Ponnam Prabhakar: సలహాలు, సూచనలు ఇవ్వండి
ABN, Publish Date - Nov 29 , 2024 | 03:39 AM
ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలే కానీ విద్యార్థులు, గురుకులాలతో రాజకీయం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపక్షాలకు హితవు పలికారు. సిద్దిపేటలోని మహత్మా జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాలను గురువారం కలెక్టర్‌తో కలిసి మంత్రి తనిఖీ చేశారు.
విద్యార్థులతో రాజకీయాలు వద్దు: పొన్నం
సిద్దిపేట మహాత్మా జ్యోతిరావుపూలే గురుకులాన్ని తనిఖీ చేసిన మంత్రి
సిద్దిపేట కల్చరల్, హైదరాబాద్, మాగనూరు, కొండాపూర్, నవంబరు 28 (ఆంరఽధజ్యోతి): ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలే కానీ విద్యార్థులు, గురుకులాలతో రాజకీయం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపక్షాలకు హితవు పలికారు. సిద్దిపేటలోని మహత్మా జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాలను గురువారం కలెక్టర్‌తో కలిసి మంత్రి తనిఖీ చేశారు. వంట సిబ్బందితో మాట్లాడి విద్యార్థులకు అందించే అన్నం, కూరలను పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి లోపం తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. డీఎంహెచ్‌వో, డీఆర్డీవో, డీపీవో, స్థానిక పంచాయతీ కార్యదర్శులతో త్వరలో కమిటీలు ఏర్పాటు చేస్తామని, అవి 15 రోజులకు ఒకసారి గురుకులాలను సందర్శిస్తాయని చెప్పారు. అనంతరం మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి పొన్నం పూలమాల వేసి నివాళులర్పించారు. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను రాష్ట్రమహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద పరిశీలించారు. విద్యార్థులు అధైర్యపడకుండా మధ్యాహ్న భోజనం చేయాలని అన్నారు.
ఏజెన్సీ నిర్లక్ష్యం, ఉపాధ్యాయుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగినట్లు తెలుస్తోందని ఆమె పేర్కొన్నారు. గురుకుల పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని వడ్డించాలని విద్యాశాఖ కమిషన్ రాష్ట్ర చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకుల పాఠశాలలు పరిశీలించి, పది రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని చెప్పారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లేపల్లి ఎస్సీ బాలికల వసతిగృహం, మండల కేంద్రమైన కొండాపూర్‌లోని కస్తూర్బా బాలిక వసతిగృహాలను ఆయన గురువారం తనిఖీ చేశారు. టిఫిన్, భోజనం, టాయిలెట్ల శుభ్రత గురించి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వంటగదులను, టాయిలెట్లను పరిశీలించారు. ఆయన వెంట జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు, వార్డెన్లు ఉన్నారు. కాగా, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు గురుకులాల బాట పట్టారని, గురుకుల వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని భ్రుష్టు పట్టించినందుకా అని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రశ్నించారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గురుకులాల కార్యదర్శిగా ప్రవీణ్‌కుమార్ పనిచేసిన సమయంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
Updated Date - Nov 29 , 2024 | 03:39 AM