సుకుమా అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్
ABN, Publish Date - Nov 23 , 2024 | 03:57 AM
ఛత్తీ్‌సగఢ్ అడవుల్లో శుక్రవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుకుమా జిల్లా బెజ్జి అడవుల్లో కేంద్ర బలగాలు, మావోయిస్టుల మధ్య సుమారు ఐదు గంటల పాటు సాగిన ఎదురు కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మరణించారు.
కేంద్ర బలగాలు, మావోయిస్టుల మధ్య ఐదు గంటల పోరు.. 10 మంది మావోయిస్టుల మృతి
ఆయుధాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం
మృతుల్లో ముగ్గురు మహిళలు
ఆరుగురి వివరాలు గుర్తింపు
వాళ్లపై రూ.21లక్షల రివార్డు
చర్ల, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ఛత్తీ్‌సగఢ్ అడవుల్లో శుక్రవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుకుమా జిల్లా బెజ్జి అడవుల్లో కేంద్ర బలగాలు, మావోయిస్టుల మధ్య సుమారు ఐదు గంటల పాటు సాగిన ఎదురు కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మరణించారు. మృతుల్లో దక్షిణ బస్తర్ మావోయిస్టు డివిజనల్ కమిటీ సభ్యుడు, మిలటరీ ఇన్‌చార్జి(డీవీసీఎం) మాసాతోపాటు ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. సుకుమా జిల్లా బెజ్జి పోలీ్‌సస్టేషన్ పరిధిలోని అడవుల్లో కుంట, కిష్టారం ప్రాంత మావోయిస్టులు ఉన్నట్లు అందిన సమాచారం మేరకు బలగాలు గాలింపు చేపట్టాయి. సుకుమా జిల్లాకు చెందిన డీఆర్‌జీ, సీఆర్‌పీఎఫ్ కలిసి సుమారు 600 మంది ఈ గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కొర్రాజుగూడ, భందరపర గుట్టల్లో శుక్రవారం ఉదయం బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. సుమారు ఐదు గంటల పాటు జరిగిన కాల్పుల్లో పది మంది మావోయిస్టులు మరణించగా చాలామంది పరారయ్యారని పోలీసులు చెబుతున్నారు. పరారైన వారి కోసం గాలిస్తున్నామని బస్తర్ ఐజీ సుందర్ రాజన్ తెలిపారు. ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతంలో ఇన్‌సాస్, ఏకే 47, ఎస్‌ఎల్‌ఆర్, పిస్తోల్, సింగిల్‌షాట్ గన్ తుపాకులు, మందుపాతరలు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నామని బలగాలు ప్రకటించాయి. ఇక, మృతుల్లో ఆరుగురి వివరాలు గుర్తించామని మిగిలిన నలుగురు ఎవరనేది తెలియాల్సి ఉందని పేర్కొన్నాయి. మృతుల్లో మాసా (రూ.8లక్షల రివార్డు), మాద్వి లక్మా (5లక్షలు), మడకం కోసి (2లక్షలు), మడకం జీతూ (2లక్షలు), కోవాసి కోసా (2లక్షలు), హంగీ (మాసా భార్య, 2లక్షలు)పై మొత్తం రూ.21లక్షల రివార్డు ఉందని తెలిపారు. ఎదురు కాల్పుల అనంతరం భద్రతా బలగాలు డీజే పాటలకు నాట్యం చేస్తూ సంబరాలు చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరలయ్యాయి. కాగా, ఈ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన ఛత్తీ్‌సగఢ్ సీఎం విష్ణుదేవ్‌సాయ్ బలగాలను అభినందించారు. బస్తర్ ప్రాంతంలో శాంతి, అభివృద్ధికి మళ్లీ అడుగులు పడుతున్నాయని పేర్కొన్నారు.
మావోయిస్టులకు వరుస దెబ్బలు..
మావోయిస్టు పార్టీ వరుస ఘటనలతో కుదేలైనట్లుగా కనిపిస్తోంది. ప్రతీ ఎన్‌కౌంటర్‌లో పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణిస్తున్నారు. వీళ్లలో పార్టీని నడిపించే ముఖ్య నాయకులు ఉంటున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 11 భారీ ఎన్‌కౌంటర్లు జరిగాయి. వీటిలో కాంకేర్ జిల్లాలో 29 మంది, అక్టోబరు 5న అబూజ్‌బడ్ అడవుల్లో 38 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇవి కాక మరో 9 ఘటనల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. దీంతో మావోయిస్టుల ఉనికిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా, 2026 మార్చి నాటికి మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్, సుకుమా అడవులపై బలగాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఆయా జిల్లాల్లోని కొండపల్లి, ఇతర ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాయి. రెండు నెలల్లో సుమారు మూడు శిబిరాలు పెట్టి 5వేలకు పైగా బలగాలను మోహరించినట్టు సమాచారం. ఈ క్రమంలో మావోయిస్టులకు సహకరించే వారిని గుర్తించి అరెస్టులు చేస్తున్నారు. ఇటీవల కొండపల్లి గ్రామంలో దాదాపు 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, మావోయిస్టులకు సరుకులు అందకుండా చేసేందుకు సంతలను కూడా అడ్డుకుంటున్నారు.
Updated Date - Nov 23 , 2024 | 03:57 AM