Ponguleti: చంగ్ ఏ చంగ్ కళతో సియోల్‌కే అందం!
ABN, Publish Date - Oct 22 , 2024 | 03:11 AM
చంగ్ ఏ చంగ్ నది పునరుజ్జీవం మొత్తంగా సియోల్ నగరానికే కళ తెచ్చింది. ఒకప్పుడు పారిశ్రామిక అభివృద్ధి కోసం నదిపై ఫ్లై ఓవర్‌ను నిర్మించి.. తర్వాత మురుగు, కాలుష్యంతో రూపు కోల్పోయిన నది కోసం ఫ్లై ఓవర్‌ను కూల్చేసి.
పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా రవాణా కోసం ఫ్లైఓవర్
ఆపై నది పునరుద్ధరణ.. చెత్త నుంచి విద్యుదుత్పత్తి
చంగ్ ఏ చంగ్-మూసీకి ఎన్నో భిన్నత్వాలు
హైదరాబాద్‌లో మూసీ 55 కి.మీ. మేర ప్రవాహం
చంగ్ ఏ చంగ్ సియోల్‌లో 11 కిలోమీటర్ల మేరే
వెడల్పూ 30 మీటర్లు... కొన్నిచోట్ల అంతకన్నా తక్కువే
అభివృద్ధి చేయడంతో పర్యాటక ప్రాంతంగా మారిన వైనం
(సియోల్ నుంచి ఆంధ్రజ్యోతి ప్రత్యేక ప్రతినిధి): చంగ్ ఏ చంగ్ నది పునరుజ్జీవం మొత్తంగా సియోల్ నగరానికే కళ తెచ్చింది. ఒకప్పుడు పారిశ్రామిక అభివృద్ధి కోసం నదిపై ఫ్లై ఓవర్‌ను నిర్మించి.. తర్వాత మురుగు, కాలుష్యంతో రూపు కోల్పోయిన నది కోసం ఫ్లై ఓవర్‌ను కూల్చేసి.. నదికి సహజమైన మునుపటి రూపు కల్పించింది. గతంలో చెత్త నుంచి విద్యుదుత్పాదన కోసం నిర్మించిన ప్లాంటును కూడా తొలగించింది. ఇప్పుడా ఆ ప్రాంతాన్ని ఒక గ్రీన్‌పార్కుగా మార్చనుంది. ఒకప్పుడు పలు ఆసియా దేశాలతో పాటు వెనకబడిన దేశంగా ఉన్న దక్షిణ కొరియా కాలాగుణంగా వ్యూహాలతో అభివృద్ధి చెందిన దేశంగా మారింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు నేపథ్యంలో దక్షిణ కొరియాలోని చంగ్ ఏ చంగ్ నదిని కొన్ని నెలల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి కూడా సందర్శించారు.
సీఎం సూచనల మేరకు ఈ ప్రాజెక్టును శుక్రవారం మంత్రులు, మూసీ పరీవాహక ప్రాంతంలోని కొందరు ఎమ్మెల్యేలు, అధికారుల బృందం, పాత్రికేయుల బృందం కూడా పరిశీలించింది. ఇంతకీ ఆ ప్రాజెక్టు ఏమిటి? మూసీకి దానికి సారూప్యతలేమిటి? చంగ్ ఏ చంగ్ నది దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో 600 ఏళ్ల నుంచీ ఉంది. ఉత్తర కొరియాతో యుద్ధం ముగిశాక.. వేగవంతమైన ఆర్థిక వృద్ధిలో భాగంగా 1976లో ఈ నదిపై ఒక ఫ్లై ఓవర్ నిర్మించారు. పారిశ్రామిక రవాణా, వాహనాల రవాణాకు ఇది కీలకంగా ఉండేది. ప్రతిరోజు ఈ వంతెనపై 1.7 లక్షల వాహనాలు రాకపోకలు సాగించేవి. క్రమంగా అక్కడ మురుగు పేరుకుపోవడం, నదీ ప్రవాహం తీవ్రంగా కలుషితమవడం జరిగాయి. అయితే దేశం, సియోల్ అభివృద్ధి చెందాక.. 2002లో అదే ప్లై ఓవర్‌ను కూల్చేసి అక్కడ మళ్లీ పాత నదిని పునరుజ్జీవిపంజేసింది. అయితే ఆ పునరుజ్జీవం నదికే కాదు. ఆ సియోల్ నగరానికి కూడా అన్నట్లుగా చేసింది. మురికి కూపంలా ఉండే ప్రాంతాన్ని ఇప్పుడు ఆ నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటిగా మార్చింది. కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడింది. అన్నింటికీ మించి ఆ నగర ప్రజల జీవితాల్లో పునరుజ్జీవం నింపింది. ఇప్పుడది అత్యంత రద్దీ ప్రాంతం.
దానికి ఇరువైపులా భారీ ఐదు నక్షత్రాల హోటళ్లు. 20నుంచి 50అంతస్థుల వరకు ఉన్న కార్యాలయ సముదాయాల టవర్లు. అలాంటి ప్రదేశంలో ప్రజలకు స్వచ్ఛమైన గాలి పీల్చుకునేందుకు, కాసింత సేద దీరేందుకు అనువైన చోటు. దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకూ ఒక ఆకర్షణీయ ప్రాంతం. పునరుజ్జీవం విషయంలో మూసీ, చంగ్ ఏ చంగ్ ది ఒకటే కథ అయినా....అనేక విషయాల్లో మాత్రం భిన్నత్వం ఉంది. ముఖ్యంగా నిర్వాసితుల విషయం. ఈ నది విషయంలో నిర్వాసితులు పెద్దగా లేరు. మూసీ విషయంలో నిర్వాసితులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అదే సమయంలో మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు పొడవు హైదరాబాద్‌లోనే 55కిలోమీటర్లు. చియాంగ్ యాచిన్ నది పొడవు సియోల్‌లో 10.9 కిలోమీటర్లు మాత్రమే. వెడల్పు కూడా చాలా తక్కువ. దీని వెడల్పు కేవలం 30మీటర్లు మాత్రమే ఉంది. కొన్నిచోట్ల అంతకంటే తక్కువ కూడా ఉంది. దీన్ని ఒక నది అని కూడా అనలేం. ఒక సెలయేటి లాంటిది. దీని అడుగుభాగంలో రాళ్లను వేసి...స్టోన్ పిచ్చింగ్ చేశారు.
అంటే అడుగున మట్టి, బురద కాకుండా రాతినేలలా ఉంటుందన్న మాట. మరోవైపు దీనిలోతు కూడా మూడు అడుగులు మాత్రమే ఉంటుంది. ఎప్పుడైనా వరద వస్తే మాత్రం కొంత పెరుగుతుంది. వరద నీరు వచ్చినా అది వెళ్లిపోయేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. అయితే పునరుజ్జీవ ప్రాజెక్టు విషయంలో మాత్రం రెండింటి మధ్య సారూప్యతలున్నాయి. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు గోదావరి నీటిని వినియోగించాలని నిర్ణయించగా చంగ్ ఏ చంగ్ పునరుజ్జీవానికి ఇక్కడి హాన్ నది నీటిని వినియోగించారు. శుద్ధి చేసిన మురికినీరు మూసీలోకలపడం, శుద్ధికోసం ఎస్టీపీల ఏర్పాటు ఎలా జరుగుతుందో చంగ్ ఏ చంగ్ లో కూడా అలానే శుద్ధిచేసిన నీటిని కలుపుతున్నారు. ఇక్కడ శుద్ధిచేసిన నీటిని కలిపేందుకు, అదేవిధంగా వర్షాల సమయంలో భారీగా వచ్చే నీరు ఈ నదిలోనే కలిసేందుకు రెండు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటుచేశారు. ఈ ప్రాజెక్టు వల్ల ఇక్కడ పర్యావరణం మెరుగుపడింది. ఉష్ణోగ్రతలు ఆ చుట్టూపక్కల ప్రాంతాల కంటే 3-4 డిగ్రీలు తక్కువయ్యే స్థాయికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు. అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా ఒక ఆహ్లాదకర ప్రదేశం ఏర్పడింది. ఆ చుట్టుపక్కల ఉన్న ఉన్న భవనాలు, స్థలాల ధరలు కూడా బాగా పెరిగాయి. ఇతర ప్రాంతాల్లోని ధరల పెరుగుదల కంటే ఇక్కడ రెట్టింపు శాతం ఆస్తుల విలువలు పెరిగాయని స్థానికులు తెలిపారు.
ప్రతిరోజు 64వేలు.. ఇప్పటికి 20కోట్ల మంది సందర్శకులు
చంగ్ ఏ చంగ్ నదిపై ఉన్న ఫ్లైఓవర్‌ను తొలగించే సమయంలో 5లక్షల టన్నుల కాంక్రీట్‌ను తొలగించారు. నదిని పునరుద్ధరించాక 1.4 లక్షల మొక్కలను ఆ ప్రాంతంలో నాటారు. ఈ ప్రాజెక్టును 2003లో ప్రారంభించి 2005లో పూర్తిచేయగా...అప్పట్లో సుమారు రూ.1,550 కోట్లు ఖర్చయింది. ఇందులో 59శాతం బడ్జెట్ ప్రాజెక్టు నిర్మాణం కోసం, పునరావాసం కోసం 19 శాతం, డిజైన్, ప్రణాళిక కోసం ఐదుశాతం, ఈ నదికి ఇరువైపులా వేసిన చూడచక్కని బొమ్మలు, ల్యాండ్‌స్కేపింగ్ కోసం 4శాతం, ఇతర ఖర్చుల కింద 9శాతం ఖర్చయింది. ఈ నిధులను సియోల్ మెట్రోపాలిటన్ అఽథారిటీ 70శాతం, కేంద్ర ప్రభుత్వం 20శాతం, ప్రైవేటు రంగం నుంచి 10 శాత సమకూర్చుకున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక ఈ 19ఏళ్లలో 20కోట్లమంది దీన్ని సందర్శించారు. ప్రతిరోజు ఈ నదిని సుమారు 64వేల మంది సందర్శిస్తారు. కొరియా ప్రభుత్వంతో పాటు అప్పటి సియోల్ మేయర్‌గా పని చేసిన లీ మ్యుంగ్ బాక్ ఈ ప్రాజెక్టు విషయంలో శ్రద్ద చూపించారు. ఆ తర్వాత 2008లో అతను ఏకంగా దక్షిణకొరియా అధ్యక్షుడయ్యారు. అయి తే అధ్యక్ష పదవీకాలం ముగిశాక ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో అరెస్టు కూడా అయ్యారు.
చెత్త నుంచి సంపద...
అత్యంత పెద్ద నగరాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య చెత్త నిర్వహణ. సియోల్‌లో కూడా ఒకప్పుడు డంపింగ్ ప్రాంతంలో 15 ఏళ్లపాటు వేసిన చెత్త...దాదాపు 100 మీటర్లు ఎత్తుకు పేరుకుపోయింది. ఈ చెత్తను సంపదగా మార్చేందుకు సియోల్ మెట్రోపాలిటన్ అఽథారిటీ వినూత్నంగా ముందుకెళ్లింది. చెత్తను అత్యధిక ఉష్ణోగ్రతల మధ్య మండించి విద్యుత్తుగా తయారుచేసే ప్లాంట్లను నె లకొల్పింది. మాపో రిసోర్స్ రికవరీ ఫెసిలిటీ దీని పేరు. ఇలాంటి ప్లాంటు జవహర్‌నగర్‌లోనూ ఉంది. జవహర్‌నగర్ ప్లాంటులో ఒక టన్ను చెత్త రీసైక్లింగ్‌కు రూ.3,500 ఖర్చవుతుండగా సియోల్‌లో రూ.5,500 ఖర్చవుతుంది. అయితే సియోల్‌లో ప్రభుత్వమే ఆ ప్లాంటును నడుపుతోంది. అదేవిధంగా విద్యుత్తును అమ్మితే వచ్చే ఆదాయమూ ప్రభుత్వానిదే. ఇప్పుడు లాభాలబాటకు ఈ వ్యవస్థ చేరుకుందని సియోల్ మెట్రోపాలిటన్ అభివృద్ధి అథారిటీ డిప్యూటీ డైరక్టర్ తెలిపారు.
జవహర్‌నగర్ ప్లాంటును మాత్రం రామ్‌కీ సంస్థ నిర్వహిస్తోంది. ఆ సంస్థకు ఒక టన్ను చెత్త ప్రాసెస్ చేసినందుకు సుమారుగా రూ.3,500ల వరకు చెల్లిస్తున్నారు. మరోవైపు సియోల్‌లో ఒకే చోట చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్లను నిర్మించలేదు. మొత్తం ఐదుచోట్ల ఈ ప్లాంట్లు పెట్టారు. ఒక్కోటి ఐదు మెగవాట్ల చొప్పున 25మెగావాట్ల విద్యుత్తునుఈ ప్లాంట్లు ఉత్పత్తి చేస్తున్నాయి. అదే సమయంలో సియోల్ ప్లాంటులో ప్లాంటు నుంచి గాలిలోకి వదిలే వాయువులనూ శుద్ది చేసి వదులుతున్నారు. హైదరాబాద్‌లో ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. మరోవైపు ఈ మాపో ప్లాంటును 2035 వరకు కొనసాగించి ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని పార్కుగా మార్చనున్నారని అక్కడి అధికారులు తెలిపారు. మరోవైపు దీనికి పక్కనే మరో భారీ ప్లాంటును భూగర్బంలో నిర్మించడం ప్రారంభమైంది. 2026కల్లా ఈ భూగర్బ ప్లాంటు పూర్తవుతుంది. చెత్తే కాదు...చెత్తనుంచి విద్యుదుత్పత్తి ప్లాంటు కూడా భూమిపై కనిపించకుండా భూగర్భంలో నిర్మిస్తుండడం కొసమెరుపు.
హైదరాబాద్‌లోనూ నాలుగువైపులా ప్లాంట్లు: దానకిశోర్
హైదరాబాద్‌లో కూడా నగరానికి నాలుగువైపులా చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్లు పెడతామని ముఖ్య కార్యదర్శి దానకిషోర్ తెలిపారు. హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ దేశంలోనే ఒక అత్యుత్తమ చెత్త నిర్వహణ ప్లాంట్ అన్నారు. సియోల్‌లో చెత్త నుంచి విద్యుత్తు తయారుచేసే కేంద్రాలు ఐదు ఉండడం వల్ల చెత్త రవాణా ఖర్చు తగ్గుతుందన్నారు. సీఎం రేవంత్ హైదరాబాద్‌లో కూడా నాలుగువైపులా చెత్త నిర్వహణ.. విద్యుదుత్పత్తి కేంద్రాలు పెట్టేందుకు స్థలాలు చూడాలని నిర్దేశించారన్నారు. అందుకే సంగారెడ్డి జిల్లాలోని ప్యారానగర్‌లో 150ఎకరాలు, శంషాబాద్ వైపు 50ఎకరాలు, యాదాద్రి, భువనగిరి వైపు 200 ఎకరాలు గుర్తించామన్నారు. అక్కడ ప్లాంట్‌లు పెడతామన్నారు.
Updated Date - Oct 22 , 2024 | 03:11 AM