KTR: కొడంగల్ నుంచే రేవంత్ భరతం పడతాం
ABN, Publish Date - Nov 14 , 2024 | 05:23 AM
కొడంగల్ పరిధిలోని రైతుల భూములను లాక్కునే ప్రయత్నంలో భాగంగానే సీఎం రేవంత్‌రెడ్డి అక్కడి ప్రజల్లో అశాంతి రగిలిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
సీఎం అల్లుడి కోసమే ఫార్మా విలేజ్.. రైతుల భూములను లాక్కునే ప్రయత్నం.. నరేందర్‌రెడ్డిది అరెస్టు కాదు.. కిడ్నాప్
పోలీసులు గూండాల్లా వచ్చి ఎత్తుకెళ్లారు
కాంగ్రెస్ కుట్రలకు పోలీసులు బలికావద్దు
మీడియా సమావేశంలో కేటీఆర్
హైదరాబాద్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): కొడంగల్ పరిధిలోని రైతుల భూములను లాక్కునే ప్రయత్నంలో భాగంగానే సీఎం రేవంత్‌రెడ్డి అక్కడి ప్రజల్లో అశాంతి రగిలిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి తీసుకున్న తుగ్లక్ విధానాల వల్లనే లగచర్ల ఘటన జరిగిందని, కొడంగల్ నుంచే రేవంత్‌రెడ్డి భరతం పడతామని హెచ్చరించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రజాకవి కాళోజీ వర్థంతి కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేస్తామంటూ పీసీసీ అధ్యక్షుడిగా గతంలో ప్రకటించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు యూటర్న్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ఫార్మా విలేజ్‌ల వల్ల వచ్చే లాభమేంటో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. సీఎం తన సొంత అల్లుడు సత్యనారాయణరెడ్డికి చెందిన ఫార్మా కంపెనీ కోసమే ఫార్మావిలేజ్ అంటున్నారని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి అల్లుడు సత్యనారాయణరెడ్డి, అన్న శరత్‌ల ఫార్మా కంపెనీలను విస్తరించడం కోసమే ప్రభుత్వం సహకరిస్తోందని ఆరోపించారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యుల కంపెనీల బాగోతాన్ని సీరియల్ మాదిరిగా తాము బయటపెడుతూనే ఉంటామన్నారు. భూసేకరణ పేరుతో ఎస్సీ, ఎస్టీ, పేద బీసీల భూములను ముఖ్యమంత్రి తన అనుచరులకు, కుటుంబ సభ్యులకు ఇచ్చి రియల్ ఎస్టేట్ దందా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఫార్మాసిటీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టును కూడా మోసం చేస్తోందన్నారు. బయట ఫార్మాసిటీ రద్దు అంటూనే.. కోర్టులో మాత్రం ఫార్మాసిటీ ఉందని చెబుతోందన్నారు.
మహారాష్ట్రకు మూటలు మోస్తున్నారు..
సీఎం రేవంత్ పిచ్చి నిర్ణయాలతో కొడంగల్ రగులుతుంటే.. ఆయన మాత్రం మహారాష్ట్రకు మూటలు మోస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో కొనసాగుతున్నది ఇందిరమ్మ రాజ్యం కాదని, ఇందిర ఎమర్జెన్సీ పాలన అని విమర్శించారు. ఎనుముల కుటుంబం కుంభకోణాలను బయటపెట్టేందుకే తాను ఢిల్లీకి వెళ్లానని స్పష్టం చేశారు. తాను కేంద్ర పెద్దలను కలవడం తప్పయితే.. రేవంత్‌రెడ్డి గవర్నర్‌ను కలవడం కూడా తప్పేనని అన్నారు. ‘‘ఢిల్లీకి వెళ్లినంత మాత్రాన బీజేపీతో కాళ్ల బేరానికి వెళ్లినట్లా? బీజేపీకే చెందిన గవర్నర్‌ను రేవంత్‌రెడ్డి కలిస్తే అది కాళ్ల బేరానికి వెళ్లినట్లు కాదా? మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదానీ కాళ్లు పట్టుకొని తనపై ఈడీ కేసు కాకుండా చూసుకున్నారా? లేదా? చెప్పాలి’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు గూండాల్లా వచ్చి ఎత్తుకెళ్లారని మండిపడ్డారు. ఆయనది అరెస్టు కాదని, కిడ్నాప్ అని అన్నారు. నోటీసులివ్వకుండా, కుటుంబానికి సమాచారం ఇవ్వకుండా తీసుకెళ్లడం తగదన్నారు.
కలెక్టర్‌ను పద్ధతిగా అడిగారు..
ప్రభుత్వ వ్యవస్థపై తమకు నమ్మకం లేదని కేటీఆర్ అన్నారు. అరెస్టు చేసిన మాజీ ఎమ్మెల్యే సహా రైతులను కూడా చిత్రహింసలు పెట్టినట్లు సమాచారం ఉందని, వారికి ప్రైవేటు సిబ్బందితో వైద్య పరీక్షలు చేయించాలని కోరారు. సురేశ్ అనే వ్యక్తి తన ఏడెకరాల భూమిని కోల్పోతున్నందునే కలెక్టర్‌ను పద్ధతిగా అడిగారని తెలిపారు. సురేశ్ బరాబర్ బీఆర్‌ఎస్ నాయకుడేనని స్పష్టం చేశారు. తనపై దాడి జరగలేదని స్వయంగా కలెక్టర్ చెబుతుంటే.. ఐజీ మాత్రం దాడి జరిగిందంటున్నారని తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రకు పోలీసు ఉన్నతాధికారులు బలికావద్దని సూచించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు సురేశ్ పద్ధతిగా, మర్యాదగా చెబితే కూడా తప్పేనా? సొంత పార్టీ కార్యకర్తలతో మా నేతలు మాట్లాడితే తప్పా? సురేశ్ మమ్మల్ని కలవడం తప్పయితే.. రాహుల్‌గాంధీ రోజూ తిట్టే అదానీని రేవంత్‌రెడ్డి కలవడం కూడా తప్పేకదా?’’ అని కేటీఆర్ అన్నారు.
నరేందర్‌రెడ్డి కుటుంబానికి పరామర్శ
హైదరాబాద్ సిటీ: లగచర్ల కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కుటుంబసభ్యులను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. బుధవారం ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి తదితరులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని నరేందర్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. నరేందర్‌రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పోలీసులు రేవంత్‌రెడ్డికి ప్రైవేట్ సైన్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజల సొమ్ముతో జీతం తీసుకుంటున్నామన్న విషయాన్ని డీజీపీతో సహా పోలీసులు గుర్తించాలన్నారు. 144 సెక్షన్ ఉన్నా సరే 300 మందితో తిరుపతిరెడ్డిని లగచర్ల గ్రామంలోకి వెళ్లేందుకు ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు.
Updated Date - Nov 14 , 2024 | 05:23 AM