Fire Accident: పత్తి గోదాములో అగ్ని ప్రమాదం
ABN, Publish Date - Dec 01 , 2024 | 04:28 AM
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని సీసీఐ గోదాములో సంభవించిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ.52 కోట్ల విలువ చేసే పత్తి కాలి బూడిదయ్యింది. అగ్నిమాపక దళం తొమ్మిది గంటల పాటు కష్టపడినా ఫలితం లేకండాపోయింది.
కాలి బూడిదైన రూ.52 కోట్ల విలువైన పత్తి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఘటన
మేడ్చల్ టౌన్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని సీసీఐ గోదాములో సంభవించిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ.52 కోట్ల విలువ చేసే పత్తి కాలి బూడిదయ్యింది. అగ్నిమాపక దళం తొమ్మిది గంటల పాటు కష్టపడినా ఫలితం లేకండాపోయింది. మేడ్చల్ మునిసిపాలిటీ పూడూరు సమీపంలోని గోసాయిగూడ వద్ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గోదాము ఉంది. శనివారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో గోదాము నుంచి పొగలు రావటం గమనించిన నిర్వాహకులు వెంటనే తుర్కాపల్లి జినోమ్‌వ్యాలీ అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేశారు. అగ్నిమాపక దళం ఘటనా స్థలానికి చేరుకునేలోపు మంటలు గోదామును చుట్టుముట్టేశాయి. జీడిమెట్ల నుంచి కూడా అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు.
ఎనిమిది ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మంటల తీవ్రతకు గోదాము కూలిపోయింది. కాగా ఘటనా స్థలంలో సీసీఐ ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవటం గమనార్హం. గోదాములో నిల్వ చేసిన పత్తి విలువ దాదాపు రూ.52 కోట్లు ఉంటుందని సీసీఐ సిబ్బంది తెలిపారు. గోదాము కూలిపోవడంతో రూ.6 కోట్ల నష్టం వాటిల్లిందని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రమాదానికి కారణాలపై విచారణ జరుపుతున్నామని డీఎ్‌ఫవో జై కృష్ణ తెలిపారు. కాగా, గోదాము ప్రధాన ద్వారం వద్ద వెల్డింగ్ చేస్తుండగా నిప్పురవ్వలు పత్తిపై పడడంతో ప్రమాదం సంభవించి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Updated Date - Dec 01 , 2024 | 04:28 AM