Farmers Protest: ప్రాణాలు పోయినా భూములివ్వం
ABN , Publish Date - Mar 18 , 2025 | 05:29 AM
తమ ప్రాణాలు పోయినా పారిశ్రామిక పార్కు కోసం భూములు ఇచ్చేది లేదని రంగారెడ్డి జిల్లా యాచా రం మండలంలోని మొండిగౌరెల్లి రైతులు స్పష్టం చేశారు. తమ భూముల జోలికి వస్తే లగచర్ల ఘటనకంటే దారుణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

తక్షణమే నోటిఫికేషన్ రద్దు చేయండి
మొండిగౌరెల్లి రైతుల డిమాండ్
యాచారం, మార్చి 17 (ఆంధ్రజ్యోతి) : తమ ప్రాణాలు పోయినా పారిశ్రామిక పార్కు కోసం భూములు ఇచ్చేది లేదని రంగారెడ్డి జిల్లా యాచా రం మండలంలోని మొండిగౌరెల్లి రైతులు స్పష్టం చేశారు. తమ భూముల జోలికి వస్తే లగచర్ల ఘటనకంటే దారుణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మొండిగౌరెల్లికి చెందిన 821 ఎకరాల 11 పట్టా అసైన్డ్ భూములను పారిశ్రామిక పార్కు కోసం తీసుకుంటున్నట్లు నోటిఫికేషన్ రావడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం రైతులంతా పంచాయతీ కార్యాలయం వద్ద సమావేశమయ్యారు.
భూపోరాటం ముమ్మరం చేయడానికి వివిధ పార్టీలకు చెందిన 37 మందితో కూడిన జేఏసీ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం జేఏసీ నాయకులు తాండ్ర రవీందర్, మల్లారెడ్డి మాట్లాడుతూ.. పారిశ్రామిక పార్కు కోసం భూసేకరణ చేయాలనే నిర్ణయం వెంటనే విరమించుకోవాలన్నారు. భూసేకరణకు కలెక్టర్ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా ఎలా నోటిఫికేషన్ జారీ చేశారని ప్రశ్నించారు.