Share News

రోహిత్‌ వేముల కేసులో నిందితులకు క్లీన్‌చిట్‌

ABN , Publish Date - May 04 , 2024 | 05:39 AM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పీహెచ్‌డీ స్కాలర్‌ రోహిత్‌ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని.. పోలీసులు హైకోర్టుకు మార్చి 21న ఇచ్చిన ఈ కేసు క్లోజర్‌ రిపోర్టులో పేర్కొన్నారు. తన కులధ్రువీకరణ పత్రం సరైనది కాదనే

రోహిత్‌ వేముల కేసులో నిందితులకు క్లీన్‌చిట్‌

రోహిత్‌ దళితుడు కాదని పోలీసుల నివేదిక.. అతని ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు

తన కులధ్రువీకరణ పత్రం సరైనది కాదని తెలుస్తుందని ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు

హైకోర్టుకిచ్చిన క్లోజర్‌ రిపోర్టులో వెల్లడి

హెచ్‌సీయూ వీసీ అప్పారావు, ఎన్‌.రామచంద్రరావు, ఏబీవీపీ నేతల పిటిషన్లపై ముగిసిన విచారణ

హైదరాబాద్‌, రాయదుర్గం, మే 3 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పీహెచ్‌డీ స్కాలర్‌ రోహిత్‌ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని.. పోలీసులు హైకోర్టుకు మార్చి 21న ఇచ్చిన ఈ కేసు క్లోజర్‌ రిపోర్టులో పేర్కొన్నారు. తన కులధ్రువీకరణ పత్రం సరైనది కాదనే విషయం బయటకు తెలిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే భావనతోనే అతడు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. రోహిత్‌ ఎస్సీ కాదని.. అతడు, అతడి కుటుంబసభ్యులు బీసీ-ఏ (వడ్డెర) కులానికి చెందినవారని.. వారు అక్రమ మార్గంలో ఎస్సీ సర్టిఫికెట్లు పొందారని.. జిల్లా స్థాయి స్ర్కూటినీ కమిటీ తేల్చినట్లు అందులో వెల్లడించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ, ఏబీవీపీ నేతలకు, హెచ్‌సీయూ నాటి వీసీ అప్పారావుకు అతడి ఆత్మహత్యతో సంబంధం లేదని క్లీన్‌చిట్‌ ఇచ్చారు. దీంతో.. ఈ కేసులో తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ కొట్టేయాలని అభ్యర్థిస్తూ అప్పారావు, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు, పలువురు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) నాయకులు దాఖలుచేసిన పిటిషన్లను హైకోర్టు శుక్రవారం డిస్పోజ్‌ చేసింది. హెచ్‌సీయూలో 2015లో.. ఏబీవీపీ (ఏబీవీపీ), అంబేడ్కర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (ఏఎ్‌సఏ) విద్యార్థుల మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో.. ఆ వర్సిటీ కుల రాజకీయాలకు, జాతివ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా మారిందంటూ నాటి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. ఆ ఏడాది నవంబరులో వర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సిఫారసుతో.. ఐదుగురు విద్యార్థులపై వీసీ అప్పారావు బహిష్కరణ వేటు వేశారు. దరిమిలా 2016 జనవరి 17న రోహిత్‌ వేముల.. న్యూరిసెర్చ్‌ స్కాలర్‌ హాస్టల్‌ రూమ్‌లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మరణించాడు. దీంతో.. వీసీ అప్పారావు, బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఏబీవీపీ నాయకుల వేధింపుల వల్లే రోహిత్‌ వేముల ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. వారి ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు వీసీ అప్పారావు, ఎన్‌ రామచంద్రరావు, ఏబీవీపీ నాయకులు, తదితరులపై ఐపీసీ 306, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ నిరోధకచట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, రోహిత్‌ ఆత్మహత్య వ్యవహారంతో తమకు ఏ సంబంధమూ లేదని.. ఈ కేసులు కొట్టేయాలని విజ్ఞప్తి చేస్తూ వారంతా హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లపై జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పోలీసుల క్లోజర్‌ రిపోర్టు ప్రకారం.. రోహిత్‌ ఆత్మహత్యతో వారికి సంబంధం లేదని పేర్కొంటూ విచారణను ముగిస్తున్నట్లు వెల్లడించింది. పోలీసుల నిర్ణయంతో ఏకీభవించనివారు ట్రయల్‌ కోర్టులో సవాల్‌ చేయవచ్చని న్యాయమూర్తి పేర్కొన్నారు.


మండిపడ్డ విద్యార్థులు..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రోహిత్‌ వేముల మరణంపై తెలంగాణ పోలీసుల నివేదికను నిరసిస్తూ హెచ్‌సీయూ క్యాంప్‌సలో పలు విద్యార్థి సంఘాలు శుక్రవారం సాయంత్రం నిరసన తెలిపాయి. వర్సిటీలోని ఏఐవోబీసీఏ, ఏఐఎ్‌సఏ, ఏఎ్‌సఏ, బీఎ్‌సఎఫ్‌, డీఎ్‌సయూ, ఫ్రెటర్నిటీ, ఎంఎసెఫ్‌, టీఎ్‌సఎఫ్‌, హెచ్‌సీయూ స్టూడెంట్స్‌ యూనియన్‌ విద్యార్థులంతా కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. రోహిత్‌ చనిపోయిన ఎనిమిదేళ్ల తర్వాత.. తెలంగాణ పోలీసులు నివేదికను ఏబీవీపీ, బీజేపీకి అనుకూలంగా ఇవ్వడం అన్యాయమని, ఆ నివేదిక తప్పులతడక అని ధ్వజమెత్తారు. రోహిత్‌ వేములది ప్రభుత్వం చేసిన హత్యే అని విమర్శించారు. అతడి ఆత్మహత్యకు అప్పటి హెచ్‌సీయూ వీసీ అప్పారావు, బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ వేధింపులే కారణమని కేసులు నమోదు చేసినా.. పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేయలేదని విద్యార్థి నాయకులు మండిపడ్డారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు రోహిత్‌ కులం గురించి విచారణ చేశారేతప్ప.. వర్సిటీలో జరుగుతున్న కుల వివక్ష గురించి పట్టించుకోలేదని దుయ్యబట్టారు. హెచ్‌సీయూ చరిత్రలో మొదటిసారిగా వర్సిటీలోని దళిత విద్యార్థులను వెలివేశారని, నాటి వీసీ పొదిలి అప్పారావు వారికి వంతపాడుతూ 10 మంది దళిత విద్యార్థులను సస్పెండ్‌ చేశారని ఆరోపించారు. అప్పారావు 2001 నుంచి దళిత విద్యార్థులు, దళిత ప్రొఫెసర్లపై వివక్ష చూపేవారని, ఈ అవమానం భరించలేక రోహిత్‌ ఆత్మహత్య చేసుకున్నాడని వారు తెలిపారు. పోలీసులు రోహిత్‌ దళితుడా కాదా అన్న అంశంపైనే దృష్టిపెట్టారని.. ఆధారాలు లేకుండా రోహిత్‌ దళితుడు కాదని చెబుతూ ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ను తొలగించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. రోహిత్‌ వేముల కేసు దర్యాప్తులో పోలీసులు రూపొందించిన 60 పేజీల రిపోర్టులో 40 పేజీలు అతడు దళితుడు కాదని నిరూపించేందుకే కేటాయించారని.. ఏబీవీపీ, బీజేపీ ప్రచారం చేసిన విధంగానే అతడు దళితుడు కాదని రిపోర్టు ఇచ్చారని దుయ్యబట్టారు. ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థికి న్యాయం చేయకపోవడం పోవడం సిగ్గుచేటన్నారు. రోహిత్‌ వేములకు న్యాయం జరిగేదాకా సంఘటిత పోరాటం చేస్తామని తెలిపారు. అలాగే.. రోహిత్‌ ఆత్మహత్య కేసును మూసివేస్తున్నట్లుగా పోలీసులు కోర్టుకు తెలపడం ఆశ్చర్యకరమని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ అన్నారు. ఆ కేసు పునర్విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. రోహిత్‌ వేముల మరణంపై గతంలో స్పందించిన కాంగ్రెస్‌ యువరాజు రాహుల్‌ గాంధీ.. అతడే తన కథానాయకుడని ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘జస్టిస్‌ ఫర్‌ వేముల’ ఉద్యమానికి కాంగ్రెస్‌ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆయన వెల్లడించారు. 2022లో తెలంగాణలో నిర్వహించిన భారత్‌ జోడో యాత్రలో రోహిత్‌ తల్లి రాధికతో కలిసి నడిచారు. తాము అధికారంలోకి వస్తే.. దళితులు, ఓబీసీలు, మైనారిటీలపై అకృత్యాలను నిరోధించి, వారి విద్యాహక్కును కాపాడేలా ‘రోహిత్‌ వేముల చట్టం’ అమలుచేస్తామని ప్రకటించారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఆ వ్యాఖ్యలను విద్యార్థి సంఘాలు గుర్తుచేస్తున్నాయి. కాగా.. రోహిత్‌ మృతి కేసుపై పునర్విచారణ జరపనున్నట్టు డీజీపీ రవి గుప్తా తెలిపారు. ఈ కేసు తుది నివేదికను.. 2023 నవంబరు ముందు నిర్వహించిన దర్యాప్తు ఆధారంగా రూపొందించి, మార్చి 21న కోర్టుకు సమర్పించినట్టు ఆయన వెల్లడించారు. అయితే.. దీనిపై రోహిత్‌ వేముల తల్లితోపాటు, మరికొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తదుపరి దర్యాప్తునకు అనుమతి కోరుతూ త్వరలో కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తామని ఆయన వెల్లడించారు.

Updated Date - May 04 , 2024 | 05:39 AM