రాష్ట్రంలో మట్టి రోడ్డు లేకుండా చేస్తాం
ABN, Publish Date - Oct 30 , 2024 | 05:42 AM
రాష్ట్రంలో ఎక్కడా మట్టి రోడ్లు లేకుండా చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.
రూ.12 వేల కోట్లతో 17 వేల కి.మీ. రోడ్ల నిర్మాణం
రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్లగొండ, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలో ఎక్కడా మట్టి రోడ్లు లేకుండా చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. గ్రామాల్లో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖల ద్వారా త్వరలో రూ.12 వేల కోట్ల వ్యయంతో 17 వేల కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించనున్నట్లు తెలిపారు. మంగళవారం మంత్రి నల్లగొండ జిల్లాలోని పగిడిమర్రి, ముషంపల్లిలో రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రహదారుల విస్తరణలో భాగంగా రూ.30 వేల కోట్లతో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని వెల్లడించారు. బీఆర్‌ఎస్ నేతలు పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. దీపావళి తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభిస్తామని, ప్రతి నియోజకవర్గంలో 3,500 మంది నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గం ప్రాజెక్టు పూర్తిచేసేందుకు రూ.4,600 కోట్ల అంచనా వ్యయం నిర్థారించామని, సొరంగ పనుల యంత్రాల్లో మరమ్మతులకు గురైన బేరింగ్‌ని అమెరికా నుంచి తెప్పిస్తున్నామని చెప్పారు. రెండేళ్లలో సొరంగ మార్గం పూర్తిచేసి రైతాంగానికి నీరందిస్తామని హామీ ఇచ్చారు.
Updated Date - Oct 30 , 2024 | 05:42 AM