Owaisi: టీటీడీలో హిందూయేతరులు లేనపుడు.. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు ఎందుకు?
ABN, Publish Date - Nov 03 , 2024 | 03:23 AM
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తీసుకొచ్చిందని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.
వక్ఫ్ సవరణ బిల్లు.. రాజ్యాంగ ఉల్లంఘన
బీఆర్‌ఎస్ వాళ్ల జాతకాలు మా దగ్గరున్నాయి
నేను నోరు విప్పితే వాళ్లు తట్టుకోలేరు: అసదుద్దీన్ ఒవైసీ
వక్ఫ్ సవరణ బిల్లు.. రాజ్యాంగ ఉల్లంఘన
బీఆర్‌ఎస్ వాళ్ల జాతకాలు మా దగ్గరున్నాయి
నేను నోరు విప్పితే వాళ్లు తట్టుకోలేరు
మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తీసుకొచ్చిందని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. వక్ఫ్ బోర్డు కమిటీల్లో ఇద్దరు ముస్లిమేతరులను నియమించాలన్న నిబంధన రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. 24 సభ్యులతో ఏర్పడిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన పాలక మండలిలో హిందూయేతరులు లేరని, మరి వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు ఎందుకు ఉండాలని ఆయన ప్రశ్నించారు. శనివారం దారుల్ సలాంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అసదుద్దీన్ విలేకరులతో మాట్లాడారు. తిరుమల ఆలయంలో పనిచేసే సిబ్బంది అందరూ హిందువులే ఉండాలని కోరుకుంటున్నట్టు టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారని గుర్తుచేశారు.
హిందూయేతరులు ఉన్న పక్షంలో వారిని ఇతర శాఖల్లోకి పంపించాలా లేదా వీఆర్‌ఎస్ ఇవ్వాలా అనే అంశంపై ప్రభుత్వంతో సంప్రదిస్తానని ఆయన చేసిన ప్రకటనను ఒవైసీ ప్రస్తావించారు. టీటీడీలో హిందువులే ఉండాలనే అంశాన్ని తాను తప్పుపట్టడం లేదన్నారు. అయితే దేశవ్యాప్తంగా హిందూ ఎండోమెంట్ బోర్డుల్లో ఒక్క ముస్లిం సభ్యుడు కూడా లేనప్పుడు కేంద్ర, రాష్ట్ర వక్ఫ్ బోర్డు కమిటీల్లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించాల్సిన అవసరం ఎందుకు ఉందని ఒవైసీ ప్రశ్నించారు. ‘మీరు మీ మతంపై దృష్టి సారిస్తే దానితో మాకు ఇబ్బంది లేదు. అయితే మా మతంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నార’న్నారు. కాగా, బీఆర్‌ఎస్ వాళ్ల జాతకాలు తమ దగ్గరున్నాయని, తాను నోరు విప్పితే వాళ్లు తట్టుకోలేరని అసదుద్దీన్ అన్నారు.
అప్పట్లో బీఆర్‌ఎస్ చేసిన మూసీ ప్రక్షాళన ప్రతిపాదనలను తాను వ్యతిరేకించానని చెప్పారు. పేదల ఇళ్లకు ఎలాంటి విఘాతం కలగకుండా పనులు సాగాలని సూచించానన్నారు. బీఆర్‌ఎస్ మొదలుపెట్టిన మూసీ ప్రక్షాళనను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుండగా బీఆర్‌ఎస్ అడ్డుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ విధానాలు స్థిరంగా ఉండాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మజ్లిస్ మద్దతుతోనే బీఆర్‌ఎస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 24 మంది అభ్యర్థులను మార్చి ఉంటే బీఆర్‌ఎస్ మళ్లీ గెలిచేదన్నారు. కాని అప్పట్లో బీఆర్‌ఎస్ నేతలకు చాలా అహంకారం ఉండేదని, అందువల్లే ఆ పార్టీ ఓటమి పాలైందన్నారు. తాము కాంగ్రె్‌సకు అనుకూలమనే వ్యాఖ్యలను ఖండించారు. తమ పార్టీ కాంగ్రె్‌సకు మద్దతివ్వడం లేదని స్పష్టం చేశారు.
Updated Date - Nov 03 , 2024 | 03:23 AM