Mallu Ravi: భట్టిపై బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు
ABN, Publish Date - Mar 11 , 2024 | 07:54 PM
యాదగిరి గుట్టలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)కు అవమానం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి(Mallu Ravi) అన్నారు. సోమవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ...కాంగ్రెస్ దళితులకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన విషయం అందరికీ తెలుసునని తెలిపారు.
హైదరాబాద్: యాదగిరి గుట్టలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)కు అవమానం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి(Mallu Ravi) అన్నారు. సోమవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ...కాంగ్రెస్ దళితులకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన విషయం అందరికీ తెలుసునని తెలిపారు. బీఆర్ఎస్ దళితులను, దళిత నాయకులను ఎలా అవమానించిందో అందరికి తెలుసునని చెప్పారు. గత బీఆర్ఎస్ పాలనలో భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే సీఎల్పీ విలీనం అంటూ కొత్త కథ అల్లి భట్టి విక్రమార్కకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు భట్టి విక్రమార్కకు అవమానం అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు.
దళిత ముఖ్యమంత్రి అంటూ ప్రగల్బాలు పలికి దళితులను మోసం చేసిన బీఆర్ఎస్ ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరు నమ్మరని చెప్పారు.భట్టి విక్రమార్కకు ప్రధాన ప్రతిపక్ష నేతగా, ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని తెలిపారు.యాదగిరిగుట్టలో ముఖ్యమంత్రి పక్కన నల్గొండ జిల్లా మంత్రులను కూర్చోబెట్టారని.. భద్రాచలంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని కూర్చోబెట్టారని వివరించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు చాలా సఖ్యతతో, సమన్వయంతో ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌లో జరిగే అంశాలపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడాల్సిన అవసరం లేదని మల్లు రవి చెప్పారు.
Updated Date - Mar 11 , 2024 | 07:54 PM