Kishan Reddy: హైడ్రా పేరుతో హైడ్రామా..
ABN, Publish Date - Aug 25 , 2024 | 03:13 AM
హైడ్రా పేరుతో రాష్ట్రంలో హైడ్రామా నడుస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తోందని విమర్శించారు.
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ/హైదరాబాద్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): హైడ్రా పేరుతో రాష్ట్రంలో హైడ్రామా నడుస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తోందని విమర్శించారు. ‘‘అక్రమ నిర్మాణాలకు అప్పుడు ఎలా అనుమతులు ఇచ్చారు..? విద్యుత్, నీటి సదుపాయం ఎలా కల్పించారు..? రోడ్లను నిర్మించి సదుపాయాలు ఎలా కల్పించారు..?’’ అని నిలదీశారు.
అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ చర్యలైనా, చట్టమైనా అందరికీ సమానంగా వర్తింపచేయాలని కోరారు. శనివారం ఢిల్లీలోని తన నివాసంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో జతకట్టడం ద్వారా.. కాంగ్రెస్ కుట్రలు మరోసారి బహిర్గతమయ్యాయని అన్నారు.
కాగా, బీబీనగర్‌లోని ఎయిమ్స్‌కు అనుబంధంగా అర్బన్ హెల్త్, ట్రైనింగ్ సెంటర్(యూహెచ్‌టీసీ)ను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్‌లో 2 ఎకరాల భూమిని కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. అంత వరకు తాత్కాలికంగా ఏదైనా ప్రభుత్వ భవనాన్ని కేటాయించాలని కోరారు. యూహెచ్‌టీసీ ద్వారా వైద్య విద్యార్థులకు అవసరమైన బోధన, శిక్షణతో పాటు నగర ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి వీలు కలుగుతుందని తెలిపారు.
సీఎం రేవంత్‌కు నాంపల్లి కోర్టు నోటీసులు
కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేసే అవకాశం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై నాంపల్లి స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు నోటీసులు జారీ చేసిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై తాము కోర్టులో ఫిర్యాదు చేశామని.. దీంతో ఆయనకు న్యాయస్థానం నోటీసులు ఇచ్చిందని.. సెప్టెంబరు 25న కోర్టుకు రావాలని ఆదేశించిందని తెలిపారు.
Updated Date - Aug 25 , 2024 | 03:13 AM