Rain Alert: రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
ABN, Publish Date - Sep 04 , 2024 | 10:22 AM
భారీ వర్షాలతో(Rain Alert) అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో బుధవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
హైదరాబాద్: భారీ వర్షాలతో(Rain Alert) అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో బుధవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురుస్తాయని తెలిపింది.
శంకరంపేటలో అత్యధికం...
మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పది మండలాల్లో 6–10 సెంటీమీటర్ల మధ్య, 103 మండలాల్లో 1.5–6 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. సెప్టెంబరు 3 నాటికి 148 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 293 మండలాల్లో అధిక వర్షపాతం రికార్డు అయినట్లు వెల్లడించింది. 170 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, ఒక్క మండలంలో ఇప్పటికి లోటు వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. మెదక్ జిల్లా శంకరంపేటలో అత్యధికంగా 8.8 సెంటీమీటర్ల వర్షపాతం, అదే జిల్లా కుల్చారంలో 8.7, సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో 8.6, మెదక్ జిల్లా టేక్మల్‌లో 8.1, పాపన్నపేటలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు పేర్కొంది. మరోవైపు సెప్టెంబరు నెలవారీ వర్షపాత అంచనాను భారత వాతావరణ శాఖ విడుదల చేసింది.
ఈ నెలలో రాష్ట్రంలోని పశ్చిమ, తూర్పు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగా, మిగతా జిల్లాల్లో సాధారణం, అంతకంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ ఉదయం నుంచే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షం పడుతోంది. ఆఫీసు వేళలు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
For Latest News click here
Updated Date - Sep 04 , 2024 | 10:22 AM