Ponguleti Srinivas Reddy: నువ్వు మాజీవి.. నీ పప్పులు ఉడకవ్!
ABN, Publish Date - May 09 , 2024 | 05:48 AM
‘వెయ్యి గొడ్లను తిన్న రాబందు.. నన్ను ఎవరూ ఏమీ చేయలేరని విర్రవీగి చివరకు ఒక్క గాలి వానకు కొట్టుకుపోయిందన్న చందంగా కేసీఆర్ పరిస్థితి మారింది.
గాలివానకు కొట్టుకుపోయిన రాబందులా కేసీఆర్ పరిస్థితి
పదేళ్లు నియంతలా పాలించి సంపద సర్వం దోచుకున్నారు
కంటోన్మెంట్ ప్రచారంలో మంత్రి పొంగులేటి
హైదరాబాద్, మే 8(ఆంధ్రజ్యోతి): ‘వెయ్యి గొడ్లను తిన్న రాబందు.. నన్ను ఎవరూ ఏమీ చేయలేరని విర్రవీగి చివరకు ఒక్క గాలి వానకు కొట్టుకుపోయిందన్న చందంగా కేసీఆర్ పరిస్థితి మారింది. తెలంగాణ సమాజం గాలి వానలో ఆయనకు కొట్టుకుపోయి ఐదు నెలలై పోయింది. మళ్లీ ఉద్యమ సెంటిమెంట్ రగిలించి లబ్ధి పొందాలనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు (కేసీఆర్) మాజీవి.. ఆ పప్పులేవీ ఉడకవు’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు.
బుధవారం సాయంత్రం సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి శ్రీగణేశ్, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్‌రెడ్డితో కలసి పాల్గొన్న మంత్రి.. మాజీ సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. అధికారం పోగానే కేసీఆర్‌కు ప్రతిపక్షం గుర్తుకొచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ సెంటిమెంటుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే ఉద్యమ ఆకాంక్షలకు తిలోదకాలిచ్చి పదేళ్లు నియంత పాలన సాగించారని మండిపడ్డారు.
‘నేనే రాజు.. నేనే మంత్రి’ని అనే విధంగా పాలన సాగించి తెలంగాణ సంపదను సర్వం దోచుకున్నారని ఆరోపించారు. ఆనాడు ప్రతిపక్షాలను గౌరవించకుండా, గుర్తించకుండా.. వాటి ఉనికే లేకుండా చేశారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీదేనని చెప్పారు.
Updated Date - May 09 , 2024 | 05:48 AM