Dharani Portal: రూ. 60వేల కోట్ల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం
ABN, Publish Date - Nov 10 , 2024 | 03:04 AM
ధరణి పోర్టల్ ఏర్పాటు చేసిన తరువాత కొంత మంది రెవెన్యూ అధికారులు, ఉన్నత స్థానంలో ఉన్నవారు చట్టవిరుద్ధంగా ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు అప్పగించారని, ఈ క్రమంలో సుమారు రూ.60 వేల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం అయ్యాయని రిటైర్డ్ రెవెన్యూ అధికారుల సంఘం ఆరోపించింది.
ధరణి వచ్చాక రెవెన్యూ అధికారుల భూ దందా
రిటైర్ట్ రెవెన్యూ అధికారుల సంఘం ఆరోపణ
దర్యాప్తు కోసం సీఎంతో పాటు కేంద్ర విజిలెన్స్‌కు లేఖ
హైదరాబాద్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్ ఏర్పాటు చేసిన తరువాత కొంత మంది రెవెన్యూ అధికారులు, ఉన్నత స్థానంలో ఉన్నవారు చట్టవిరుద్ధంగా ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు అప్పగించారని, ఈ క్రమంలో సుమారు రూ.60 వేల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం అయ్యాయని రిటైర్డ్ రెవెన్యూ అధికారుల సంఘం ఆరోపించింది. ఈ భూదందాపై దర్యాప్తు జరిపించాలని కేంద్ర విజిలెన్స్ కమిషన్, సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, హైకోర్టు చీఫ్ జస్టి్‌సతో పాటు పలు విచారణ ఏజెన్సీలకు లేఖ రాసింది. రిటైర్డ్ రెవెన్యూ అధికారుల సంఘం కోర్‌కమిటీ హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో శనివారం సమావేశమై అన్యాక్రాంతమైన భూముల గురించి చర్చించినట్లు కమిటీ చైర్మన్ లక్ష్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
రంగారెడ్డి జిల్లా గుట్టల బేగంపేటలోని సర్వే నంబరు 63లో 42ఎకరాలు, గోపనపల్లి పరిధిలో సర్వే నంబరు 124/10లో 50ఎకరాలు, సర్వే నంబరు 36,37లో 600ఎకరాలు, హఫీజ్‌పేట సర్వే నంబరు 80లో 20 ఎకరాలు, మోఖిలా దగ్గర సర్వే నంబరు 555లో బిల్లాదాఖల భూములు 150ఎకరాలు, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, కూకట్‌పల్లి మండలం యల్లమ్మబండ(షాంబిగూడ) పరిధిలో సర్వే నంబరు 57లో 92 ఎకరాలను చట్టవిరుద్ధంగా విక్రయించారని విజిలెన్స్ కమిషన్‌కు రాసిన లేఖలో రిటైర్డ్ రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. చేతులు మారిన భూములను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Updated Date - Nov 10 , 2024 | 03:04 AM