ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hydra : మునిసిపాలిటీల్లోనూ హైడ్రా!

ABN, Publish Date - Sep 20 , 2024 | 03:25 AM

చెరువులు, కుంటల సంరక్షణకు రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా తరహాలో కొత్త వ్యవస్థ రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను మున్సిపల్‌ శాఖ ప్రభుత్వానికి పంపింది.

  • ప్రభుత్వానికి సంబంధిత శాఖ ప్రతిపాదన

  • నేటి మంత్రివర్గ భేటీలో చర్చకు అవకాశం

హైదరాబాద్‌, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): చెరువులు, కుంటల సంరక్షణకు రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా తరహాలో కొత్త వ్యవస్థ రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను మున్సిపల్‌ శాఖ ప్రభుత్వానికి పంపింది. సీఎం రేవంత్‌రెడ్డి నుంచి ఆమోదం రాగానే ఆచరణ రూపు దాల్చనుంది. శుక్రవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం చర్చకు రావొచ్చని భావిస్తున్నారు. ఇటీవలి భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. చెరువులు, నీటి వనరుల ఆక్రమణే దీనికి ప్రధాన కారణమని తేలింది. ఈ నేపథ్యంలో హైడ్రా తరహా వ్యవస్థ కోసం డిమాండ్లు పెరిగాయి. సీఎం రేవంత్‌ వరద ప్రాంతాల పర్యటనకు ఖమ్మం వెళ్లినపుడు హైడ్రాను రాష్ట్రవ్యాప్తం చేస్తామని చెప్పారు. అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్‌ శాఖను ఆదేశించారు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో కబ్జాలకు పెద్ద ఆస్కారం లేనందున తొలుత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో హైడ్రాను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.


వర్షాలు వచ్చినపుడు పట్టణాల్లోని నివాస ప్రాంతాలే ముంపునకు గురవుతున్నాయి. అందుకే 129 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. దీనికోసం ముందుగా చెరువులు, కుంటల గుర్తింపు, వాటి పరిధి నిర్ధారణ, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లపై స్పష్టమైన అవగాహనకు రావాలని అధికారులు భావిస్తున్నారు. మున్సిపల్‌, రెవెన్యూ, సాగు నీటి అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలతో సర్వే జరపాలని ప్రభుత్వానికి విన్నవించారు. హద్దుల నిర్ధారణ జరిగితే కబ్జాల తొలగింపు సులభమవుతుందని, అపుడు హైడ్రా తరహా వ్యవస్థ రంగంలోకి దిగడం సులభమవుతుందని అధికారులు చెబుతున్నారు. సీఎం నుంచి అనుమతి వచ్చిన తక్షణమే సర్వేకు పూనుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు.


  • అసలు నీటి వనరులు ఎన్ని?

అసలు రాష్ట్రంలో, ముఖ్యంగా మున్సిపాలిటీల్లో ఎన్ని చెరువులు, కుంటలు, నీటి వనరులు ఉన్నాయో తేల్చాల్సిన అవసరం ఉందని కూడా అంటున్నారు. జీహెచ్‌ఎంసీ, ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న చెరువులు, వాటి పరిధిపై ఒక అంచనా ఉంది. చెరువుల పరిరక్షణకు ఉమ్మడి ఏపీలో 2010లోనే కమిటీని ఏర్పాటు చేసినా నామమాత్రంగానే పనిచేసింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత మిషన్‌ కాకతీయను తీసుకొచ్చారు. ఇది ఐదేళ్లు చర్యలు చేపట్టినా.. తర్వాత ఎలాంటి కార్యాచరణ లేకుండా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటలపై భిన్నమైన లెక్కలున్నాయి. చెరువుల పరిధులపై స్పష్టత లేదు. తొలుత వాటిని తేల్చాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో సాగునీటి శాఖ 46,531 చెరువులు, కుంటలు ఉన్నాయని చెబుతోంది.


ఏడాది క్రితం కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ రాష్ట్రంలో చిన్న, పెద్ద చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరులు కలిపి 64,055 ఉన్నాయని పేర్కొంది. మానవ ప్రయత్నంగా తవ్విన చెరువులు 53,556, ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి 10,170 అని పేర్కొంది. 3032 చెరువులు 25 నుంచి 75 శాతం వరకు కబ్జా అయ్యాయని నీటి పారుదల శాఖ గుర్తించింది. మొత్తం నీటి వనరుల్లో 98.5 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. పట్టణాల్లో 1.5 శాతమే ఉన్నట్లు పేర్కొన్నా.. ఇంకా ఎక్కువే ఉంటాయని మంత్రిత్వ శాఖ చెప్పింది. ఇప్పుడు ఆ లెక్క తేల్చాల్సి ఉందని మున్సిపల్‌ శాఖ అధికారి ఒకరు వివరించారు.


  • ఆపరేషన్‌ హిమాయత్‌సాగర్‌!

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఆపరేషన్‌ హిమాయత్‌సాగర్‌..! జంట జలాశయాల్లోని ఒకటైన దీంట్లోని ఆక్రమణలను నేడో, రేపో తొలగించనున్నారా? అంటే హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఎసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) వర్గాలు ఔననే సమాధానం చెబుతున్నాయి. హిమాయత్‌సాగర్‌లో కబ్జాలపై వాటర్‌ బోర్డు ఇటీవల హైడ్రాకు నివేదిక అందజేసింది. దీనిపై కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ఉన్నతాధికారులతో చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో సమావేశంలో హిమాయత్‌సాగర్‌, ఇతర చెరువుల్లో ఆక్రమణల వివరాలను వెల్లడించినట్టు తెలిసింది. గురువారం రంగనాథ్‌ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇందులో తదుపరి కూల్చివేతలపై చర్చ జరిగినట్టు సమాచారం. వాస్తవానికి ఇప్పటికై ఒక విడత హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. గత నెల 18వ తేదీన గండిపేటలోని చిలుకూరు, ఖానాపూర్‌ గ్రామాల పరిధిలో 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 24 ఆక్రమణలను తొలగించింది.


ఇందులో కేంద్ర మాజీ మంత్రులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, పలు పార్టీల నాయకుల ఫాం హౌజ్‌లు, ఇతర నిర్మాణాలున్నాయి. మొత్తంమీద హిమాయత్‌సాగర్‌లో 83 ఆక్రమణలను గుర్తించినట్టు తెలిసింది. ఇందులో షెడ్లు, తాత్కాలిక నిర్మాణాలు, ప్రహరీ గోడలు ఉన్నాయి. దాదాపు పది వరకు శాశ్వత నిర్మాణాలు ఉన్నట్టు తేల్చారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల భవనాలున్నాయని సమాచారం. ఈ క్రమంలోనే కూల్చివేతల విషయాన్ని హైడ్రా ముందుగానే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నట్టు తెలుస్తోంది. కాగా, 1908లో వచ్చిన వరదలను దృష్టిలో పెట్టకుని.. 1927లో ఈసా నదిపై హిమాయత్‌ సాగర్‌ను నిర్మించారు. ఉస్మాన్‌సాగర్‌తో కలిసి ఒకప్పుడు హైదరాబాద్‌కు ప్రధాన తాగు నీటి వనరుగా నిలిచింది. కాలక్రమంలో జనాభా పెరుగులతో ప్రభుత్వాలు కృష్ణా, గోదావరి జలాలను తీసుకొచ్చాయి. మరోవైపు జంట జలాశయాలు ఆక్రమణకు గురవడం మొదలైంది. ఇప్పుడు ఆ చెర విడిపించే పనిలో హైడ్రా నిమగ్నం కానుంది.

Updated Date - Sep 20 , 2024 | 03:25 AM