Jagadish Reddy: రుణమాఫీ ఒక జోక్.. మాజీ మంత్రి ఫైర్..
ABN, Publish Date - Jul 22 , 2024 | 06:13 PM
రుణమాఫీపై స్పష్టత లేదని వివరాలు అడిగితే అధికారులు గందరగోళానికి గురవుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత గుంటకండ్ల జగదీశ్ రెడ్డి(Jagdish Reddy) అన్నారు. రైతులకు రుణమాఫీ చేశామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని, కానీ అది ఒక పెద్ద జోక్‌లా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
సూర్యాపేట: రుణమాఫీపై స్పష్టత లేదని వివరాలు అడిగితే అధికారులు గందరగోళానికి గురవుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత గుంటకండ్ల జగదీశ్ రెడ్డి(Jagdish Reddy) అన్నారు. రైతులకు రుణమాఫీ చేశామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని, కానీ అది ఒక పెద్ద జోక్‌లా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు స్వప్రయోజనాలు చూసుకోవడం తప్ప తెలంగాణ ప్రజల్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
వ్యవసాయం, సాగునీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎవ్వరికీ అవగాహన లేదని జగదీశ్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ వద్ద లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతున్నా ఎందుకు ఎత్తి పోయడం లేదో చెప్పాలని మాజీ మంత్రి ప్రశ్నించారు. కాళేశ్వరం కాల్వలకు నీరు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం కొట్టుకుపోతుందని అధికార పార్టీ నేతలు దుష్ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. గత యాసంగిలాగా ఈసారి కూడా రైతులకు నీరివ్వకుండా ఎండబెడితే తీవ్ర పరిణామాలు తప్పవని జగదీశ్ రెడ్డి హెచ్చరించారు.
గోదావరి ఆయకట్టుకు నీళ్లందించే అవకాశం ఉన్నా రైతుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని జగదీశ్ రెడ్డి దుయ్యబట్టారు. గోదావరి నీళ్లు వృథాగా పోనీయకుండా తక్షణమే సాగు, తాగు నీరందించాలని డిమాండ్ చేశారు. గోదావరి నీటిని లిఫ్టింగ్ చేయకపోవడంపై ఆయన నిప్పులు చెరిగారు. హామీలు అమలు చేస్తున్నామని డబ్బా కొట్టుకుంటున్న రేవంత్ రెడ్డిని ఉచిత బస్సుల సంఖ్య తగ్గించారని మహిళలు శపిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అప్రకటిత కరెంట్ కోతల నుంచి తప్పించుకునేందుకు విద్యుత్ అధికారులపై నెపం నెట్టే చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - Jul 22 , 2024 | 06:13 PM