ఆయన ఏకంగా తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థులు, బడా వ్యాపారుల్ని లక్ష్యంగా చేసుకుని, నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ప్రభాకర్‌రావు బృందం ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడినట్లు కేసు దర్యాప్తులో గుర్తించిన సంగతి తెలిసిందే. గత డిసెంబరు 10న కేసు నమోదైన మరుసటిరోజే ప్రభాకర్‌రావు అమెరికా వెళ్లిపోయారు. అప్పటి నుంచి దర్యాప్తు అధికారులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించగా.. అమెరికాలో చికిత్స పొందుతున్నానని ఆన్‌లైన్‌లో విచారణకు అందుబాటులో ఉంటానని సమాచారం ఇచ్చారు. అధికారులు ఇంటర్‌పోల్ సహకారంతో ప్రభాకర్‌రావును భారత్‌కు రప్పించే ప్రయత్నంలో ఉండగా.. ఆయన ఏకంగా రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భారత్‌లో తనకు రక్షణ లేదని, అనారోగ్యంతో బాధపడుతున్న తనను కేసుల పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని అమెరికా ప్రభుత్వానికి తెలిపారు. తెలంగాణలో కీలక హోదాలో పనిచేశానని, ఇప్పుడు కేసుల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నట్లు చెప్పారు. ఆయన విజ్ఞప్తిపై అమెరికా నిఘా వర్గాలు విచారణ జరిపిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
కేంద్రాన్ని ఆశ్రయించనున్న అధికారులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు, నిందితులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. కేసు నమోదైనప్పటి నుంచి ప్రభాకర్‌రావు అమెరికాలో తలదాచుకుంటున్నారు. ఎలాగైనా ఆయన్ను భారత్‌కు రప్పించి విచారించాలని భావించిన అధికారులు.. సీబీఐ, ఇంటర్‌పోల్ సహకారంతో రెడ్‌కార్నర్ నోటీసు ఇచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ విషయం తెలుసుకున్న ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్న కుటుంబ సభ్యుల సహకారంతో గ్రీన్‌కార్డు పొందినట్లు తెలిసింది. ఇప్పుడు ఏకంగా రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అక్కడి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో దర్యాప్తు అధికారులు కేంద్ర విదేశాంగ శాఖను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. అమెరికాలో గ్రీన్ కార్డు పొందినా.. ఇక్కడ పౌరుల భద్రతకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నేపథ్యంలో రెడ్‌కార్నర్ నోటీసుతో రప్పించి విచారించేందుకు అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ‘‘ప్రభాకర్‌రావు అమెరికా ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి మా దృష్టికి వచ్చింది. అయితే ఈ విషయంలో రాష్ట్ర పోలీసుల ప్రమేయం ఏమీ ఉండదు. అమెరికా నిఘా విభాగం విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటుంది’’ అని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
శ్రవణ్ కుమార్ కోసం వేట ముమ్మరం..
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ6గా ఉన్న శ్రవణ్ కుమార్‌ను అరెస్ట్ చేసేందుకు అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం శ్రవణ్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన షికాగోలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఇంటర్‌పోల్ సహకారంతో పట్టుకునేందుకు చర్యలు వేగవంతం చేశారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేసి ఏడాది కావస్తున్న నేపథ్యంలో కేసును ఓ కొలిక్కి తేవడంపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరిని ప్రశ్నించగా.. మరికొందరికి నోటీసులు జారీ చేస్తున్నారు.
Updated Date - Nov 30 , 2024 | 04:19 AM