CM Revanth Reddy: ఘనంగా సీఎం రేవంత్ జన్మదిన వేడుకలు
ABN, Publish Date - Nov 09 , 2024 | 03:53 AM
సీఎం రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్‌రెడ్డి చిరకాలం ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ‘ఎక్స్’ వేదికగా ప్రధాని మోదీ పేర్కొన్నారు.
శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, ప్రముఖులు .. గాంధీభవన్‌లో బాణసంచా కాల్చి.. మిఠాయిల పంపిణీ
రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించిన కార్యకర్తలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): సీఎం రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్‌రెడ్డి చిరకాలం ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ‘ఎక్స్’ వేదికగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, సినీనటుడు చిరంజీవి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అమెరికా, బ్రిటిష్ కౌన్సిల్ జనరల్స్ జన్నిఫర్ లార్సెన్, గరెత్ విన్ తదితరులు రేవంత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మ వారిని ప్రార్థిస్తున్నానంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్.. ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రబాకర్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు తదితరులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గాంధీభవన్‌లో మత్స్య కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో రేవంత్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బాణా సంచా కాల్చి, మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం భారీ కేక్‌ను కట్ చేశారు. పలువురు చిన్నారులు సీఎం మాస్కు ధరించి సంబరాల్లో పాల్గొన్నారు. అలాగే, పార్టీ సోషల్ మీడియా బృందం కేక్ కట్ చేసి సీఎంకు శుభాకాంక్షలు తెలిపింది. రేవంత్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు వేడుకలు నిర్వహించారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 50 అడుగుల రేవంత్ చిత్రపటాన్ని రంగులతో తీర్చిదిద్దారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నేతృత్వంలో రంగోలి చిత్రకారుడు పురుషోత్తం సీఎం చిత్రపటాన్ని వేశారు. ఇందులో రేవంత్ ఫొటోతో పాటు ‘హ్యాపీ బర్త్‌డే రేవంత్ అన్న’ అని రాశారు. ఈ భారీ చిత్రాన్ని గీసేందుకు కళాకారులు 20 గంటల పాటు శ్రమించారు. అలాగే, రేవంత్ పుట్టిన రోజు సందర్భంగా పారిశుధ్య కార్మికులు, ఆశా వర్కర్లకు చీరలు పంపిణీ చేశారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న బీఆర్‌ఎస్ నాయకులకు నాలుగేళ్లలో సినిమా చూపిస్తామని కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు హెచ్చరించారు. రేవంత్ ముఖచిత్రంతో నేసిన అగ్గిపెట్టెలో పట్టే బంగారు శాలువాను హుస్నాబాద్‌కు చెందిన అక్కు శ్రీనివాస్ సీఎంకు బహూకరించారు.
పునర్నిర్మాణంలో సీఎం పాత్ర కీలకం: నీలం మధు
తెలంగాణ పునర్నిర్మాణంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారని కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్ కొనియాడారు. సీఎం రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో కలుసుకుని పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తూ.. ఆరు గ్యారంటీల అమలు కోసం సీఎం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పదేళ్లుగా దోపిడీకి గురైన తెలంగాణను గాడిలో పెట్టేందుకు రేవంత్ చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు నిండు మనసుతో మద్దతు పలుకుతున్నారని చెప్పారు.
Updated Date - Nov 09 , 2024 | 03:53 AM