Nagarjuna Sagar: ‘సాగర్’ రెండు గేట్ల నుంచి నీటి విడుదల
ABN, Publish Date - Oct 28 , 2024 | 04:48 AM
నాగార్జునసాగర్ ప్రాజెక్టు రెండు గేట్ల నుంచి రెండ్రోజులుగా నీరు విడుదలవుతోంది. ఎగువనున్న శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 67,403 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదులుతున్నారు.
589.70 అడుగులున్న ప్రాజెక్టు నీటిమట్టం
‘పులిచింతల’ 2 గేట్ల నుంచి నీటి విడుదల
కృష్ణా, తుంగభద్ర నదులకు తగ్గిన వరద
నాగార్జునసాగర్, కేతేపల్లి, మేళ్లచెర్వు, గద్వాల, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ ప్రాజెక్టు రెండు గేట్ల నుంచి రెండ్రోజులుగా నీరు విడుదలవుతోంది. ఎగువనున్న శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 67,403 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదులుతున్నారు. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి 589.70 అడుగులుగా ఉంది. సాగర్ కుడి, ఎడమకాల్వలు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం, ఎస్‌ఎల్‌బీసీ, వరదకాల్వ, రెండు క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి మొత్తం 64,472 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా ఎగువ నుంచి 67,403 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
ఇక 645 అడుగుల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం గల మూసీ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 643.80 అడుగులు ఉంది. ఆదివారం సాయంత్రానికి 702.69 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. రెండు రోజులుగా ఒక గేటు నుంచి నీటిని విడుదల చేస్తుండగా.. ఆదివారం మూడో నంబర్ గేటును అడుగుమేర ఎత్తి 650.34 క్యూసెక్కుల నీటిని.. సీపేజీ, లీకేజీలు, ఆవిరి రూపంలో 53.35 క్యూసెక్కుల నీరు కలిసి మొత్తం 703.69 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతుంది. కాగా పులిచింతల ప్రాజెక్టు 2 గేట్ల ద్వారా 28,222 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి 173.52అడుగులు ఉంది.
మరోవైపు కర్ణాటకలో వర్షాలు తగ్గిపోవడంతో కృష్ణా, తుంగభద్ర నదులకు వరద తగ్గుతోంది. ఆదివారం జూరాల కు 47వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, 4గేట్ల ద్వారా 16వేల క్యూసెక్కులు, జల విద్యుదుత్పత్తి ద్వారా 38,043క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్‌కు 17వేలక్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, గేట్లను మూసివేసి జల విద్యుదుత్పత్తి ద్వారా 5వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 72వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, జల విద్యుదుత్పత్తి ద్వారా 67వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
Updated Date - Oct 28 , 2024 | 04:48 AM