Ponguleti : రాబోయే 24 గంటలూ జాగ్రత్త!
ABN, Publish Date - Sep 02 , 2024 | 04:12 AM
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.
ముందస్తు చర్యల వల్లే భారీ నష్టం తప్పింది.. అయినా 9 మంది చనిపోవడం దురదృష్టకరం
కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్/కూసుమంచి, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ఆయన ఆదివారం ప్రభుత్వ ప్రఽధాన కార్యదర్శి, డీజీపీతో పాటు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అనంతరం తన కార్యాలయం లో పొంగులేటి విలేకరులతో మాట్లాడారు.
‘‘రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో ముందస్తుగా చేపట్టిన చర్యల వల్ల చాలా వరకు ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా కాపాడగలిగాం. అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో 9 మంది చనిపోయారు. ఇది చాలా దురదృష్టకరం. గోదావరి, కృష్ణా నదులతో పాటు పలు వాగుల ద్వారా వచ్చే వరదను ఎప్పటికప్పుడు అంచనా వేసి పకడ్బందీగా నీటిని వదలడం వల్ల చెరువులు, కుంటలకు పెద్దగా నష్టం వాటిల్లలేదు. ప్రధానంగా మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వరదలు, వర్షాల ప్రభావం అధికంగా ఉండి నీటిలో చిక్కుకున్న పలువురిని సురక్షితంగా కాపాడగలిగాం.
పరిస్థితుల తీవ్రత దృష్ట్యా అన్ని స్థాయుల అధికారులు, సిబ్బందికి సెలవులను రద్దు చేయాలని సీఎ్‌సను ఆదేశించాం. స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని కలెక్టర్లకు సూచించాం. జీహెచ్‌ఎంసీ పరిధిలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలకు అవకాశం ఉండడంతో అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని ఆదేశించాం. సోమవారం సాయంత్రం వరకు ప్రజలు బయటికి రాకుండా చర్య లు తీసుకోవాలని అధికారులకు సూచించాం. మహబూబాబాద్, డోర్నకల్ మధ్య రైల్వే లైనుపై వర్షపు నీరు చేరుకోవడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులకు భోజన వసతి కల్పించి, బస్సులు ఏర్పాటు చేసి వారిని అక్కడి నుంచి తరలించాం’’ అని మంత్రి చెప్పారు.
పాలేరు ఘటనపై మంత్రి భావోద్వేగం
తన నియోజకవర్గం పాలేరులోని నాయకన్ గూడేనికి చెందిన యాకూబ్, ఆయన భార్య సైదా వరదలో కొట్టుకుపోవడంపై మంత్రి పొంగులేటి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. విలేకరుల సమావేశం జరుగుతున్న సమయంలోనే యాకూబ్ కుటుంబం కొట్టుకుపోయిందని సమాచారం అందడంతో కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘నేను ఉదయం నుంచి ఆ కుటుంబాన్ని కాపాడేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. హెలికాప్టర్లను పంపేందుకు ఫోన్‌లు చేస్తూనే ఉన్నా. భారీ వర్షాలకు హెలికాప్టర్లు టేకాఫ్ కావడం కష్టమన్నారు. మరోవైపు యాకూబ్, సైదాకు ధైర్యం చెబుతూనే ఉన్నా. స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలను సిద్ధం చేసి, ఒక డ్రోన్ ద్వారా వారికి లైఫ్ జాకెట్లను అందించాం. ఇంతలోనే వరద పోటెత్తడంతో వారు న్న ఇంటిగోడ కూలి నీటిలో కొట్టుకుపోయారు. వారి కొడుకు షరీ్‌ఫను రక్షించగలిగాం’’అని మంత్రి తెలిపారు. అనంతరం ఆయన ఖమ్మం వెళ్తూ నా యకన్‌గూడెంలో ఆగి.. యాకూబ్ సోదరుడు లాల్‌సాహెబ్, ఇతర కుటుంబసభ్యులను ఓదార్చారు.
Updated Date - Sep 02 , 2024 | 04:12 AM