Lagacherla Incident: అసలేం జరిగింది.. మీరేం చేశారు?
ABN, Publish Date - Nov 25 , 2024 | 04:00 AM
లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం విచారణ కొనసాగుతోంది. ఇటు రెవెన్యూ, పోలీసు అధికారులతోపాటు అటు సంగారెడ్డి జైలులో రిమాండ్‌లో ఉన్న లగచర్ల గ్రామస్థులను మానవ హక్కుల సంఘం బృందం ఆదివారం వేర్వేరుగా విచారించింది.
లగచర్ల ఘటనపై మానవ హక్కుల సంఘం విచారణ
వికారాబాద్ కలెక్టరేట్‌లో రెవెన్యూ, పోలీసు అధికారుల వద్ద వివరాల సేకరణ
సంగారెడ్డి జైల్లో లగచర్ల గ్రామస్థులతోనూ భేటీ
నేడూ విచారణ కొనసాగే అవకాశం
వికారాబాద్, కంది, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం విచారణ కొనసాగుతోంది. ఇటు రెవెన్యూ, పోలీసు అధికారులతోపాటు అటు సంగారెడ్డి జైలులో రిమాండ్‌లో ఉన్న లగచర్ల గ్రామస్థులను మానవ హక్కుల సంఘం బృందం ఆదివారం వేర్వేరుగా విచారించింది. అసలు ఆ రోజు ఏం జరిగింది ? దాడికి దారి తీసిన పరిణామాలేంటి ? అధికారులు ఏ విధంగా వ్యవహరించారు ? తదితర అంశాలపై విచారణ బృందం వివరాలు సేకరించింది. ఎన్‌హెచ్‌ఆర్సీ న్యాయవిభాగం డిప్యూటీ రిజిస్ట్రార్ ముఖేశ్, ఇన్‌స్పెక్టర్లు యతి ప్రకాశ్‌శర్మ, రోహిత్‌తో కూడిన బృందం ఆదివారం ఉదయం 10 గంటలకు సంగారెడ్డి సెంట్రల్ జైలుకు వచ్చింది. లగచర్ల ఘటనలో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న 19 మందిని విచారించింది. నాలుగు గంటలకు పైగా సాగిన ఈ ములాఖత్‌లో అధికారులు, పోలీసుల ప్రవర్తనపై ఆరా తీసింది.
పోలీసులు తమను హింసించారని కొందరు కమిషన్ దృష్టికి తీసుకురాగా వివరాలను లిఖితపూర్వకంగా తీసుకున్నట్లు సమాచారం. ఇక, ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి 6.40 గంటల వరకు వికారాబాద్ కలెక్టరేట్‌లో మానవ హక్కుల సంఘం బృందం విచారణ జరిపింది. జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, కొడంగల్ తహసీల్దార్ విజయకుమార్, వికారాబాద్ డీఎస్పీ శ్రీనివా్‌సరెడ్డి, కొడంగల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి, బొంరా్‌సపేట్ ఎస్‌ఐ ర హూఫ్‌ను వేర్వేరుగా ప్రశ్నించింది. ఘటనకు సంబంధించి పలు పత్రాలను తమకు అందజేయాలని ఆదేశించింది. నిందితులను అరెస్టు చేసే క్రమంలో బాధిత కుటుంబాలు చేసిన ఆరోపణలను ఈ సందర్భంగా వారు పోలీసుల ఎదుట ప్రస్తావించినట్లు తెలిసింది. సోమవారం కూడా ఈ విచారణ కొనసాగనున్నట్లు సమాచారం. కాగా, విచారణ కొనసాగుతోందని, మరికొంత సమాచారం రావాల్సి ఉందని మానవ హక్కుల సంఘం ప్రతినిధులు తెలిపారు.
‘పట్నం’ కస్టడీ పిటిషన్‌పై నేడు తీర్పు !
లగచర్లలో ఘటనలో ప్రధాన నిందితుడిగా అభియోగం ఎదుర్కొంటున్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై కొడంగల్ కోర్టు సోమవారం తీర్పు వెల్లడించే అవకాశముంది. నరేందర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ కూడా వికారాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులో సోమవారం విచారణకు రానుంది. అయితే, హైకోర్టులో నరేందర్‌రెడ్డి తరఫున దాఖలైన పిటిషన్లపై నిర్ణయం వెలువడిన తర్వాతే కింది కోర్టులు తమ తీర్పులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
నేడు లగచర్లకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
లగచర్ల ఘటనపై విచారణ నిర్వహించేందుకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సోమవారం లగచర్లలో పర్యటించనున్నారు. కలెక్టర్, ఇతర అధికారులపై దాడి చేశారన్న అభియోగంపై పోలీసు లు అర్ధరాత్రి దాడులు నిర్వహించి అక్రమ అరెస్టులు చేశారని, తమతో అసభ్యంగా ప్రవర్తించారని పలువురు మహిళలు కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు స్పందిస్తూ కమిషన్ చైర్మన్ సోమవారం లగచర్ల, రోటిబండ తండాలో పర్యటించి విచారణ చేపట్టనున్నారు. అనంతరం సంగారెడ్డి జైలులో రిమాండ్‌లో ఉన్న గ్రామస్థులతోనూ మాట్లాడనున్నారు.
నేడు మానుకోటలో బీఆర్‌ఎస్ మహాధర్నా: ఎర్రబెల్లి
మహబూబాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : లగచర్ల గిరిజన రైతులకు మద్దతుగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మానుకోటలో సోమవారం చేపట్టనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు మహబూబాబాద్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లగచర్ల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి గిరిజన రైతులకు న్యాయం చేసేంతవరకు బీఆర్‌ఎస్ పోరాటాలు ఆగవని స్పష్టం చేశారు.
Updated Date - Nov 25 , 2024 | 10:00 AM