Vemula Veeresham: ఎమ్మెల్యేనే గుర్తుపట్టని పోలీసులు.. మండిపడి, అవమానభారంతో వెనుదిరిగి...
ABN, Publish Date - Aug 31 , 2024 | 12:31 PM
ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేనే పోలీసులు గుర్తుపట్టకపోవడం నల్గొండలో చర్చనీయాంశం అవుతోంది. శుక్రవారం పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన నిమిత్తం మంత్రులు సహా ఉమ్మడి నల్గొండ జిల్లాకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు భువనగిరికి వెళ్లారు.
నకిరేకల్: ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేనే పోలీసులు గుర్తుపట్టకపోవడం నల్గొండలో చర్చనీయాంశం అవుతోంది. శుక్రవారం పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన నిమిత్తం మంత్రులు సహా ఉమ్మడి నల్గొండ జిల్లాకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు భువనగిరికి వెళ్లారు. ఈ క్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి(Vemula Veeresham) చేదు అనుభవం ఎదురైంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్న భువనగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నీటిపారుదల శాఖ పనులపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. వారంతా ప్రత్యేక హెలికాప్టర్‌లో భువనగిరికి చేరుకున్నారు.
హెలిప్యాడ్ వద్దకు చేరుకోగానే మంత్రులకు స్వాగతం పలికేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు క్యూ కట్టారు. అయితే వారికి స్వాగతం పలికేందుకు హెలీప్యాడ్ వద్దకు వెళ్లిన వేముల వీరేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే.. పోలీసులకు కామన్ సెన్స్ ఉండదా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను గుర్తుపట్టే స్థాయిలో పోలీసులు లేరా? అంటూ ఆగ్రహించారు.
సముదాయించినా వినకుండా..
అయితే భద్రత తనిఖీ విభాగం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఎమ్మెల్యేని గుర్తుపట్టలేదని తెలిసింది. మంత్రులకు స్వాగతం పలికేందుకు వెళ్లగా.. ఆయన్ని గేటు వద్దే అడ్డుకున్నారు. బయటి వ్యక్తులకు లోపలికి వెళ్లనిచ్చేది లేదని తేల్చిచెప్పడంతో ఎమ్మెల్యే ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చేసేదేమీ లేక.. తాను ఎమ్మెల్యేనని పోలీసులకు చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ అవమానంతో వీరేశం అక్కడి నుంచి అలిగి వెళ్లిపోవాలనుకున్నారు.
అక్కడే ఉన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి కలగజేసుకుని సముదాయించే ప్రయత్నించారు. 'పోలీసులకు కామన్‌సెన్స్ ఉండదా. ఎవరు ఎమ్మెల్యేనో.. ఎవరు కాదో తెలియదా..?' అని వీరేశం విరుచుకుపడ్డారు. నేతలు చెప్పినా వినకుండా అలకబూని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే చెకింగ్ పాయింట్ దగ్గర తెలిసిన పోలీసులను ఉంచకపోవటం వల్లే ఇలా జరిగిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ ఘటన ఉమ్మడి నల్గొండ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
For Latest News click here
Updated Date - Aug 31 , 2024 | 12:41 PM