మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana : రోడ్డు ప్రమాదమా? హత్యా?

ABN, Publish Date - May 29 , 2024 | 04:04 AM

ఖమ్మం జిల్లాలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారు రహదారి పక్కన చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ కారులో ప్రయాణిస్తున్న ఓ కుటుంబంలోని భార్య, ఇద్దరు చిన్నారులు మరణించగా, కారు నడిపిన భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

Telangana : రోడ్డు ప్రమాదమా? హత్యా?

  • ఖమ్మం జిల్లాలో చెట్టును ఢీ కొట్టిన కారు

  • భార్య, పిల్లలు మృతి, భర్త సురక్షితం

  • అల్లుడే హత్య చేశాడని..

  • మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ

రఘునాథపాలెం, మే 28: ఖమ్మం జిల్లాలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారు రహదారి పక్కన చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ కారులో ప్రయాణిస్తున్న ఓ కుటుంబంలోని భార్య, ఇద్దరు చిన్నారులు మరణించగా, కారు నడిపిన భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అయితే, ఆ దంపతుల మధ్య ఏడాదిగా నెలకొన్న మనస్పర్ధల వల్ల అది నిజంగా రోడ్డు ప్రమాదమా? లేదా హత్యా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అల్లుడే పథకం ప్రకారం తమ కూతురు, మనమరాళ్లను హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

వారి కథనం ప్రకారం.. జిల్లాలోని ఏన్కూరు మండలం రామ్‌నగర్‌తండాకు చెందిన ధరంసోత్‌ హరిసింగ్‌ చిన్న కుమార్తె కుమారి, రఘునాథపాలెం మండలం భావోజీతండాకు చెందిన బోడా ప్రవీణ్‌కు 2017లో వివాహమైంది. ఫిజియోథెరఫీ చదివి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యుడిగా పని చేసే ప్రవీణ్‌కు వివాహ సమయంలో రూ.25 లక్షలు కట్నంగా ఇచ్చారు. కుమారి, ప్రవీణ్‌ దంపతులకు కృషిక(5), కృతిక(3) కుమార్తెలు ఉన్నారు. కుమారి, ప్రవీణ్‌ మధ్య 11 నెలలుగా మనస్పర్ధలు ఉన్నాయి. వరుసగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని ప్రవీణ్‌ తరచూ కుమారిని వేధించేవాడు.


అంతేకాక, ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేసే కేరళకు చెందిన అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రవీణ్‌ ఆమెతో కలిసి కేరళ వెళ్లిపోయాడు. ఆ తర్వాత ప్రవీణ్‌ ఆచూకీ కనుగొని తీసుకువచ్చిన కుమారి తల్లిదండ్రులు హన్మకొండ ప్రాంతంలో పసరు మందు తాగించారు. అయినా తీరు మార్చుకోని ప్రవీణ్‌.. భార్య కుమారిని చంపేస్తానంటూ బెదిరించేవాడు. పెద్ద మనుషుల పంచాయితీ అనంతరం భార్యాబిడ్డలతో కలిసి ఉంటున్న ప్రవీణ్‌ కుటుంబంతో సహా 20 రోజుల క్రితం భావోజితండాకు వచ్చాడు.

మే 25న ప్రవీణ్‌ దంపతుల పెళ్లి రోజు కాగా.. ఆ రోజు ప్రవీణ్‌ అందుబాటులో లేకపోవడంతో కుమారి, పిల్లలతో కలిసి కేక్‌ కట్‌ చేసింది. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో తన తమ్ముడితో వాట్సాప్‌లో చాటింగ్‌ చేసిన కుమారి..తమ్ముడా ఉదయం ఇంటికి వస్తా.. నేను ఇక్కడ ఉండలేక పోతున్నా.. నా వల్ల కాదు’ అంటూ కన్నీరు పెడుతున్న ఫొటోలు పంపింది. స్పందించిన ఆమె సోదరుడు.. ఉదయం వస్తా, బావ కూడా వస్తా అన్నాడు అని బదులిచ్చాడు. మంగళవారం సాయంత్రం మంచుకొండ నుంచి భావోజీతండాకు ప్రవీణ్‌ తన భార్యాబిడ్డలతో కలిసి వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న కారు రహదారి పక్కన ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో వున్న కృషిక, కృతిక అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రగాయాలపాలైన కుమారి ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూసింది. ప్రవీణ్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. దీంతొ కుమారి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 29 , 2024 | 08:01 AM

Advertising
Advertising