Mahbubnagar: పెట్టుబడిదారీ ప్రయోజనాల కోసమే జాతీయవాద నినాదం: చింతకింది కాశీం
ABN, Publish Date - Dec 15 , 2024 | 03:59 AM
పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే రాజ్యం జాతీయవాద నినాదాన్ని దేశ ప్రజలపై బలవంతంగా రుద్దుతోందని ప్రొఫెసర్ చింతకింది కాశీం విమర్శించారు.
మహబూబ్‌నగర్ న్యూటౌన్/పాలమూరు,డిసెంబరు 14(ఆంద్రజ్యోతి): పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే రాజ్యం జాతీయవాద నినాదాన్ని దేశ ప్రజలపై బలవంతంగా రుద్దుతోందని ప్రొఫెసర్ చింతకింది కాశీం విమర్శించారు. సమూహ ప్రథమ మహాసభలు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని క్రౌన్ ఫంక్షన్ హాల్‌లో కల్లూరి భాస్కర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో బహుళ అస్తిత్వాలు- సాంస్కృతిక జాతీయవాద సవాళ్లపై కాశీం ప్రసంగించారు. బుర్జువా సంస్కరణల్లో భాగంగానే జాతీయ వాదాన్ని తెరపైకి తీసుకువచ్చారన్నారు.
దేశంలో భిన్న కులాలు ఉన్నప్పుడు ఏకత ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. రాజ్యంగంపై దాడి చేసే కుట్రలో భాగంగానే ఈ జాతీయత భావం తెరపైకి వచ్చిందన్నారు. కేంద్రానికి అదానీ, అంబానీ, అమెరికా ప్రయోజనాలే తప్ప దేశ ప్రయోజనాలు పట్టవని కాశీం ఆరోపించారు. సభలో ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన కవులు, కళాకారులు, లౌకికవాదులు పాల్గొన్నారు.
Updated Date - Dec 15 , 2024 | 03:59 AM