Manchu Manoj: విష్ణు అనుచరులతో ప్రాణహాని ఉంది
ABN, Publish Date - Dec 16 , 2024 | 05:19 AM
మంచు మోహన్‌బాబు కుటుంబంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. అన్నదమ్ములు విష్ణు, మనోజ్ మధ్య మళ్లీ విభేదాలు భగ్గుమన్నాయి.
ఇంట్లో విద్యుత్తు సరఫరాను నిలిపివేయడానికి జనరేటర్‌లో పంచదార కలిపిన డీజిల్ పోశారు
మా అమ్మను, నా కుటుంబాన్ని భయపెడుతున్నారు
తనపై కుట్ర జరుగుతోందంటూ మంచు మనోజ్ లేఖ
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): మంచు మోహన్‌బాబు కుటుంబంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. అన్నదమ్ములు విష్ణు, మనోజ్ మధ్య మళ్లీ విభేదాలు భగ్గుమన్నాయి. జనరేటర్‌లో పంచదార కలిపిన డీజిల్‌ను పోసి విద్యుత్తు సరఫరా నిలిపివేయడం ద్వారా విష్ణు అనుచరులు నన్ను, నా కుటుంబాన్ని భయబ్రాంతులకు గురి చేశారని మంచు మనోజ్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు. ‘‘నన్ను, నా కుటుంబాన్ని విష్ణు, అతడి అనుచరులు పలు విధాలుగా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. శనివారం నేను షూటింగ్ వెళ్లగా.. నా భార్య కుమారుడి స్కూల్‌లో జరుగుతున్న కార్యక్రమానికి వెళ్లారు. మా అమ్మ పుట్టిన రోజు సందర్భంగా కేక్ ఇచ్చే నెపంతో మంచు విష్ణుతోపాటు అతడి అనుచరులు రాజ్ కందూరు, కిరణ్, విజయ్ రెడ్డితోపాటు కొంతమంది బౌన్సర్లు ఇంటికి వచ్చారు. ఈ సమయంలో వారు నా జనరేటర్‌లో పంచదార కలిపిన డీజిల్‌ను పోశారు.
దీని కారణంగా కరెంట్ సరఫరాలో అంతరాయం కలడంతోపాటు జనరేటర్ నుంచి నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. జనరేటర్‌కు సమీపంలోనే కార్లు, గ్యాస్‌కు సంబంధించిన కనెక్షన్లు ఉన్నాయి. ఒక వేళ నిప్పురవ్వల కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఇంట్లో ఉన్న నా 9 నెలల పాప, వృద్ధురాలైన నా తల్లి, అంకుల్, ఆంటీల ప్రాణాలకు ముప్పు ఏర్పడేది. మా అమ్మ పుట్టిన రోజున ఇలా జరగడం నా మనసును కలిచివేసింది. ఇది పూర్తిగా కుటుంబ సమస్య.. కానీ నా కుటుంబ క్షేమం, రక్షణ కోసం అన్ని అంశాలను బహిరంగపర్చాల్సి వస్తోంది. నాకు, నా కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ఈ ఒక్క సంఘటనే కాకుండా పోలీసు వారి హెచ్చరికలు ఖాతరు చేయకుండా పలు విధాలుగా నా కుటుంబానికి హాని కలిగేలా ప్రవర్తిస్తున్నారు. నేను, నా కుటుంబం చాలా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. నాకు, నా కుటుంబానికి రక్షణ ఇస్తామని హామీ ఇచ్చిన రాచకొండ పోలీస్ కమిషనర్‌కు, పహాడిషరీఫ్ ఇన్‌స్పెక్టర్‌కు ధన్యవాదాలు. నేడు ఆళ్లగడ్డలో నిర్వహించే మా అత్తగారి జయంతి వేడుకలకు హాజరై వచ్చాక ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా’’ అని మనోజ్ పేర్కొన్నారు.
Updated Date - Dec 16 , 2024 | 05:19 AM