Hyderabad: రాష్ట్రంలో నియంత పాలన: కేటీఆర్
ABN, Publish Date - Nov 24 , 2024 | 03:33 AM
రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోందని, త్వరలోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
కుషాయిగూడ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోందని, త్వరలోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ఆయన ములాఖత్ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్షపూరిత వైఖరి కారణంగానే పేద, గిరిజన, బలహీన వర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన నరేందర్ రెడ్డి జైల్లో ఉన్నారని అన్నారు. నరేందర్ రెడ్డి కోరిక మేరకు జైలు పాలైన 30మంది రైతులకు అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
సొంతూరు కొండారెడ్డి పల్లిలో మాజీ సర్పంచ్ 85 ఏళ్ల సాయిరెడ్డి అనే వ్యక్తిపై రేవంత్ రెడ్డి పగబట్టి, అవమానించి ఆయన ఉసురు తీశారని విమర్శించారు. గత పదేళ్ల తమ పాలనలో ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరిగాయా అని ఆయన ప్రశ్నించారు. ‘రేవంత్ ఇది నీ సొంత సామ్రాజ్యమా...? నువ్వు చక్రవర్తివా? వెయ్యేళ్లు బతకడానికి వచ్చావా?’ అని నిలదీశారు. ప్రజలు అన్ని తప్పులను గమనిస్తున్నారని, శిశుపాలుడికి పట్టిన గతే కాంగ్రె్‌సకు పట్టనుందని కేటీఆర్ ఆక్షేపించారు.
Updated Date - Nov 24 , 2024 | 03:33 AM