Ponnam Prabhakar: ఎవరెంతో వారికంత
ABN, Publish Date - Dec 08 , 2024 | 04:27 AM
ప్రభుత్వం చేపట్టిన కులగణన ఆధారంగా ఎవరెంతో వారికంత అనే విధంగా ప్రభుత్వ పథకాలు రూపొందించి అమలు చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
కులగణన ఆధారంగా పథకాల రూపకల్పన.. మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీకి పెరిగిన ఆదరణ
త్వరలో మరిన్ని కొత్త బస్సుల కొనుగోలు
హైదరాబాద్‌లో పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ ఆటోలు తేవాలని యోచిస్తున్నాం
త్వరలో గురుకుల విద్యార్థులకు కొత్త మెనూ.. చిరుధాన్యాలతో చేసిన చిరుతిళ్లు అందిస్తాం
‘ఆంధ్రజ్యోతి’తో మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చేపట్టిన కులగణన ఆధారంగా ఎవరెంతో వారికంత అనే విధంగా ప్రభుత్వ పథకాలు రూపొందించి అమలు చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో వారిలో సాధికారత పెరిగిందని చెప్పారు. మరిన్ని బస్సులు కొనుగోలు చేస్తున్నామన్నారు. గురుకుల విద్యార్థులకు నాణ్యమైన, బలవర్ధకమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. ఏదో ఒకటి వడ్డించడం కాకుండా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి అవసరమైన ఆహారం అందిస్తామని చెప్పారు. కేవలం బీసీ గురుకుల విద్యార్థులకే కాకుండా అన్ని గురుకులాల్లో ఒకే రకమైన డైట్ మెనూ అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రిగా తాను చేపట్టిన, రాబోయే నాలుగేళ్లల్లో చేపట్టే కార్యక్రమాల గురించి పొన్నం ప్రభాకర్ ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో వివరించారు.
ఏడాది పాలనలో మీకు అత్యంత సంతృప్తినిచ్చిన అంశం?
తెలంగాణ అక్కా, చెల్లెళ్లకు ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం అత్యంత సంతృప్తినిచ్చింది. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఆర్టీసీని మళ్లీ బతికించాం.
ఆర్టీసీ బస్సులు సరిపడా లేవని విమర్శలు వస్తున్నాయి?
ప్రయాణికుల సంఖ్య ఒకేసారి 48 లక్షల నుంచి 60 లక్షలకు పెరిగింది. అందులో రోజూ 36 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు. రద్దీని తట్టుకునేందుకు 1340 కొత్త బస్సులు తీసుకున్నాం.
ఆర్టీసీ విలీన ప్రక్రియ ఎంత వరకు వచ్చింది?
ఆర్టీసీ విలీనం, కార్మికుల సంఘాలు అనే రెండు అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. సరైన సమయంలో ప్రభుత్వం స్పందిస్తుంది.
విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు స్కాలర్‌షిప్ బకాయిలు ఉన్నాయి కదా?
బకాయిలు త్వరలో చెల్లిస్తాం. ఇంతకుముందు 300 మంది విద్యార్థులను మాత్రమే ఎంపిక చేసి పంపేవారు. ఆ సంఖ్యను 800కు పెంచాలని ప్రతిపాదనలు అందాయి. రెండు, మూడు రోజుల్లో అనుమతులు వస్తాయి.
హామీలు ఆకాశమంత.. నెరవేర్చింది కొంతేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి?
మమ్మల్ని అడిగేముందు బీజేపీ, బీఆర్‌ఎస్ ఎన్ని హామీలు నెరవేర్చాయో చూసుకోవాలి. బీజేపీ హయాంలో వైఫల్యాల గురించి ఏఐ (కృత్రిమ మేధ)తో ఆరా తీస్తే 20 అంశాలు వరుసపెట్టి వచ్చాయి. బీఆర్‌ఎస్ వైఫల్యాలూ అదే స్థాయిలో ఉన్నాయి. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా రూ.2 లక్షల్లోపు రైతు రుణాలను మాఫీ చేశాం.
కులగణనలో బీసీల సంఖ్య ఎక్కువగా ఉందని తేలితే వారికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంచుతారా?
తప్పకుండా. ప్రభుత్వానికి సంకల్పం ఉంది. చిక్కులు వస్తే కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకునే ప్రయత్నం చేస్తాం. కుల సర్వే ఆధారంగా ఎవరెంతో వారికంత అనే విధంగా పథకాలు రూపొందిస్తాం.
గురుకుల విద్యార్థులకు శుచిగా, శుభ్రంగా, నాణ్యమైన ఆహారం అందించాలనే అంశంపై ఏమంటారు ?
చర్యలు చేపట్టాం. ఇప్పటివరకు తోచింది, మార్కెట్‌లో దొరికింది విద్యార్థులకు ఆహారంగా అందించారు. కానీ ఇకపై అలా కాదు. నాణ్యమైన, బలమైన ఆహారం అందిస్తాం. సాయంత్రం చిరుతిళ్లుగా చిరుధాన్యాలతో రూపొందించినవి అందిస్తాం. అన్ని గురుకులాల్లో ఒకే రకమైన ఆహారం అందిస్తాం. ప్రస్తుత ధరలకు తగ్గట్లుగా సరఫరాదారులకు రేట్లు పెంచి ఇస్తాం.
కాలుష్యరహిత హైదరాబాద్ కోసం తీసుకుంటున్న చర్యలు?
హైదరాబాద్‌లో రెండేళ్లలో పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ ఆటోలు తేవాలని అనుకుంటున్నాం. ఆటో డ్రైవర్లకు ఈవీ వాహనాల కొనుగోలు ఆర్థిక భారం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఆర్టీసీ బస్సులను సైతం మారుస్తాం.
Updated Date - Dec 08 , 2024 | 04:27 AM