Phone Tapping Case: మూడు బాక్సుల్లో ఆధారాలు!
ABN, Publish Date - Jun 26 , 2024 | 03:52 AM
సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అధికారులు మంగళవారం కోర్టుకు కీలక ఆధారాలను సమర్పించారు. మొత్తం మూడు బాక్సుల్లో ఆధారాలను అందజేస్తూ..
ట్యాపింగ్ కేసులో సీడీలు, పెన్‌డ్రైవ్‌ల సమర్పణ
మరోసారి చార్జిషీట్.. వివరాల గోప్యతకు మెమో
భుజంగరావు, తిరుపతన్న
బెయిల్ పిటిషన్లపై విచారణ నేటికి వాయిదా
బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన ప్రణీత్‌రావు
ప్రభాకర్‌రావు కోరిన సమయం నేటితో పూర్తి!
హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అధికారులు మంగళవారం కోర్టుకు కీలక ఆధారాలను సమర్పించారు. మొత్తం మూడు బాక్సుల్లో ఆధారాలను అందజేస్తూ.. మరోమారు చార్జిషీట్ దాఖలు చేశారు. దర్యాప్తు అధికారి, ఏసీపీ వెంకటగిరి కోర్టుకు సమర్పించిన ఆధారాల్లో సీడీలు, పెన్‌డ్రైవ్‌లు, ధ్వంసం చేసిన హార్డ్‌డి్‌స్కల శకలాలు, ఇతర సాంకేతిక ఆధారాలు ఉన్నాయి. గత వారం పోలీసులు సమర్పించిన చార్జిషీట్‌ను కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే..! దీంతో అధికారులు న్యాయనిపుణుల సలహాతో పకడ్బందీగా అభియోగ పత్రాలను రూపొందించి, కోర్టుకు అందజేశారు. అత్యంత సున్నితమైన కేసు కావడంతో.. చార్జిషీట్‌తోపాటు.. తాము అందజేసిన ఆధారాల వివరాలను బహిర్గతం కాకుండా చూడాలంటూ కోర్టులో మెమో దాఖలు చేశారు. నిందితులెవరికీ ఈ ఆధారాలను అందజేయకూడదని ఆ మెమోలో కోరారు. కాగా.. చంచల్‌గూడ జైలులో విచారణ ఖైదీలుగా ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై కోర్టు తదిపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. 90 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ముగిసినా.. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయలేదన్న కారణంతో మ్యాండేటరీ బెయిల్ ఇవ్వాలని వారిద్దరూ కోర్టును కోరారు.
ఈ వ్యాజ్యంపై విచారణ బుధవారానికి వాయిదాపడింది. మరోవైపు మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కూడా మరోమారు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా. ఈ కేసులో ఏ1గా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు భారత్‌కు తిరిగి వస్తారా? అని దర్యాప్తు అధికారులు ఎదురుచూస్తున్నారు. ఈ కేసు తొలినాళ్లలోనే ప్రభాకర్‌రావు తాను జూన్ 26కల్లా భారత్ తిరిగి వస్తానంటూ తన న్యాయవాది ద్వారా కోర్టుకు వెల్లడించారు. అప్పట్లో కోర్టుకు సమర్పించిన మెమోలో తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు.. ఆరోగ్యం సహకరిస్తే జూన్ 26 నాటికి భారత్‌కు వస్తానని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావు అరెస్టవ్వగా.. పోలీసు కస్టడీలో వారంతా ముక్తకంఠంతో ‘‘ప్రభాకర్‌రావు చెప్పినట్లు చేశాం’’ అని వాంగ్మూలమిచ్చారు. ఎన్నికల సమయంలో డబ్బు తరలింపు వ్యవహారాల విషయంలోనూ ఆదేశాలిచ్చింది ప్రభాకర్‌రావేనని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు ప్రభాకర్‌రావును విచారిస్తే గానీ, ఈ కేసు వెనక ఉన్న సూత్రధారులు, గత ప్రభుత్వ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే పరిస్థితులు లేవని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే 10 మంది వరకు రాజకీయ నాయకుల పేర్లు బయటకు వచ్చినా.. పోలీసులు వారిని ఇంకా విచారించాల్సి ఉంది.
Updated Date - Jun 26 , 2024 | 03:52 AM