HYDRA: చట్టవిరుద్ధం..
ABN, Publish Date - Aug 25 , 2024 | 03:39 AM
ఎన్ కన్వెన్షన్ విషయంలో హైడ్రా చట్ట విరుద్ధంగా వ్యవహరించిందని సినీ నటుడు నాగార్జున తెలిపారు.
స్టే ఆర్డర్, కోర్టు కేసులున్నా పట్టించుకోలేదు
పట్టా భూమిలోనే నిర్మాణం చెరువును అంగుళం కూడా ఆక్రమించలేదు
కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే నేనే కూల్చివేయించేవాడిని
ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయనే వివరణ అక్కినేని నాగార్జున
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): ఎన్ కన్వెన్షన్ విషయంలో హైడ్రా చట్ట విరుద్ధంగా వ్యవహరించిందని సినీ నటుడు నాగార్జున తెలిపారు. స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులున్నా కూల్చివేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. పట్టా భూమిలోనే నిర్మాణం చేపట్టామని, చెరువు స్థలం అంగుళం కూడా ఆక్రమించలేదని పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించేలా ఎలాంటి చర్యలకూ పాల్పడలేదని చెప్పారు.
కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. కూల్చివేత కోసం గతంలో జారీ చేసిన నోటీసుపై కోర్టు స్టే ఇచ్చిందన్నారు. కూల్చివేత.. తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగిందని భావిస్తున్నట్లు తెలిపారు. తమకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని, కోర్టులో కేసు ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.
కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పునిస్తే.. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా దగ్గరుండి కూల్చివేయించే వాడినన్నారు. తాజా పరిణామాలతో.. మేం ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని, అందుకే ఈ వివరాలు వెల్లడించినట్లుగా పేర్కొన్నారు.
Updated Date - Aug 25 , 2024 | 03:39 AM