ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భూసేకరణ షురూ

ABN, Publish Date - Jul 17 , 2024 | 03:44 PM

హైదరాబాద్‌లోని ప్యారడైజ్‌ నుంచి కండ్లకోయ వరకు, పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి శామీర్‌పేట వరకు ఈ రెండు మార్గాల్లో ప్రతిపాదించిన ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి ఆదాయ, వ్యయ అంచనాలు వేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Land Acquisition

  • పీపీపీ పద్ధతిలో ఎలివేటెడ్‌ కారిడార్లు?

  • ఆదాయ, వ్యయ అంచనాలపై కసరత్తు

  • ఇప్పటికే పాలనాపర అనుమతులు మంజూరు

  • కన్సల్టెన్సీని ఆహ్వానించిన హెచ్‌ఎండీఏ

  • నివేదిక ఆధారంగానే నిర్మాణ పద్ధతిపై స్పష్టత


హైదరాబాద్‌ సిటీ, జూలై 17 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ప్యారడైజ్‌ నుంచి కండ్లకోయ వరకు, పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి శామీర్‌పేట వరకు ఈ రెండు మార్గాల్లో ప్రతిపాదించిన ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి ఆదాయ, వ్యయ అంచనాలు వేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధుల మంజూరుకు పాలనపరమైన అనుమతులివ్వడంతో పాటు శంకుస్థాపన చేసింది. దీంతో ఆర్మీ అధికారులతో కలిసి భూసేకరణ పనులు మొదలుపెట్టారు. ఈ నిర్మాణాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)తో సికింద్రాబాద్‌లో ఎలివేటెడ్‌ కారిడార్లను నిర్మించేందుకు హెచ్‌ఎండీఏ యోచిస్తోంది. ఈ భారీ ప్రాజెక్టులను పీపీపీ పద్ధతిలో చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసేందుకు ఓ కన్సల్టెన్సీని ఏర్పాటు చేసేందుకు హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో హెచ్‌ఎండీఏ నియమాకం చేసే కన్సల్టెన్సీ నివేదిక కీలకంగా మారనుంది. దీని ఆధారంగానే వీటిని ఎలా నిర్మించాలనే దానిపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.


600 మీటర్ల అండర్‌ గ్రౌండ్‌ టన్నెల్‌

హైదరాబాద్‌ - కరీంనగర్‌ మార్గంలో సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి శామీర్‌పేట వరకు వెస్ట్‌ మారేడుపల్లి, కార్ఖాన, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్‌, హకీంపేట, తుంకూట మీదుగా 18.100 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్‌ కారిడార్‌ను ఆరు లైన్లతో నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి 192.20 ఎకరాల భూమి అవసరం ఉండగా, ఇందులో 113.48 ఎకరాల వరకు ఢిఫెన్స్‌ భూములు కాగా, 83.72 ఎకరాలు ప్రైవేటు భూములున్నాయి. అయితే ఈ కారిడార్‌ నిర్మాణానికి రూ.2,232 కోట్లతో ప్రాజెక్టును అంచనా వేసి ఆ మేరకు పాలనపరమైన అనుమతులిచ్చారు. అదేవిధంగా జాతీయ రహదారి 44లోని హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ మార్గంలో సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్‌ నుంచి కొంపల్లి అవతల ఉన్న డెయిరీ ఫామ్‌ రోడ్డు వరకు గల ఆరు లైన్లు విస్తరించనుండగా ఆ మార్గంలో ముఖ్యమైన ప్రాంతాలైన తార్‌బండ్‌ జంక్షన్‌, బోయినిపల్లి జంక్షన్‌లతో కలిపి 5.320కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ను నిర్మించేందుకు రూ.1,580 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం పాలనపరమైన అనుమతులిచ్చింది. ఇందులో 600 మీటర్ల మేర బేగంపేట ఎయిర్‌పోర్టు వద్ద అండర్‌ గ్రౌండ్‌ టన్నెల్‌ ఏర్పాటు చేయనున్నారు. అయితే ప్యారడైజ్‌ నుంచి కొంపల్లి తర్వాత డెయిరీ ఫామ్‌ వరకు గల 18.35కి.మీలో ఇప్పటికే సుచిత్ర జంక్షన్‌, పేట్‌ బషీర్‌బాద్‌, కొంపల్లి జంక్షన్లలో దాదాపు 5కిలోమీటర్లకు పైగా ప్లైఓవర్ల నిర్మాణాన్ని ఎన్‌హెచ్‌ఏఐ చేపట్టింది. మిగతా మార్గాన్ని పూర్తి చేసేందుకు హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టింది. 5.320కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి 73.16ఎకరాల భూమి అవసరముండగా, 55.85ఎకరాలను డిఫెన్స్‌ నుంచి 8.41ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాల్సి ఉన్నది.


నిర్మాణానికి ప్రత్యేక అధ్యయనం

ఈ రెండు ఎలివేటెడ్‌ కారిడార్లు ఉత్తర తెలంగాణకు ముఖ ద్వారంగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావడంతో పాటు శంకుస్థాపన కూడా చేసింది. దీంతో హెచ్‌ఎండీఏ అధికారులు కూడా డిఫెన్స్‌ అధికారులతో కలిసి భూసేకరణపై చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఎలివేటెడ్‌ కారిడార్లను పీపీపీ పద్ధతిలో నిర్మాణంపై అధ్యయనం చేయడానికి ప్రత్యేకంగా ఓ కన్సల్టెన్సీని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. వాహనాల రాకపోకలను, ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణ వ్యయాన్ని అంచనా వేయనున్నారు.


రూ.3,812 కోట్లతో నిర్మాణాలకు అనుమతి

సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి శామీర్‌పేట వరకు 18.100కి.మీ మార్గంలో ఆదాయం వచ్చేందుకు గల అవకాశాలను పరిశీలన చేయనున్నారు. హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌లో అయితే నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను కన్సల్టెన్సీ పూర్తిస్థాయిలో నివేదిక అందజేయాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో సర్వే చేసి ఆదాయ, వ్యయాలను అంచనా వేసేందుకు నిర్ణీత గడువు కూడా మూడు నెలలిచ్చారు. ఈ విధంగా రెండు కారిడార్లకు వేర్వేరుగా రెండు కన్సలెన్సీలను ఆహ్వానించారు. ఆయా కన్సల్టెన్సీలు అందజేసే నివేదిక ఆధారంగానే ఏ పద్దతిలో ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మాణం చేస్తుందో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులను చేపట్టేందుకు రూ.3,812 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం పాలన అనుమతులిచ్చింది. కానీ.. కన్సల్టెన్సీలు అందించే నివేదిక ఆధారంగా వ్యయ అంచనాలు పెరిగితే మరోసారి పాలనపరమైన అనుమతులివ్వాల్సి ఉంటుంది.

Updated Date - Jul 17 , 2024 | 04:03 PM

Advertising
Advertising
<