Amoy Kumar: మేం దానం చేసిన భూమిని.. రియల్టర్లకు కట్టబెట్టారు!
ABN, Publish Date - Oct 31 , 2024 | 04:31 AM
భూ ఆక్రమణల బాధితులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి క్యూ కడుతున్నారు.
మాజీ సీఎస్ సోమేశ్, ఐఏఎస్ నవీన్ మిట్టల్‌పై ఈడీకి ఫిర్యాదు
భూముల కేసుల్లో తెరపైకి సీనియర్ ఐపీఎస్ అధికారి పేరు
వెలుగులోకి వస్తున్నసబ్‌రిజిస్ట్రార్ జ్యోతి అవినీతి లీలలు
హైదరాబాద్, జీడిమెట్ల, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): భూ ఆక్రమణల బాధితులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి క్యూ కడుతున్నారు. రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ బాధితులు ఒక్కొక్కరుగా వచ్చి ఫిర్యాదు చేస్తుండగా.. తాజాగా మాజీ సీఎస్ సోమేశ్ కుమా ర్, సీనియర్ ఐఏఎస్ నవీన్ మిట్టల్‌పైనా ఫిర్యాదు రావడం సంచలనంగా మారింది. కొండాపూర్‌కు చెందిన రాఘవయ్య, సురేష్.. వీరిపై బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో బుధవారం ఫిర్యాదు చేశారు. కొండాపూర్ మజీద్‌బండలోని సర్వే నంబర్ 104 నుంచి 108 వరకు తమ కుటుంబానికి భూమి ఉందని.. అందులో 88 ఎకరాలు బాలసాయి ట్రస్ట్‌కు దానం చేశామని.. అయితే ఆ భూమికి సంబంధించి రాత్రికి రాత్రే జీవో నంబర్ 45 జారీ చేసి బడా రియల్ ఎస్టేట్ సంస్థలకు సుమారు 42 ఎకరాలు కట్టబెట్టారని బాధితులు పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్, రంగారెడ్డిజిల్లా కలెక్టర్‌గా పనిచేసిన అమోయ్ కుమార్‌తోపాటు సీనియర్ ఐఏఎస్ నవీన్ మిట్టల్ ప్రమేయం ఉందని ఆరోపించారు. విచారణ జరిపి అధికారుల ప్రమేయంపై నిజాలు నిగ్గుతేల్చాల్సిందిగా ఈడీకి ఇచ్చిన ఫిర్యాదులో కోరినట్టు బాధితులు తెలిపారు. ఇదిలా ఉండగా.. కీలక కమిషనరేట్‌కు సీపీగా విధు లు నిర్వహించిన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి పేరు భూ వివాదంలో బయటకు రావడం సంచలనం సృష్టించింది. ఆ ఐపీఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడి బడా రియల్ వ్యాపారులకు సహకరించినట్లు బాధితులు గత మార్చిలో ఢిల్లీ ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో ఐఏఎ్‌సలపై వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఇప్పుడు ఆ ఐపీఎస్ పేరు బయటకు వచ్చింది.
హరీశ్‌రావు బంధువునంటూ..
ఐదేళ్లపాటు కుత్బుల్లాపూర్ సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేసిన జ్యోతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మల్లంపేట్, పేట్‌బషీరాబాద్, ప్రగతినగర్, గాజులరామారం, సూరారం, జీడిమెట్ల ప్రాంతా ల్లో పలు సర్వేనెంబర్లలోని భూములకు సంబంధించి నకిలీ డాక్యుమెంట్లతో ఆమె చేసిన అక్రమ రిజిస్ట్రేషన్ వివరాలు బయటపడుతున్నాయి. నాటి మంత్రి హరీశ్‌రావు తన బంధువని చెబుతూ.. జ్యోతి తమను బెదిరించినట్టు పలువురు ఇప్పుడు బయటకు వచ్చి గోడు వెళ్లబోసుకుంటున్నారు. కోర్టువివాదాల్లో ఉన్న కేసుల్లోనూ ఆమె అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్టు కొందరు బాధితులు పేర్కొంటున్నారు. ప్రధానంగా స్థానికంగా ఉన్న కొందరు ప్రజాప్రతినిధులు ఆడించిన విధంగా ఆమె నడుచుకున్నట్టు తెలుస్తుంది.
పలు ప్రభుత్వ భూములను ప్రై వేట్ భూములుగా బైనెంబర్‌లు వేసి రిజిస్ట్రేషన్ చేసినట్టు కొందరు డాక్యుమెంట్లు చూపిస్తున్నాయి. నగర శివార్లలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, కొందరు మంత్రులు చెప్పినట్టు పనిచేసి.. బతికి ఉన్న వారిని కూడా మృతిచెందినట్టు రికార్డులు సృష్టించి తప్పుడు రిజిస్ట్రేషన్‌లు చేసి కోట్లు సంపాదించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా.. కుత్బుల్లాపూర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలంలో డాక్యుమెం ట్ రైటర్లు ప్రధానంగా చక్రం తిప్పుతున్నారు. సూరా రం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి, మరికొందరు డాక్యుమెంట్ రైటర్లు తాము చెప్పిందే వేదంగా నడిపిస్తున్నారు. జ్యోతి సబ్‌రిజిస్ట్రార్‌గా ఉన్నప్పుడు నకిలీ డాక్యుమెంట్లు తయారుచేసి రిజిస్ట్రేషన్‌లు చేయడంలో కొందరు డాక్యుమెంట్ రైటర్లే సూత్రదారులు.
Updated Date - Oct 31 , 2024 | 04:31 AM