Mallu Ravi: సాయిరెడ్డి ఆత్మహత్యతో సీఎం సోదరులకు సంబంధం లేదు
ABN, Publish Date - Nov 24 , 2024 | 03:50 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన నాగర్‌కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యతో సీఎం రేవంత్‌రెడ్డికి గానీ, ఆయన సోదరులకు గానీ ఎలాంటి సంబంధం లేదని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి తెలిపారు.
ఎంపీ మల్లు రవి
వంగూరు, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన నాగర్‌కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యతో సీఎం రేవంత్‌రెడ్డికి గానీ, ఆయన సోదరులకు గానీ ఎలాంటి సంబంధం లేదని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి తెలిపారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేశ్‌రెడ్డితో కలిసి శనివారం ఆయన కొండారెడ్డిపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సీఎం సోదరులు కక్ష కట్టడం వల్లే సాయిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారని, అందుకు సీఎం బాధ్యత వహించాలని కేటీఆర్, హరీశ్‌రావులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
మాజీ సర్పంచ్ ఇంటికి దారి ఇవ్వకుండా అడ్డంగా గోడ కట్టారని మాట్లాడటం సరికాదన్నారు. సాయిరెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో త్వరలో బయటకు వస్తుందన్నారు. గోడ కట్టినట్టు ఇక్కడికి వచ్చి నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని కేటీఆర్, హరీశ్‌రావులకు ఎమ్మెల్యే వంశీకృష్ణ సవాల్ విసిరారు. పుట్టిన ఊరి రుణం తీర్చుకోవాలన్న తపనతో సీఎం రేవంత్ పలు అభివృద్ధి పనులు చేపడుతుంటే వాటిని రాజకీయం చేయడం తగదన్నారు. బీఆర్‌ఎస్ చేస్తున్న చౌకబారు విమర్శలు, శవరాజకీయాలను ప్రజలు క్షమించరని విమర్శించారు.
Updated Date - Nov 24 , 2024 | 03:50 AM