Bhatti Vikramarka: గృహజ్యోతికి మళ్లీ దరఖాస్తులు
ABN, Publish Date - Aug 15 , 2024 | 02:30 AM
గృహజ్యోతి పథకం కోసం మళ్లీ దరఖాస్తులు స్వీకరించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్నప్పటికీ గతంలో దరఖాస్తులు చేయనివారి నుంచి అప్లికేషన్లు తీసుకోవాలని నిర్దేశించారు.
అర్హత ఉన్నప్పటికీ అమలు కాని వారి నుంచి స్వీకరణ
జెన్‌కో కేంద్రాల మరమ్మతుల కోసం సాంకేతిక కమిటీ
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): గృహజ్యోతి పథకం కోసం మళ్లీ దరఖాస్తులు స్వీకరించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్నప్పటికీ గతంలో దరఖాస్తులు చేయనివారి నుంచి అప్లికేషన్లు తీసుకోవాలని నిర్దేశించారు. బుధవారం మహాత్మాజ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో ఇంధనశాఖతో పాటు డిస్కమ్‌ల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గృహజ్యోతి పథకం ద్వారా 45,81,676 మంది 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ ప్రయోజనం పొందుతున్నారని అధికారులు ఈ సందర్భంగా నివేదించగా.. తెల్లరేషన్‌కార్డు కలిగి ఇప్పటిదాకా దరఖాస్తు చేసుకోని వారి నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరించి, పథకాన్ని అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా జల, థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో మరమ్మతులపై తక్షణమే నిర్ణయం తీసుకోవడానికి వీలుగా ముగ్గురు అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని, విద్యుత్ ఉత్పాదన ఆగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 2023 డిసెంబరుకు ముందు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా జరిగిన నష్టాలపై నివేదికలు అందించాలని కోరారు. జలవిద్యుత్ కేంద్రాల్లో ఎటువంటి సాంకేతిక సమస్యలు ఎదురైనా తన దృష్టికి తేవాలని చెప్పారు. దక్షిణ డిస్కమ్ (ఎస్పీడీసీఎల్) పరిధిలో 227 సబ్‌స్టేషన్‌ల నిర్మాణానికి కసరత్తు చేస్తున్నామని, ఇందులో 114 సబ్‌స్టేషన్లకు స్థలాల సమస్య ఉందని అధికారులు తెలుపగా దీనిపై కలెక్టర్లతో చర్చలు చేపట్టాలన్నారు.
ఈ సందర్భంగా రామగుండంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మాణంపై చర్చ జరిగింది. ఒక మెగావాట్ ప్లాంట్ కట్టడానికి 0.82 ఎకరాలభూమి అవసరం ఉంటుందని, 800 మెగావాట్ల ప్లాంట్ కోసం 650 ఎకరాలు అవసరమని, రామగుండంలో 700.24 ఎకరాల భూమి లభ్యత ఉందని అధికారులు గుర్తు చేశారు. దీని కోసం తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు ఏ విధంగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు.
Updated Date - Aug 15 , 2024 | 02:30 AM