Rangareddy: పని ఒత్తిడి కారణంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..
ABN, Publish Date - Oct 25 , 2024 | 09:41 AM
రంగారెడ్డి జిల్లా కోకాపేటలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నాగప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. నాగప్రసాద్ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.
రంగారెడ్డి: పని ఒత్తిడితో ఉద్యోగులు మృతిచెందుతున్న ఘటనలు ఇటీవల కాలంలో సంచలనంగా మారుతున్నాయి. విపరీతమైన పని ఒత్తిడి కారణంగా ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వేలు, లక్షల్లో జీతాలు ఇస్తూ కంపెనీలు ఉద్యోగులతో గొడ్డు చాకిరీ చేయిస్తున్నాయి. పని భారం తట్టుకోలేక కొంతమంది అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొంతమంది ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కంపెనీలు ఆకర్షణీయమైన జీతాలు ఆశ చూపుతూ ఉద్యోగులను గంటల కొద్దీ పని చేయించుకుంటున్నారు. వారి నుంచి ప్రొడక్టివిటీ పెంచేందుకు తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నారు. పని భారంతో జీవితంపై విసుగు చెంది బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీరిలో ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
భవనం పైనుంచి..
తాజాగా అలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కోకాపేటలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నాగప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. నాగప్రసాద్ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఇవాళ ఉదయం హాస్టల్ భవనం పైనుంచి ఒక్కసారిగా దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు, హాస్టల్ సిబ్బంది వెంటనే నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు.
పని ఒత్తిడే..
అనంతరం నాగ ప్రభాకర్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. అయితే ఆత్మహత్యకు పని ఒత్తిడే కారణమని నాగప్రభాకర్ స్నేహితులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని నెలలుగా తీవ్రమైన పని భారంతో ఇబ్బందులు పడుతున్నట్లు ప్రభాకర్ చెప్పాడని అతని ఫ్రెండ్స్ చెబుతున్నారు. తీవ్రమైన ఒత్తిడితో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలోనూ..
పుణెలో "ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా" కంపెనీలో పనిచేస్తున్న చార్టెడ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరయిల్ అనే యువతి పనిఒత్తిడి కారణంగా మృతిచెందడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అన్నా 2024 మార్చి 19న ఈవై పుణెలో చేరగా.. నాలుగు నెలల తర్వాత జులై 20న ఆమె మరణించింది. తన కుమార్తె సెబాస్టియన్ తీవ్రమైన పని భారం వల్లే చనిపోయిందని మృతురాలి తల్లి ఆరోపించారు. ఈ ఘటనపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఆ తర్వాత కూడా ఇలాంటి పలు ఘటనలు దేశవ్యాప్తంగా చోటు చేసుకున్నాయి.
Updated Date - Oct 25 , 2024 | 09:46 AM