ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Buffer Zones: త్వరలో హైడ్రా వెబ్‌సైట్‌!

ABN, Publish Date - Sep 14 , 2024 | 04:23 AM

‘‘ఫలానా ప్రాంతంలో ప్లాటు/ఫ్లాటు కొనుగోలు చేయాలనుకుంటున్నాం. ఆ భవనం/స్థలం ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉందా?

  • చెరువుల వివరాలు, ఎఫ్‌టీఎల్‌,

  • బఫర్‌ జోన్‌లో నిర్మాణాల సమాచారం

  • హైడ్రాకు సర్కారు 50 కోట్లు విడుదల

  • భవిష్యత్తులో ప్రభుత్వ భూముల వివరాలుండేలా ప్రణాళిక

  • ఫిర్యాదు చేయడమే కాదు.. వాటి స్థితిని తెలుసుకునే చాన్స్‌

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ‘‘ఫలానా ప్రాంతంలో ప్లాటు/ఫ్లాటు కొనుగోలు చేయాలనుకుంటున్నాం. ఆ భవనం/స్థలం ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉందా? ఫ్లాటు కోనుగోలు కోసం అడ్వాన్స్‌ ఇచ్చాం.. చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌, పార్కు స్థలంలో ఆ నిర్మాణం ఉందా? కొనుగోలు చేయాలా? వద్దా?’’... ఇలా అనేక అనుమానాలతో హైడ్రా, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కార్యాలయాల చుట్టూ కొనుగోలుదారులు చక్కర్లు కొడుతున్నారు. అయితే.. ఇలాంటి ఇబ్బందులు త్వరలోనే చెక్‌ పడనుంది. భవనాలు/లే అవుట్లు.. ఎఫ్‌టీఎల్‌ లేదా బఫర్‌ జోన్‌లో ఉన్నాయా? లేదా? అన్న సమాచారాన్ని ఒక్క క్లిక్‌తో తెలుసుకునేలా సాంకేతికత అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ఓ వెబ్‌సైట్‌ను తీసుకురావాలని హైడ్రా కసరత్తు చేస్తోంది.


హైడ్రా స్వరూపం ఎలా ఉండాలి? విధులు.. తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి స్థాయిలోనూ చర్చించినట్టు తెలిసింది. వెబ్‌సైట్‌ రూపకల్పన బాధ్యతను సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(సీజీజీ)కు అప్పగించిన సంస్థ.. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపింది. కూల్చివేతల నేపథ్యంలో నెలకొన్న గందరగోళానికి చెక్‌ పెట్టేలా, సమగ్ర సమాచారం తెలుసుకునేలా వెబ్‌సైట్‌ ఉండాలని హైడ్రా భావిస్తోంది. సంస్థ ఏర్పాటు ఉద్దేశాన్ని స్పష్టంగా వివరించడంతోపాటు చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలపై ప్రజలు ఫిర్యాదు చేసే అవకాశం కల్పించనుంది. ఫిర్యాదు స్థితిని ప్రజలే నేరుగా తెలుసుకునే అవకాశం కల్పించడంతోపాటు హైడ్రాలో అధికారిక వ్యవస్థ ఎలా ఉంటుందన్న వివరాలన్నీ పొందుపర్చాలని భావిస్తోంది. చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లోని నిర్మాణాలు, లే అవుట్ల వివరాలు, కూల్చివేసిన భవనాల సమాచారమూ వెబ్‌సైట్‌లో ఉంచనుంది.


  • గూగుల్‌ ఎర్త్‌లో చెరువుల వివరాలు

తుది నోటిఫికేషన్‌ ప్రకటించిన చెరువుల మ్యాప్‌లు హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నా.. సాధారణ పౌరులకు ఏమాత్రం అర్థం కాని పరిస్థితి ఉంది. వెబ్‌సైట్‌లో కనిపించే మ్యాప్‌, సర్వే నంబర్ల ఆధారంగా క్షేత్రస్థాయిలో భౌగోళిక స్వరూపం అంచనా వేయడం దాదాపు అసాధ్యం. ఈ నేపథ్యంలో ఆయా చెరువుల కో ఆర్డినేట్స్‌ను గూగుల్‌ ఎర్త్‌లో అప్‌లోడ్‌ చేయాలని హైడ్రా భావిస్తోంది. హెచ్‌ఎండీఏ, ఇతర విభాగాల సహకారంతో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్టు కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు. దీంతో కొనుగోలు చేయాలనుకుంటున్న ప్లాటు లేదా ఫ్లాటు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉందా? లేదా? అన్నది గూగుల్‌ మ్యాప్స్‌లోనే చూసుకునే అవకాశం ఉంటుంది.కాగా, భవిష్యత్తులో ఔటర్‌ వరకు ఉన్న ప్రభుత్వ భూముల వివరాలూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఆయా సర్వే నంబర్లలో భూములు, ప్లాట్లు కొనుగోలు చేయకుండా ప్రజలను అప్రమత్తం చేయనున్నారు. కూల్చివేతల నేపథ్యంలో ఫ్లాట్లు/ప్లాట్ల కొనుగోలు చేసేందుకు ప్రజలు జంకుతున్న విషయం తెలిసిందే. ఈ వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చిన అనంతరం స్పష్టత వస్తుందని, ఎప్పటిలానే క్రయ, విక్రయాలు జరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.


  • హైడ్రా ఖాతాలో 50కోట్లు జమ

హైడ్రాకు ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేసింది. శుక్రవారమే ఈ నిధులు సంస్థ ఖాతాలో జమ అయ్యాయి. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఏర్పాటైన హైడ్రాకు 2024-25 బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారు. ఇందులో మొదటి త్రైమాసికానికి సంబంధించి రూ.50 కోట్లు విడుదలయ్యాయి. సంస్థలోని అధికారులు, ఉద్యోగుల వేతనాలు, నిర్వహణ వ్యయం, కూల్చివేతల ఖర్చులకు ఈ నిధులను వినియోగించనున్నారు. ఆస్తుల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం 3500 మంది సిబ్బంది అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు. త్వరలోనే పోలీస్‌ శాఖతోపాటు ఇరిగేషన్‌, రెవెన్యూ, టౌన్‌ ప్లానింగ్‌ విభాగాల నుంచి అధికారులు హైడ్రాకు రానున్నారు. వీరందరి వేతనాలు, వాహన సదుపాయాల ఖర్చును హైడ్రా భరించనుంది.

Updated Date - Sep 14 , 2024 | 04:23 AM

Advertising
Advertising