NHRC Inquiry: అధికారులపై దాడి ఎలా జరిగింది?
ABN, Publish Date - Nov 26 , 2024 | 04:26 AM
భూసేకరణ కోసం ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు వచ్చిన అధికారులపై దాడి ఎలా జరిగిందని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ప్రతినిధుల బృందం.. కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిని ప్రశ్నించారు.
అర్ధరాత్రి కరెంటు ఎందుకు ఆపేశారు?
లగచర్ల ఘటనపై కొనసాగిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రతినిధుల విచారణ
అమాయకులపై కేసులు ఎత్తేయాలి
దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య
లగచర్ల, రోటిబండ తండాలో పర్యటన
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): భూసేకరణ కోసం ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు వచ్చిన అధికారులపై దాడి ఎలా జరిగిందని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ప్రతినిధుల బృందం.. కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిని ప్రశ్నించారు. రైతులను అరెస్టు చేసే క్రమంలో అర్ధరాత్రి సమమంలో విద్యుత్ సరఫరాను ఎవరి ఆదేశాలతో నిలిపివేశారని విద్యుత్ శాఖ ఏడీఈ అర్జున్, డీఈ భానుప్రసాద్‌లను విచారించారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి ఘటనకు ముందు, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం విచారణ మూడోరోజు కొనసాగింది. సోమవారం కొడంగల్ పట్టణంలోని కడా కార్యాలయంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ న్యాయవిభాగం డిప్యూటీ రిజిస్ట్రార్ ముకేశ్, ఇన్‌స్పెక్టర్‌లు యతిప్రకాశ్ శర్మ, రోహిత్‌సింగ్.. కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, విద్యుత్ శాఖ అధికారులను విచారించారు. దీంతోపాటు బాధిత కుటుంబాల నుంచి మూడురోజులపాటు సేకరించిన వివరాలతో సమగ్ర నివేదికను ఎన్‌హెచ్‌ఆర్‌సీకి అందించనున్నట్లు వారు తెలిపారు. మరోవైపు లగచర్లలో జరిగిన ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య విచారణ చేపట్టారు. సోమవారం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని లగచర్ల, రోటిబండ తండాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు గిరిజనులు మాట్లాడుతూ.. తమ కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. తమ పూర్వీకుల నుంచి ఆధారపడి జీవిస్తున్న భూములను తాము ఇవ్వబోమన్నారు. దీంతో.. ఎవరూ భయపడొద్దని, కమిషన్ అండగా ఉంటుందని చైర్మన్ భరోసా ఇచ్చారు. అయితే అధికారులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని, అమాయక గిరిజనులపై కేసులు ఎత్తేయాలని జిల్లా ఎస్పీకి సూచించినట్లు తెలిపారు.
ప్రజాభీష్టం మేరకే భూములు తీసుకోవాలి
2013 భూసేకరణ చట్టం ప్రకారం గ్రామాల్లో నోటీసులతో చాటింపులతో గ్రామ సభలు నిర్వహించి ప్రజాభీష్టం మేరకే భూములు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ అన్నారు. పోలీసులు అరెస్టులు ఆపి స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలన్నారు. విచారణ అనంతరం వికారాబాద్‌లోని అనంతగిరి హరిత రిసార్ట్స్‌కు వచ్చిన ఆయన.. కమిషన్ సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాత్రివేళ గిరిజన మహిళలపై దాడి చేసినట్లు కమిషన్ దృష్టికి రావడంతో జిల్లా ఎస్పీకి, కలెక్టర్‌కు నోటీసులు ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం ప్రకారం వ్యవహరించాలని అన్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అరెస్టయిన వారికి స్టేషన్ బెయిల్ ఇస్తుండడంతో చట్టానికి విలువ లేకుండా పోతోందని కమిషన్ చైర్మన్ వెంకటయ్య అన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతామన్నారు. అధికారులపై దాడి ఘటనలో అరెస్టయి.. సంగారెడ్డి జైలులో ఉన్న లగచర్ల గ్రామస్థులను కమిషన్ సభ్యులతో కలిసి చైర్మన్ వెంకటయ్య పరామర్శించారు.
Updated Date - Nov 26 , 2024 | 04:26 AM