Lagacherla: సురేశ్ కోసం ముమ్మర వేట..
ABN, Publish Date - Nov 16 , 2024 | 04:57 AM
లగచర్లలో అధికారులపై దాడికి రైతులు, ప్రజలను ఉసిగొల్పడంలో కీలకప్రాత పోషించిన సురేశ్ రాజ్ ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
లగచర్ల దాడిలో కీలక పాత్ర అతడిదే..
దొరికితే కేసు కొలిక్కి వచ్చే అవకాశం
కాస్త ఆలస్యమైనా.. పక్కా ఆధారాలతో ముందుకెళ్లేలా పోలీసుల వ్యూహం..
పట్నం నరేందర్‌రెడ్డిని కస్టడీ కోరే చాన్స్
పోలీసుల భద్రతా వైఫల్యంపై చర్యలకు రంగం సిద్ధం?
వికారాబాద్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): లగచర్లలో అధికారులపై దాడికి రైతులు, ప్రజలను ఉసిగొల్పడంలో కీలకప్రాత పోషించిన సురేశ్ రాజ్ ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అధికారులపై దాడి అనంతరం అదృశ్యమైన సురేశ్, దేవదాస్, విజయ్, విఠల్, గోపాల్ నాయక్‌ల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు 4 ప్రత్యేక బృందాలతో వెతుకుతున్న సంగతి తెలిసిందే. సురేశ్ రాజ్ ఆచూకీ లభిస్తే కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. అధికారులపై జరిగిన దాడిని రాజకీయ కుట్ర కోణంగానే నిర్ధారించుకున్న పోలీసులు ఆ దిశగానే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. న్యాయస్థానంలో కేసు నిలబడేలా శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. సరైన ఆధారాలు లేకుండా దూకుడుగా వెళ్లి భంగపడకుండా.. కొంత ఆలస్యమైనా.. పక్కా ఆధారాలతోనే ముందుకు వెళ్లే విధంగా అదనపు డైరెక్టర్ జనరల్ మహేశ్ భగవత్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.
నరేందర్‌రెడ్డిని కస్టడీ కోరే చాన్స్
కేసులో మాజీ ఎమ్మెల్యే ఏ-1గా పట్నం నరేందర్‌రెడ్డిని నమోదు చేసిన పోలీసులు.. కుట్రలో కీలక నేతలు ఎవరెవరున్నారనే విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. నరేందర్‌రెడ్డి సెల్‌ఫోన్‌ను విశ్లేషిస్తే ముఖ్య సమాచార ం వెలుగులోకి వస్తుందని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నరేందర్‌రెడ్డికి, దాడిలో కీలక పాత్ర పోషించిన వారికి, ఇతర కీలక నేతలకు మధ్య కొనసాగిన వాట్సాప్ కాల్స్, చాటింగ్‌ల సమాచారాన్ని విశ్లేషించే పనిలో పోలీసు యంత్రాంగం నిమగ్నమైందని తెలుస్తోంది. అలాగే నరేందర్‌రెడ్డిని పోలీసులు తమ కస్టడీకి కోరే అవకాశమున్నట్లు సమాచారం. కాగా, లగచర్ల ఘటనలో అధికారులపై దాడి చేశారని అభియోగాలు ఎదుర్కొంటున్న నలుగురు స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. శనివారం వీరిని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముంది.
పోలీసులపై శాఖాపరమైన చర్యలు?
లగచర్ల దాడి ఘటనపై నివేదిక తెప్పించుకున్న పోలీసు ఉన్నతాధికారులు.. కలెక్టర్, అధికారులపై దాడులను అడ్డుకోవడంలో పోలీసు, నిఘా విభాగం అధికారులు విఫలమయ్యారనే నిర్ధారణకు వచ్చారు. అధికారులకు భద్రత కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఎస్సై నుంచి ఉన్నత స్థాయి అధికారులపై చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశమున్నట్లు సమాచారం.
Updated Date - Nov 16 , 2024 | 04:57 AM