KTR: చేతి గుర్తుకు ఓటేస్తే.. చేతకాని సీఎంను ఇచ్చారు!
ABN, Publish Date - Dec 12 , 2024 | 03:52 AM
చేతి గుర్తుకు ఓటేస్తే చేతగాని సీఎంను తెలంగాణకు అంటగట్టారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఏడాది కిందట కొలువు దీరిన కాంగ్రెస్ సర్కారు రాష్ట్రాన్ని ఆగం చేసిందని ధ్వజమెత్తారు.
రేవంత్‌రెడ్డిని పదవి నుంచి తప్పించే దమ్ముందా?.. ఢిల్లీకి అందే మూటలపై తప్ప.. మీరిచ్చిన మాటలపై శ్రద్ధ లేదు
రాహుల్ గాంధీకి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ
బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే సంస్థలకు ఉన్న కాంగ్రెస్ నాయకుల పేర్లు మార్చేస్తామని వెల్లడి
విగ్రహాలను కాదు.. ప్రజల బతుకులను మార్చండి: హరీశ్
హైదరాబాద్/సంగారెడ్డిటౌన్, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): చేతి గుర్తుకు ఓటేస్తే చేతగాని సీఎంను తెలంగాణకు అంటగట్టారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఏడాది కిందట కొలువు దీరిన కాంగ్రెస్ సర్కారు రాష్ట్రాన్ని ఆగం చేసిందని ధ్వజమెత్తారు. తెలంగాణ అస్థిత్వాన్ని కూడా దెబ్బతీస్తోందన్నారు. ఈ మేరకు బుధవారం కేటీఆర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఏడాది పాలనలో ఏ పేజీ తిప్పి చూసినా.. మోసం, అవినీతి, నియంతృత్వమే కాంగ్రెస్ విధానమన్నది స్పష్టమవుతోందన్నారు. అతి తక్కువ కాలంలో అత్యధిక ప్రజాధనాన్ని లూటీ చేసిన సర్కారుగా రేవంత్ ప్రభుత్వం ఓ చీకటి చరిత్రను లిఖించిందని తెలిపారు. నిత్యం రాజ్యాంగ విలువలు వల్లెవేసే మీకు.. తన బావమరిదికి లబ్ధి చేకూర్చిన రేవంత్‌రెడ్డిని సీఎం పదవి నుంచి తప్పించే దమ్ముందా? అని రాహుల్‌ను ప్రశ్నించారు. ఓవైపు సీఎంతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న మీకు రాజ్యాంగాన్ని తాకే నైతిక హక్కు లేదని అన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్ల పేర కాల్చి చంపుతున్న కాంగ్రెస్ సంస్కృతిని మరోసారి తెలంగాణలో అమలు చేయడం దిగ్ర్భాంతి కలిగిస్తోందన్నారు. ‘‘ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే అరెస్టులు అన్నట్టుగా సాగుతున్న మీ పాలనా తీరు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోంది.
ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంటింటా నిర్బంధం, సకల రంగాల్లో సంక్షోభమేనని ఏడాది పాలన రుజువు చేసింది. గ్యారెంటీలన్నీ గారడీలేనని, డిక్లరేషన్లపై మీకే డెడికేషన్ లేదని రుజువైంది. సీఎం ఢిల్లీకి పంపే మూటలపై ఉన్న శ్రద్ధ, ప్రజలకు మీరిచ్చిన మాటపై లేకపోవడం ద్రోహం గాక మరేంటి? రైతు భరోసా ఊసే లేదు. రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ నాలుగు విడతలుగా ఊరించి ఉసూరుమనిపించడంతో దాదాపు 620 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా ముఖ్యమంత్రిలో చలనం లేదు’’ అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. ‘చేతనైతే హామీలు అమలు చేయండి. లేదంటే ప్రజల ముందు లెంపలేసుకుని క్షమాపణలు కోరండి’ అని రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ అంతర్జాతీయ విమానాశ్రయం పేర్లను మార్చలేదని, ఇందిరాగాంధీ విగ్రహాల జోలికి వెళ్లలేదని కేటీఆర్ గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి మాత్రం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి ప్రజలపై కాంగ్రెస్ తల్లిని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పలు సంస్థలకు ఉన్న ఇందిర, రాజీవ్, ఇతర కాంగ్రెస్ నాయకుల పేర్లను మార్చడంతోపాటు సచివాలయం ముందున్న కాంగ్రెస్ తల్లి, రాజీవ్‌గాంధీ విగ్రహాలను గాంధీభవన్‌కు సాగనంపుతామని లేఖలో తెలిపారు. కాగా, రాష్ట్ర చరిత్ర, సంస్కృతిని హననం చేసే సర్కారుతో సన్మానం చేయించుకోలేనన్న నందిని సిధారెడ్డి ప్రకటనపై ఎక్స్‌లో కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు.
ఉద్యమ చరిత్రలో రేవంత్‌రెడ్డిది ద్రోహి పాత్ర: హరీశ్
తెలంగాణ ఉద్యమ చరిత్రలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిది ద్రోహి పాత్ర అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. రేవంత్‌రెడ్డి ఎన్నడూ ‘జై తెలంగాణ’ అనలేదని చెప్పారు. 2009 డిసెంబరు 9న తెలంగాణ ప్రకటన రావడానికి కారణం కేసీఆరే అన్నారు. సోనియా దయతోనే తెలంగాణ వచ్చిందనడం అమరులను అవమానించడమేనని చెప్పారు. తెలంగాణకు నంబర్‌వన్ విలన్ కాంగ్రెస్ పార్టీయే అని ఆరోపించారు. నాడు రేవంత్‌రెడ్డిని తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే తప్పించుకున్నారని ఎద్దేవా చేశారు. గ్రామాల్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలను కూడా రేవంత్‌రెడ్డి తొలగిస్తారా? అని హరీశ్ ప్రశ్నించారు. విగ్రహాలను కాదని, ప్రజల బతుకులను మార్చాలని హితవు పలికారు.
Updated Date - Dec 12 , 2024 | 03:52 AM