చంగ్ ఏ చంగ్‌ను క్యాన్సర్ ఆఫ్ సిటీ అనేవారట!
ABN, Publish Date - Oct 25 , 2024 | 03:30 AM
సచ్ఛమైన నీటి గలగలతో అద్భుత పర్యాటక కేంద్రంగా అలరారుతున్న దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని చంగ్ ఏ చంగ్ ఒకప్పుడు మురికి కూపంగా ఉండేదే! అయితే అది ఎంతంగా అంటే.. ఆ నదిని ‘క్యాన్సర్ ఆఫ్ సిటీ’ అని పిలిచేవారట!
సియోల్‌లోని ఆ నది పునరుజ్జీవనం తేలిగ్గా ఏం జరగలేదు
ప్రక్షాళనకు స్థానిక వ్యాపారులు, నిర్వాసితుల నుంచి వ్యతిరేకత
మ్యూజియాన్ని సందర్శించిన మంత్రులు, అధికారుల బృందం
పునరుజ్జీవానికి ముందున్న చిత్రాల పరిశీలన.. ముగిసిన 4 రోజుల పర్యటన
(సియోల్ నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ప్రతినిధి) :సచ్ఛమైన నీటి గలగలతో అద్భుత పర్యాటక కేంద్రంగా అలరారుతున్న దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని చంగ్ ఏ చంగ్ ఒకప్పుడు మురికి కూపంగా ఉండేదే! అయితే అది ఎంతంగా అంటే.. ఆ నదిని ‘క్యాన్సర్ ఆఫ్ సిటీ’ అని పిలిచేవారట! మూసీ పునరుజ్జీవం కోసం ఆదర్శంగా తీసుకుంటున్న చంగ్ ఏ చంగ్‌ను మునుసటి సహజ స్థితికి పునరుద్ధరించి.. సుందరీకరించడంఅంత తేలిగ్గా ఏం జరగలేదని ఇక్కడి అధికారులు పేర్కొన్నారు. ఈ నదిని మూడురోజుల క్రితం రాష్ట్ర మంత్రులు పొంగులేటి, పొన్నం, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రె డ్డి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, మేయర్ విజయలక్ష్మి, రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల కమిషనర్ హనుమంతరావు తదితరుల బృందం సందర్శించింది.
గురువారం ఈ బృందం నదిపై ఏర్పాటు చేసిన ప్రత్యేక మ్యూజియాన్ని సందర్శించింది. చంగ్ ఏ చంగ్ నది అంతకుముందు ఎలా ఉండేది? పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా తీసుకున్న చర్యలేమిటి? ఆ క్రమంలో ఎదుర్కొన్న సమస్యలు-నేడు చూస్తున్న ఫలితాలు తదితర అంశాలను బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా చంగ్ ఏ చంగ్ నదికి సంబంధించిన వివరాలను అక్కడి అధికారులు వివరించారు. మురికి కూపంగా ఉన్న చంగ్ ఏ చంగ్ ప్రక్షాళనకు నడుం కట్టినప్పుడు భిన్న వాదనలు వినిపించాయని పేర్కొన్నారు. ప్రజల్లో ఎక్కువమంది నది పునరుజ్జీవనం చేయాల్సిందేనని చెప్పారని, స్థానిక వ్యాపారులు, నిర్వాసితుల నుంచి మాత్రం కొంత నిరసన వచ్చిందని పేర్కొన్నారు. అయినప్పటికీ అన్నీ పరిష్కరించి ఈ నదిని పునరుజ్జీవింపచేశామన్నారు. సుమారు 11 కి.మీ పొడవున్న ఈ నది...20మీటర్ల నుంచి 113మీటర్ల వరకు వెడల్పు ఉందని వివరించారు. పునరుజ్జీవనానికి ముందున్న పరిస్థితులు, ఆనాటి చిత్రాలు, చేపట్టిన ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక వివరాలు తదితరాలన్నింటినీ మంత్రుల బృందం పరిశీలించింది.
వాటికి సంబంధించిన ప్రణాళికలు, వ్యయాల అంచనాలను పరిశీలించింది. మరోవైపు ఇంచియాన్ నగరంలోని మురుగుశుద్ధి కేంద్రాన్ని కూడా మంత్రులు, అధికారుల బృందం సందర్శించింది. మురుగుశుద్ధి కోసం వాడుతున్న సాంకేతికతను ఆ కేంద్రం టీమ్ లీడర్ కిం యాంగ్.. పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సియోల్ నగరంలో మురుగును 50ఏళ్ల క్రితం వరకు హాన్ నదిలో కలిసే ఒక వాగులో వదిలేవారమని చెప్పారు. 1976నుంచి మురుగునీటి శుద్ధి మొదలుపెట్టామని వెల్లడించారు. అత్యాధునిక ఎంబీఆర్ సాంకేతికత పరిజ్ఞానంతో వీలైనంత ఎక్కువ శుద్ధి చేసిన నీటిని పొందవచ్చన్నారు. ఆ నీటిని ప్రజావసరాలకు, ల్యాండ్‌స్కేపింగ్ తదితర అవసరాలకు వాడతామని వివరించారు. మరోవైపు మంత్రులు, అధికారుల బృందం నాలుగు రోజుల సియోల్ పర్యటన ముగిసింది.
చంగ్ ఎ చంగ్, హాన్ నదుల అభివృద్ధి ప్రాజెక్టులు, సియోల్ నగర వ్యర్థాల నుంచి విద్యుత్తు తయారీ ప్లాంటు, మురికినీటి శుద్ధి ప్లాంటు, చంగ్ ఏ చంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మ్యూజియం, ఇంచియాన్ స్మార్ట్‌సిటీ సందర్శన, కొరియా స్పోర్ట్స్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి చర్చలు తదితర కార్యక్రమాలతో బృందం తీరిక లేకుండా గడిపింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎప్పటికప్పుడు ఇక్కడ పరిశీలించిన, అధ్యయనం చేసిన అంశాలను వివరించి రాష్ట్రంలో అవసరమైన మేరకు అనుసరించేందుకు తగిన కార్యాచరణపై చర్చలు చేసింది. గురువారం అర్ధరాత్రి తిరిగి హైదరాబాద్‌కు మంత్రులు, అధికారుల బృందం బయల్దేరింది.
Updated Date - Oct 25 , 2024 | 03:30 AM