Khammam: దేశ ప్రతిష్ఠను తాకట్టు పెట్టిన మోదీ..
ABN, Publish Date - Apr 29 , 2024 | 05:07 AM
త పదేళ్లలో దేశ పరువు ప్రతిష్టలను ప్రధాని మోదీ ఇతర దేశాల వద్ద తాకట్టు పెట్టారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.
కేసీఆర్‌లో ఇంకా అహంకారం తగ్గలేదు: మంత్రి పొంగులేటి
ఖమ్మంలో కాంగ్రె్‌సకు అత్యధిక మెజారిటీ: తుమ్మల
సత్తుపల్లి/ఖమ్మం సంక్షేమవిభాగం, ఏప్రిల్ 28: గత పదేళ్లలో దేశ పరువు ప్రతిష్టలను ప్రధాని మోదీ ఇతర దేశాల వద్ద తాకట్టు పెట్టారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆదివారం జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గంటకో ఖరీదైన దుస్తులు వేసుకొని దేశాలు తిరగటం తప్ప దేశానికి మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. నల్ల చట్టలాకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 800 మంది రైతులను పొట్టనబెట్టుకుందన్నారు. రాష్ట్ర విభజన హామీలు అమలు చేయలేదని ఆరోపించారు.]
కేసీఆర్‌ను ప్రజలు తిరస్కరించి మాజీని చేశారని, అయినా ఆయనలో అహంకారం ఇంకా తగ్గలేదన్నారు. ముఖ్యమంత్రిగా పదేళ్లలో ఏనాడూ ప్రజలను, ప్రజాప్రతినిధులను కలవని కేసీఆర్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. రూ.7లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించినందుకు వేయాలా.. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల్లో రూ.లక్షన్నర కోట్ల అవినీతి చేసిందుకు బీఆర్‌ఎ్‌సకు ఓట్లు వేయాలా? అని ప్రశ్నించారు. దేశంకోసం ప్రాణా త్యాగం చేసి ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ కుటుంబాలకు అండగా ఉండి రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డికి అత్యధిక మెజారిటీ వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. రాష్ట్రంలో 15 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరింత బలోపేతం అవుతుందన్నారు.
కూరగాయల మార్కెట్‌లో రఘురాంరెడ్డి ప్రచారం
‘‘బరువులు మోయగలను.. మీ బాధ్యతలను మోయగలను’’ అంటూ ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి రామసహాయం రఘురాంరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని రాపర్తినగర్ కూరగాయల మార్కెట్‌లో ఆయన ఆదివారం ప్రచారం నిర్వహించారు. హమాలీలతో కలిసి ఉల్లిపాయల బస్తాను భుజంపై వేసుకుని మోశారు. అందరిలో ఒకడిగా ఉంటానని, ప్రజాసేవలో మమేకమై పనిచేస్తానని పేర్కొన్నారు.
మోదీ మళ్లీ వస్తే.. రిజర్వేషన్లు ఎత్తేస్తాడు: వీహెచ్
హైదరాబాద్, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): దేశంలో మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లతో పాటు ముస్లిం రిజర్వేషన్లనూ ఎత్తేస్తాడని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు ఆరోపించారు. ఈ పదేళ్లలో అయోధ్యలో రామాలయం కట్టడం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ కులగణన చేస్తామని చెప్పడంతో బీజేపీ మరింత దిగజారి మాట్లాడుతోందని ఆదివారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. మోదీ ఆలోచనంతా కార్పొరేట్ స్థాయేనని, కాంగ్రె్‌సకు ఓటేస్తేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. కాగా, గాంధీభవన్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు కాంగ్రె్‌సలో చేరారు. చేరికల కమిటీ సభ్యుడు, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్‌కే మా మద్దతు: మాల, మాదిగ సంఘాలు
పంజగుట్ట, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, హస్తం పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని తెలంగాణ మాల, మాదిగ సంఘాలు ప్రకటించాయి. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన వేరు వేరు సమావేశాల్లో మాల, మాదిగల సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. వర్గీకరణ పేరుతో కాలయాపన చేస్తున్న బీజేపీని చిత్తుగా ఓడిస్తామని మాదిగ ఉపకులాల ఫ్రంట్ పేర్కొంది. వర్గీకరణ పేరుతో దళితుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్న పార్టీలకు తగిన విధంగా బుద్ధి చెబుతామని టీఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం సైనికుల్లా పోరాడుతామని మాల జేఏసీ చైర్మన్ చెరుకు రాంచందర్ అన్నారు. మంద కృష్ణ మాదిగ.. బీజేపీకి ఏజెంటుగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
Updated Date - Apr 29 , 2024 | 05:07 AM