Medchal: రూ.100 కోట్ల ప్రభుత్వ భూమి భద్రం!
ABN, Publish Date - Nov 10 , 2024 | 02:57 AM
మేడ్చల్ జిల్లాలో రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడారు. గత ప్రభుత్వ హయాంలో ప్రైవేటు వ్యక్తుల పరమైన దాదాపు రూ. 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తిరిగి ప్రభుత్వ భూమిగా మార్చారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రైవేటు వ్యక్తులకు
బదలాయించిన అమోయ్ కుమార్
తిరిగి ప్రభుత్వ భూమిగా మార్చిన మేడ్చల్ కలెక్టర్
మేడ్చల్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్ జిల్లాలో రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడారు. గత ప్రభుత్వ హయాంలో ప్రైవేటు వ్యక్తుల పరమైన దాదాపు రూ. 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తిరిగి ప్రభుత్వ భూమిగా మార్చారు. ‘ఆంధ్రజ్యోతి’లో శనివారం ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. ఘట్‌కేసర్ మండలం వెంకటాపూర్ పంచాయతీ, కొర్రెముల రెవెన్యూ పరిధిలోని సర్వే నం.174లో 18 ఎకరాల 12 గుంటల ప్రభుత్వ భూమి ఉండగా 2017లో నాటి ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం 6 ఎకరాల 12 గుంటల భూమిని కేటాయించింది. వంద కోట్ల విలువైన 12 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేసిన ఓ మాజీ ప్రజాప్రతినిధి, కుటుంబ సభ్యులునీరుడి రామరావు,నీరుడి జంగయ్య, నీరుడి కిష్టయ్య, నీరుడి జంగమ్మ, నీరుడి సత్తయ్యలు నకిలీపత్రాలతో 12ఎకరాల భూమికి తమ పేరుపై పట్టాదారు పాసుపుస్తకాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు.
విచారణ జరిపిన నాటి తహసీల్దారు ఆ దరఖాస్తును తిరస్కరించారు. మళ్లీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా 2023 అక్టోబరు 12న కలెక్టర్ అమోయ్‌కుమార్ బదిలీ అయ్యే రోజే 12 ఎకరాల ఆ భూమిని ప్రైవేటు వ్యక్తుల పేరిట బదలాయించారు. సర్వే నం.174/1/1/1/1/2లో నీరుడి జంగయ్య తండ్రి వెంకయ్యకు 3 ఎకరాలు, 174/2లో నీరుడి రామారావు తండ్రి సత్తయ్యకు 3 ఎకరాలు, 174/1/2లో నీరుడి జంగమ్మ భర్త అంజయ్యకు 2ఎకరాలు, 174/1/1/2లో నీరుడి సత్తమ్మ భర్తకు 2 ఎకరాలు, 174/1/1/1/2లో నీరు డి కిష్టయ్యకు 2 ఎకరాల చొప్పున కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చారు. దీనిపై శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమవడంతో కలెక్టర్ గౌతమ్ నివేదిక తెప్పించుకొని, వెంటనే రికార్డులను మార్చినట్లు జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి తెలిపారు.
Updated Date - Nov 10 , 2024 | 02:57 AM