Medical Research: గోరుముద్ద నుంచే బ్యాక్టీరియా
ABN, Publish Date - Nov 09 , 2024 | 03:18 AM
అమ్మ చేతి గోరు ముద్ద.. బిడ్డలకు అమృతంతో సమానం! కానీ.. అది ఒకప్పటి మాట!! మనిషి జీర్ణకోశ కణజాలానికి పట్టుకుని అల్సర్ నుంచి జీర్ణాశయ క్యాన్సర్ దాకా పలు వ్యాధులకు, సమస్యలకు కారణమయ్యే హెలికోబ్యాక్టర్
చిన్నతనంలోనే కడుపులోకి హెచ్ పైలోరీ
దానిబారిన దేశంలో 50-60 కోట్ల మంది!
ఒకరికి నుంచి మరొకరికి తేలిగ్గా వ్యాప్తి
ఎన్నెన్నో వ్యాధులకు కారణం
శ్వాసపరీక్షలతో గుర్తించి చికిత్స చేయొచ్చు
నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ బారీ మార్షల్
దేశంలోనే ఏఐజీలో తొలి పరిశోధన కేంద్రం
హైదరాబాద్ సిటీ, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): అమ్మ చేతి గోరు ముద్ద.. బిడ్డలకు అమృతంతో సమానం! కానీ.. అది ఒకప్పటి మాట!! మనిషి జీర్ణకోశ కణజాలానికి పట్టుకుని అల్సర్ నుంచి జీర్ణాశయ క్యాన్సర్ దాకా పలు వ్యాధులకు, సమస్యలకు కారణమయ్యే హెలికోబ్యాక్టర్ పైలోరీ (హెచ్.ఫైలోరీ) అనే బ్యాక్టీరియా శరీరంలో చేరడానికి అమ్మ చేతి గోరుముద్ద కూడా కారణమే అని.. దీనిపై విస్తృతస్థాయిలో పరిశోధనలు చేసి 2005వ సంవత్సరంలో నోబెల్ బహుమతి అందుకున్న శాస్త్రవేత్త, ప్రొఫెసర్ బారీ మార్షల్ చెబుతున్నారు. హెచ్.పైలోరీ వల్ల కలిగే నష్టాలు ప్రపంచానికి తెలియజేసేందుకు.. ఆ బ్యాక్టీరియాను తనకు తానే ఎక్కించుకుని, తన ఉదరాన్నే ప్రయోగశాలగా మార్చిన వ్యక్తి ఆయన! అల్సర్, జీర్ణకోశ సంబంధిత క్యాన్సర్‌ల చికిత్సలో.. ఆయన పరిశోధనలు విప్లవాత్మక మార్పులకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో.. హెచ్.పైలోరీ గురించి సమగ్రంగా తెలుసుకునేందుకు, భారతదేశంలో ఈ బ్యాక్టీరియా వ్యాప్తి, నివారణ తదితర అంశాలపై విస్తృత పరిశోధనల కోసం దేశంలోనే తొలిసారిగా గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో ఆయన పేరిట ఒక రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు.
ఆ కేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన మార్షల్ ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. భారతదేశంలో దాదాపు 50-60 కోట్ల మంది ఈ బ్యాక్టీరియా బాధితులేనన్నారు. కడుపులోకి ప్రవేశించిన ఈ బ్యాక్టీరియా.. జీర్ణాశయ గోడలకు అంటుకుని ఉండి క్రమంగా జీర్ణప్రక్రియకు కీలకమైన ఆమ్లాల ఉత్పత్తిని అడ్డుకుంటాయని.. దీనివల్ల క్యాన్సర్‌ల బారిన పడే ముప్పు అధికమని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో ఎక్కువ మంది అల్సర్ల బారిన పడటానికి ఈ బ్యాక్టీరియా ఓ కారణమన్న ఆయన.. ఎండోస్కోపీ, రక్త, మల పరీక్షల ద్వారా మాత్రమే కాక.. శ్వాస పరీక్షలతో కూడా ఈ బ్యాక్టీరియా ఉనికిని గుర్తించి చికిత్స చేయొచ్చన్నారు. కుటుంబంలో ఒకరికి ఈ బ్యాక్టీరియా ఉంటే ఆ కుటుంబం మొత్తం బ్యాక్టీరియా బారిన పడినట్లుగానే భావించాల్సి ఉంటుందని తెలిపారు. 90 శాతం చిన్నారులకు ఈ బ్యాక్టీరియా తల్లి ద్వారానే సోకుతుందని పరిశోధనల్లో తేలినట్టు వెల్లడించారు. ఇతరులతో ఆహారం పంచుకుని తినడం, నీటి ద్వారా కూడా ఈ బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందన్నారు.
పెద్ద వయసు వ్యక్తులలో ఈ బ్యాక్టీరియా లక్షణాలు పెద్దగా కనబడవన్న బారీ.. 10ు మంది అల్సర్ల బారిన పడతారని, మరో 5ు మందిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదమూ ఉందని పేర్కొన్నారు. కుటుంబంలో జీర్ణకోశ క్యాన్సర్లు, అల్సర్ల బారిన పడినవారు ఉంటే.. వారు శ్వాస పరీక్షలతో పాటుగా ఎండోస్కోపీ లాంటి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని.. ఒకవేళ బ్యాక్టీరియా ఉంటే రెండు వారాల పాటు చికిత్సను తీసుకోవాలని వివరించారు. ఇండియాలో యాంటీ మైక్రో బయాల్ రెసిస్టెన్స్ కేసులు పెరుగుతున్నాయి కాబట్టి నూతన ఔషదాలను వాడాల్సి వస్తోంద అనకునేవారమని.. ఆందోళన వెలిబుచ్చారు. ‘‘హెచ్‌పైలోరీ బ్యాక్టీరియా వల్ల జీర్ణకోశంలో ఆమ్లాల స్థాయులు తగ్గిపోయి క్యాన్సర్ బారిన పడే ప్రమాదాలున్నాయి. ఇండియాలో మసాలాలు దట్టించిన ఆహారం తింటుంటారు కాబట్టి.. వారిలో ఆమ్లాల స్థాయులు మళ్లీ మెరుగుపడే అవకాశాలున్నాయి’’ అని మార్షల్ నవ్వుతూ అన్నారు. అయితే.. ఇది దీనికి ఎలాంటి ఆధారాలు లేవు అని నవ్వుతూ అన్నారు. ఈ బ్యాక్టీరియా వ్యాప్తిని అడ్డుకునే మార్గాలే లేవన్న ఆయన.. అది ఎవరి ద్వారా అయినా, ఎలాగైనా మన జీర్ణకోశంలో చేరవచ్చన్నారు. పెద్దలలో ఈ బ్యాక్టీరియా కనబడితే టెట్రాసైక్లిన్స్ తరహా యాంటీ బయాటిక్ మందులను వాడాల్సి ఉంటుందన్నారు.
అభిమాన ప్రొఫెసర్..
బారీ తన అభిమాన ప్రొఫెసర్లలో ఒకరని.. డాక్టర్ నాగేశ్వర రెడ్డి అన్నారు. ‘‘అల్సర్లు కేవలం ఎసిడిటీ వల్ల వస్తాయని 1980లలో అనుకునేవారం. కానీ, ఆ సమయంలో బారీ, మైక్రో బయాలజిస్ట్ వారెన్‌లు తమ పరిశోధనల ద్వారా అల్సర్లు, జీర్ణకోశ క్యాన్సర్‌లకు హెచ్ పైలోరీ కారణమని చెప్పారు. అప్పట్లో వారిని ఎవరూ విశ్వసించలేదు. దానితో తన పరిశోధనలు నిజమని నిరూపించడానికి ఆయన ఆ బ్యాక్టీరియాను మింగారు. బ్యాక్టీరియా చేసే విధ్వంసం అందరికీ చూపారు’’ అని నాగేశ్వర రెడ్డి వివరించారు.
Updated Date - Nov 09 , 2024 | 03:18 AM