PM Modi: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఇవాళ, రేపు ఆ ప్రాంతాలలో...
ABN, Publish Date - Mar 15 , 2024 | 10:33 AM
నగరంలో ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు భారీస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మల్కాజిగిరి(Malkajigiri) పార్లమెంట్ పరిధిలో శుక్రవారం రోడ్‌షో నిర్వహించనున్న నేపథ్యంలో రోడ్డుకు ఇరువైపులా ఇనుప బారీకేడ్ల(గడ్డర్లు)ను ఏర్పాటు చేస్తున్నారు.
హైదరాబాద్ సిటీ: నగరంలో ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు భారీస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మల్కాజిగిరి(Malkajigiri) పార్లమెంట్ పరిధిలో శుక్రవారం రోడ్‌షో నిర్వహించనున్న నేపథ్యంలో రోడ్డుకు ఇరువైపులా ఇనుప బారీకేడ్ల(గడ్డర్లు)ను ఏర్పాటు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌తో పాటు, నో ఫ్లయింగ్ జోన్‌గా పోలీసులు ప్రకటించారు. డ్రోన్ కెమెరాలను నిషేధించారు. కాగా, మోదీ రోడ్‌షోకు నగరానికి చెందిన 60 డివిజన్ల నుంచి సుమారు రెండు లక్షల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.
ఈ ప్రాంతాల్లో ఆంక్షలు
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా శుక్ర, శనివారాల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని హైదరాబాద్, రాచకొండ కమిషనర్లు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ శుక్రవారం సాయంత్రం బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో దిగి, అక్కడి నుంచి మల్కాజిగిరిలో నిర్వహించే రోడ్‌షోలో పాల్గొంటారు. మీర్జాలగూడ నుంచి మల్కాజిగిరి చౌరస్తా వరకు 1.5 కిలోమీటర్ల మేర రోడ్ షో సాగనుంది. అనంతరం రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. శనివారం ఉదయం ప్రధాని రాజ్‌భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి వెళ్తారు.
- రోడ్‌షో జరిగే ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి షో ముగిసే వరకూ వాహనాలను అనుమతించరు.
- మెట్టుగూడ నుంచి మల్కాజిగిరి వైపు వచ్చే వాహనాలను శాంతినగర్ టి.జంక్షన్ నుంచి లాలాపేట, మౌలాలి వైపు పంపుతారు.
- నేరేడ్‌మెట్, సఫిల్‌గూడ నుంచి మల్కాజిగిరి వైపు వచ్చే వాహనాలను ఆనంద్‌బాగ్ క్రాస్ రోడ్స్ నుంచి ఉత్తమ్‌నగర్, ఓఓసీ, సికింద్రాబాద్ వైపు మళ్లిస్తారు.
- జడ్‌టీసీ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను మౌలాలి, ఈసీఐఎల్, నేరేడ్‌మెట్ వైపు పంపుతారు.
- బేగంపేట విమానాశ్రయం నుంచి పీఎన్‌టీ జంక్షన్, సీటీఓ, సంగీత్, మెట్టుగూడ, మల్కాజిగిరి, లాలాపేట, తార్నాక, గ్రీన్‌ల్యాండ్స్, మోనప్ప జంక్షన్, రాజ్‌భవన్, వీవీస్టాచ్యూ పరిసరాల్లో సందర్భాన్ని బట్టి వాహనాల రాకపోకలపై నిషేధం ఉంటుంది.
Updated Date - Mar 15 , 2024 | 12:01 PM